భారత్‌తో పాటు యావత్ క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇవాళ్లీ నుంచి మొదలైంది. అడిలైడ్‌ వేదికగా మొదలైన మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు అదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు కెఎల్ రాహుల్, మురళీ విజయ్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరారు.

అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలదొక్కుకునేందుకు ప్రయత్నించినప్పటికీ కమిన్స్ బౌలింగ్‌లో ఆఫ్‌సైడ్ బంతిని డ్రైవ్ చేయడానికి ప్రయత్నించగా... ఖవాజా చేతికి చిక్కాడు..దీంతో భారత్ 19/3తో స్కోరుతో పీకల్లోతు కష్టాల్లో పడింది. మరోవైపు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ పుజారా మాత్రం ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు.

వికెట్లు పడుతున్నా సంయమనంతో ఒంటరి పోరాటం చేసి సెంచరీ సాధించాడు.. ఇది అతనికి టెస్టుల్లో 16వ సెంచరీ.. ఇక కోహ్లీ స్థానంలో క్రీజులోకి వచ్చిన రహానె చెత్త షాట్ ఆడి హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఈ క్రమంలో పుజారా-రోహిత్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

వన్డే తరహా ఆటతో ఫోర్లు, సిక్సర్లతో రోహిత్ మెరుపులు మెరిపించాడు. ఇన్నింగ్స్ గాడిలో పడుతుందనుకున్న సమయంలో అనవసర షాట్‌కు ప్రయత్నించి రోహిత్ 37 పరుగుల వద్ద అవుటయ్యాడు. అయితే అశ్విన్ తోడుగా పుజారా స్కోరును నెమ్మదిగా కదిలించి ఎనిమిదో వికెట్‌కు విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

టీ సెషన్ తర్వాత కమ్మిన్స్ బౌలింగ్‌లో అశ్విన్ అవుటయ్యాడు, ఆ వెంటనే ఇషాంత్ కూడా వెనుదిరిగాడు.. ఈ క్రమంలో పుజారా సెంచరీ పూర్తి చేసుకుని మొదటి రోజు ఆట ముగుస్తుందనుకున్న సమయంలో రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్ 87.5 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి మొదటి రోజు ఆటను ముగించింది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, హేజల్‌వుడ్, కుమ్మిన్స్, నాథన్ లేన్ తలో 2 వికెట్లు పడగొట్టారు.