బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరుగుతున్న ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో యూపీ యోదాస్ అద్భుత విజయాన్ని సాధించింది. వరుస విజయాలతో పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానాన్ని ఆక్రమించిన బెంగాల్ వారియర్స్ తో హోరాహోరీగా తలపడి యోదాస్ చివరికి పైచేయి సాధించింది. అయితే వారియర్స్ ఆటగాళ్ళు కూడా చివరివరకు ఓటమిని అంగీకరించకుండా పోరాడినా ఫలితం లేకుండాపోయింది. కేవలం 3 పాయింట్ల తేడాతో యూపీ యోదాస్ విజేతగా నిలిచింది. 

యూపీ యోదాస్ స్టార్ రైడర్ శ్రీకాంత్ జాదవ్ 9 పాయింట్లతో ఈ మ్యాచ్ లో టాప్క స్కోరర్ గా నిలిచాడు. అలాగ్ నీతేశ్ కుమార్ కూడా 7 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. మిగతావారిలో సుమిత్ 4, అషు 2, అమిత్ 2, సురేందర్ 2, అంకుశ్ 2 పాయింట్లతో జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు.  ఇలా యూపీ రైడింగ్ లో 12, ట్యాకిల్స్ లో 16, ఆలౌట్ల ద్వారా 2, ఎక్స్‌ట్రాల రూపంలో మరో 2 మొత్తం 32 పాయింట్లు సాధించి విజయాన్ని అందుకుంది. 

బెంగాల్ వారియర్స్ విషయానికి వస్తే రైడింగ్ లో 15 పాయిట్లతో యూపీపై పైచేయి సాధించింది. కానీ ట్యాకిల్స్ లో కేవలం 12 పాయింట్లు మాత్రమే సాధించి వెనుబడింది. అలాగే ప్రత్యర్ధికి  ఒక్కసారి కూడా ఆలౌట్ చేయలేకపోయింది. ఎక్స్‌ట్రాల రూపంలో 2 పాయింట్లు సాధించి మొత్తంగా 29 పాయింట్లకు చేరుకుంది. అయినప్పటికి యూపీ కంటే మూడు పాయింట్లు వెనుకబడింది. 

బెంగాల్ ఆటగాళ్లలో ఇస్మాయిల్ 7, బల్దేవ్ 5, ప్రభంజన్ 4 పాయింట్లతో రాణించారు. మణీందర్ సింగ్ 3, రింకు 3, మయూర్ 2, సుఖేష్ 2 పాయింట్లు సాధించారు. ఇలా ఆటగాళ్లు బెంగాల్ ను గెలిపించుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు. కానీ 32-29 తేడాతో తృటిలో విజయాన్ని మిస్సయ్యారు.