సొంత మైదానంలో జరిగిన చివరి మ్యాచ్ లో పాట్నా పైరేట్స్ జట్టు అదరగొట్టింది. పాటలిపుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో యూపీ యోదాస్ తో తలపడ్డ పైరేట్స్ ఏకంగా  21 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పాట్నా స్టార్ రైడర్ ప్రదీపై నర్వాల్ 12 పాయింట్లతో ఆకట్టుకుని తమ జట్టుకు మంచి ఆధిక్యాన్ని అందించాడు. పాట్నా రైడర్స్ కి తోడుగా డిఫెండర్స్ కూడా అద్బుతంగా రాణించి యూపీని ఓడించడంలో ప్రముఖ పాత్ర వహించారు. 

పైరేట్స్ జట్టు రైడింగ్ లో 17, ట్యాకిల్స్ లో 16, ప్రత్యర్ధిని 3సార్లు ఆలౌట్ చేయడం ద్వారా 6, ఎక్స్‌ట్రాల రూపంలో 2 పాయింట్లు సాధించింది.  ఇలా మొత్తంగా 41 పాయింట్లతో యూపీ యోదాస్ పై తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించింది. ఆటగాళ్లలో  ప్రదీప్ నర్వాల్ 12, నీరజ్8, లీ జంగ్ 5, వికాస్ 3, జయదీప్ 3, మోను 2 పాయిట్లు సాధించారు. 

ఇక యూపీ యోదాస్ రైడర్స్ 14 పాయింట్లతో పదవాలేదనిపించినా డిఫెండర్స్ మాత్రం చెత్త ప్రదర్శన చేశారు. కేవలం ట్యాకిల్స్ లో 5 పాయింట్లు మాత్రమే సాధించడం యూపీ ఓటమికి కారణమయ్యింది. ఆటగాళ్లలో సుమిత్ 5, మోను 4, సురేందర్ 3, అజాద్ సింగ్ 3 పాయింట్లు సాధించారు. మిగతా ఆటగాళ్లెవరూ కనీస పాయింట్లు సాధించలేకపోవడంతో యూపీ ఘోర ఓటమిని చవిచూసింది.