ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7లో తెలుగు టైటాన్స్ ఆటతీరు ఏమాత్రం మారడంలేదు. టోర్నీ ఆరంభ మ్యాచ్ మొదలు ఇప్పటివరకు వరుస ఓటములతో సతమతమవుతున్న టైటాన్స్ పాయింట్స్ టేబుల్ లో అట్టడుగున నిలిచింది. అడపాదడపా ఒకటిరెండు విజయాలు సాధించినా వాటివల్ల ఒరిగిన లాభమేమీ లేదు. తాజాగా బెంగాల్ వారియర్స్ తో ఓటమి ద్వారా తెలుగు టైటాన్స్ 2019 ప్రోకబడ్డి టైటిల్ రేసులో నుండి దాదాపు తప్పుకున్నట్లే. 

జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ ఇండోర్ స్టేడయంలో జరిగిన ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. చివరివరకు టైటాన్స్, వారియర్స్ నువ్వా నేనా అన్నట్లు పోరాడగా కేవలం 1 పాయింట్ తేడాతో బెంగాల్ విజేతగా నిలిచింది. వారియర్స్ ఆటగాడు మణీందర్ సింగ్ 17 పాయింట్లతో రాణించి ఈ విజయంలో కీలకపాత్ర పోషించాడు. టైటాన్స్ స్టార్ రైడర్ సిద్దార్థ్ దేశాయ్ 15 పాయింట్లతో రాణించినా ఫలితం లేకుండాపోయింది. 

మిగతా ఆటగాళ్లలో బెంగాల్ తరపున సుఖేష్ హెగ్డే 5, బల్దేవ్ 3, రింకు 3, జీవ 2, ఇస్మాయిల్ 2 పాయింట్లు సాధించారు. టైటాన్స్ ఆటగాళ్లలో రజనీశ్ 6, రాకేశ్ 5, అబోజర్ 5, ఫహద్ 3, విశాల్ 1, కృష్ణ 1 పాయింట్ సాధించారు. 

జట్ల విషయానికి వస్తే బెంగాల్ రైడింగ్ లో 24, ట్యాకిల్స్ 8, ఆలౌట్ల ద్వారా 4, ఎక్స్‌ట్రాల ద్వారా మరో 4 మొత్తంగా 40 పాయింట్లు సాధించింది. టైటాన్స్ జట్టు రైడింగ్ లో 30, ట్యాకిల్స్ లో 7, ఆలౌట్ల ద్వారా 2, ఎక్స్ ట్రాల రూపంలో 1 మొత్తం 39 పాయింట్లు సాధించి కేవలం 1 పాయింట్ తేడాతో ఓటమిని చవిచూసింది.