ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో బెంగాల్ వారియర్స్ మరో అద్భుత విజయాన్ని అందుకుంది. పాట్నాలోని పాటలిపుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో యూ ముంబా తో హోరాహోరీగా పోరాడి చివరకు విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో ముంబై రైడర్ అర్జున్ దేశ్వల్ 10 పాయింట్లతో అదరగొట్టినా ఫలితం లేకుండా పోయింది. బెంగాల్ జట్టు ఆటగాళ్లు సమిష్టిగా పోరాడి తలో కొన్ని పాయింట్లు సాధించి విజయాన్ని అందుకున్నారు. అయితే చివర్లో మ్యాచ్ ఉత్కంఠకు దారితీయగా బెంగాల్ ఆటగాళ్ల సమయోచిత ఆటతీరు విజయాన్ని కట్టబెట్టింది. 

ముంబై రైడింగ్ లో 13, ట్యాకిల్స్ లో 10, ఆలౌట్ల ద్వారా  4, ఎక్స్‌ట్రాల ద్వారా మరో 3 ఇలా మొత్తంగా 30 పాయింట్లు సాధించింది. అయితే ఈ 30లో పది పాయింట్లను అర్జున్ ఒక్కడే సాధించాడు. మిగతావారిలో సురీందర్ 4, సందీప్ నర్వాల్ 3, రోహిత్ బలియాన్ 2, ఫజల్ 2 పాయింట్లతో పరవాలేదనిపించారు. 

ఇక బెంగాల్ జట్టులో ప్రపంజన్ సాధించిన 6 పాయింట్లు హయ్యెస్ట్. అయితే మణిందర్ 5, బల్దేవ్ 5, జీవ 4, ఇస్మాయిల్ 3, రాకేశ్ 3 పాయింట్లతో జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. ఇలా రైడింగ్ లో 18, ట్యాకిల్స్ లో 10, ఆలౌట్ ద్వారా 4, ఎక్స్‌ట్రాల రూపంలో 1 మొత్తం  32 పాయింట్లను సాధించింది. ఇలా ముంబై పై కేవలం రెండు పాయింట్ల ఆధిక్యంతో బెంగాల్ విజయాన్ని అందుకుంది.