మహిళల క్రికెట్ ప్రపంచకప్‌లో పాకిస్తాన్ పై బంగ్లాదేశ్ అద్భుత విజయం సాధించింది. పాకిస్థాన్ నిర్దేశించిన 130 పరుగుల లక్ష్యాన్ని, 54 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన రుబ్యా హైదర్ మెరుపులతో బంగ్లాదేశ్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

బంగ్లాదేశ్ చేతిలో పాక్ ఘోర ఓటమి

మహిళల క్రికెట్ ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయింది. కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ నిర్దేశించిన 130 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. 54 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన రుబ్యా హైదర్ బంగ్లాదేశ్‌కు విజయాన్ని అందించింది. కెప్టెన్ నిగర్ సుల్తానా, శోభన మోస్తారీ కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు. చిన్న లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 31.1 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది.

కొలంబో ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ కేవలం 38.3 ఓవర్లలో 129 పరుగులకే ఆలౌట్ అయింది. మూడు వికెట్లు తీసిన షోర్నా అక్తర్, చెరో రెండు వికెట్లు పడగొట్టిన మరూఫా అక్తర్, నహిదా అక్తర్ పాకిస్తాన్ ను కుప్పకూల్చారు. అంతకుముందు, టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా బ్యాటింగ్ ఎంచుకుంది.

బంగ్లా బౌలర్ల ధాటికి పాక్ విలవిల

కెప్టెన్ నిర్ణయం తప్పని నిరూపిస్తూ పాకిస్తాన్ ఇన్నింగ్స్ మొదలైంది. రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. మొదటి ఓవర్‌లోనే ఒమైమా సోహైల్ (0), సిద్రా అమీన్ (0) వెనుదిరిగారు. ఇద్దరినీ మరూఫా వరుస బంతుల్లో బౌల్డ్ చేసింది. ఆ తర్వాత మునీబా అలీ - రమీమ్ షమీమ్ 42 పరుగులు జోడించారు. కానీ వెంటనే మరో రెండు వికెట్లు పడ్డాయి. మునీబా (17), రమీమ్ (23)లను నహీదా అక్తర్ పెవిలియన్ పంపింది. దీంతో పాకిస్తాన్ 47 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన వారిలో సనా (22) మాత్రమే కాసేపు నిలబడింది. అలియా రియాజ్ (13), సిద్రా నవాజ్ (15), నతాలియా పర్వేజ్ (9), నష్రా సంధు (1), సాదియా ఇక్బాల్ (4) ఔటైన ఇతర క్రీడాకారులు. డయానా బేగ్ (16) నాటౌట్‌గా నిలిచింది.

130 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి బంగ్లాదేశ్ జట్టు కాస్త జాగ్రత్తగా ఆరంభించింది. పవర్‌ప్లేలో కేవలం 23 పరుగులకే పరిమితమవ్వడంతో పాకిస్థాన్‌కు ఒక దశలో ఆశలు పెరిగాయి. డయానా బైగ్ మంచి బౌలింగ్ చేసి ఫార్గనా హక్ (0) వికెట్ తీసి ఒత్తిడి పెంచింది.

అయితే, కెప్టెన్ నిగర్ సుల్తానా (23) క్రీజులోకి వచ్చాక రుబ్యాతో కలసి 62 పరుగుల భాగస్వామ్యం చేయడం గేమ్ టర్నింగ్ పాయింట్‌గా మారింది. జెలిక్ ధైర్యంగా షాట్లు ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. చివర్లో మోస్టరీ (24 నాటౌట్) బౌండరీలతో మ్యాచ్‌ను ముగించారు.

భారత మ్యాచ్ ముందు పాకిస్తాన్ కు షాక్

ఈ ఓటమితో పాకిస్థాన్ జట్టు సమస్యలు స్పష్టమయ్యాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ స్పిన్ బౌలర్లకు బలహీనత చూపడం మేనేజ్‌మెంట్‌కు ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే, వచ్చే మ్యాచ్‌లో పాకిస్థాన్ భారత జట్టుతో తలపడనుంది. భారత జట్టులో దీప్తి శర్మ, స్నేహ్ రాణా, చరణి వంటి స్పిన్నర్లు ఉండటంతో, పాకిస్థాన్ బ్యాటర్లకు ఇది మరింత కఠిన పరీక్షగా మారనుంది.