మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య మూడో వన్డేలో కివీస్ చేతిలో టీమిండియా ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కివీస్ బౌలర్ల ధాటికి 149 పరుగులకే అలౌటైంది. తొలి రెండు వన్డేల్లో అదరగొట్టిన స్మృతి మంథాన, రోడ్రిగ్స్, కెప్టెన్ మిథాలీ రాజ్‌లు ఈ మ్యాచ్‌లో వెంట వెంటనే పెవిలియన్ చేరడంతో భారత్ కష్టాల్లో పడింది.

ఈ దశలో దీప్తి శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్‌లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. నాలుగో వికెట్‌కు 48 పరుగులు జోడించిన ఈ జోడి ప్రమాదకరంగా మారుతున్న దశలో అన్నా పీటర్సన్ ఈ జంటను విడదీసింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా దీప్తీ ఒంటరి పోరాటం చేసింది.

ఈ క్రమంలో అర్థసెంచరీ చేసిన దీప్తి శర్మను పీటర్సన్ పెవిలియన్‌కు పంపింది. చివర్లో టెయిలెండర్లు రాణించడంతో టీమిండియా కాస్తయినా పరువు దక్కించుకుంది. భారత్ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని కివీస్ అలవోకగా చేధించింది.

సజై బేట్స్ 57, కెప్టెన్ సాటర్త్ వెయిట్‌ 66 పరుగులతో రాణించడంతో న్యూజిలాండ్ కేవలం 29.2 ఓవర్లలోనే టార్గెట్ అందుకుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో రెండు వన్డేలను గెలిచిన భారత్‌ సిరీస్ కైవసం చేసుకోగా... చివరి మ్యాచ్‌లో గెలిచి కివీస్ క్లీన్‌స్వీప్ గండం నుంచి గట్టెక్కింది.

4 వికెట్లు తీసి న్యూజిలాండ్ విజయంలో కీలకపాత్ర పోషించిన అన్నా పీటర్సన్‌కు ‘‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’’.. ఈ సిరీస్‌లో పరుగుల వరద పారించిన టీమిండియా ఓపెనర్ స్మృతి మంధనాకు ‘‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’’ అవార్డు గెలుచుకుంది.