టార్గెట్ మిస్ అయినా టైటిల్ నీరజ్‌దే.. డైమండ్ లీగ్‌లో గోల్డెన్ బాయ్ శుభారంభం
Neeraj Chopra: భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరోసారి మెరిశాడు. అంతర్జాతీయ వేదికలపై తనకు తిరుగులేదని నిరూపించాడు.
రెండేండ్ల క్రితం టోక్యో (జపాన్) వేదికగా ముగిసిన ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరోసారి అంతర్జాతీయ వేదిక మీద సత్తా చాటాడు. దోహా వేదికగా శుక్రవారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) ముగిసిన దోహా డైమండ్ లీగ్ -2023లో టైటిల్ కొట్టాడు. గత డైమండ్ లీగ్ లో విజేతగా నిలిచిన నీరజ్.. తొలి అంచె పోటీలలో టైటిల్ నెగ్గాడు.
శుక్రవారం రాత్రి నీరజ్ చోప్రా.. ఫస్ట్ అటెంప్ట్ లోనే 88.67 మీటర్ల దూరం విసిరి తన విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. తన సమీప ప్రత్యర్థి జాకబ్ వాద్లిచ్ కూడా నీరజ్ కు దగ్గరగా వచ్చాడు. వాద్లిచ్ 88.63 మీటర్ల దూరంతో రెండో స్థానంలో నిలిచాడు.
ఫస్ట్ త్రో లోనే 88.67 మీటర్ల దూరం విసిరిన నీరజ్ తర్వాత మాత్రం ఆ దూరాన్ని దాటలేకపోయాడు. ఈ సీజన్ లో ‘టార్గెట్ 90’గా పెట్టుకున్న ఈ గోల్డెన్ బాయ్.. దోహాలో కూడా తృటిలో దానిని మిస్ అయ్యాడు.
నీరజ్ త్రో వివరాలు : (మొత్తం ఆరు ప్రయత్నాలలో)
1. 88.67 మీటర్లు
2. 86.04 మీటర్లు
3. 85.47 మీటర్లు
4. ఫౌల్
5. 84.37 మీటర్లు
6. 86.52 మీటర్లు
గతేడాది స్టాక్‌హోమ్ వేదికగా ముగిసిన డైమండ్ లీగ్ ఫైనల్ లో నీరజ్ 88.44 మీటర్ల దూరం విసిరి స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. దానితో పోల్చితే తాజా రికార్డు కాస్త మెరుగైనప్పటికీ ఈ సీజన్లో 90 మీటర్ల దూరం అందుకోవాలన్న నీరజ్ కల నెరవేరలేదు. కాగా దోహా డైమండ్ లీగ్ లో నీరజ్, వాద్లిచ్ తర్వాత గ్రెనెడా ఆటగాడు, వరల్డ్ ఛాంపియన్ గా ఉన్న అండర్సన్ పీటర్స్ మాత్రం 85.88 మీటర్ల దూరం మాత్రమే విసరగలిగాడు. కాగా దోహా డైమండ్ లీగ్ గెలిచిన నీరజ్ పై కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లతో పాటు మరికొంతమంది ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
పదో స్థానంలో ఎల్డోస్ పాల్..
దోహా డైమండ్ లీగ్ లో జావెలిన్ త్రో తో పాటు పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్ లో ఎల్డోస్ పాల్.. పదో స్థానానికి పరిమితమయ్యాడు. గతేడాది ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం సాధించిన ఎల్దోస్ పాల్ ఈ సీజన్ ను నిరాశజనకంగా స్టార్ట్ చేశాడు.