పేలవ ఫాం కారణంగా అంతర్జాతీయ టీ20లలో ఇక మహేంద్ర సింగ్ ధోని శకం ముగిసిందని అభిమానులు నిరాశలో మునిగిపోయిన వేళ.. ధోనీకి మరోసారి అవకాశం కల్పించారు సెలక్టర్లు. న్యూజిలాండ్‌తో ఫిబ్రవరిలో జరిగే టీ20 సిరీస్ కోసం ధోనిని ఎంపిక చేశారు.

వెస్టిండీస్‌, ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌కు సెలక్టర్లు ధోనీని పక్కనబెట్టడంతో పొట్టి క్రికెట్‌లో ధోనీ ఆటకు ఫుల్‌స్టాప్ పడినట్లేనని అంతా భావించారు. అయితే ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మహేంద్రుడిపై కరుణ చూపింది.

ఆస్ట్రేలియాతో వన్డే, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ కోసం భారత జట్టును సోమవారం ముంబైలో ప్రకటించారు. ధోనీ స్థానంలో వికెట్ కీపింగ్ బాధ్యతలు నెరవేర్చిన రిషబ్ పంత్ వన్డే జట్టులో స్థానం కోల్పోగా... గత టీ20 టీమ్‌లో ఉన్న మనీష్ పాండే, శ్రేయస్ అయ్యర్‌‌లకు ఈసారి చోటు దక్కలేదు.

హార్డ్ హిట్టర్ హార్డిక్ పాండ్యా తిరిగి జట్టులోకి రాగా... జాదవ్ కూడా ఛాన్స్ కొట్టేశాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ తర్వాత జనవరి 12 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో భారత్ పాల్గొనుంది. అదే నెల 23 నుంచి న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్, ఫిబ్రవరి 6 నుంచి మూడు టీ20 సిరీస్ ప్రారంభంకానుంది.