హైదరాబాదీ సొగసరి బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. తన ఆటోబయోగ్రఫీ ‘‘281 అండ్ బియాండ్‌’’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆయన తన ఆరాధ్య క్రికెటర్ జీఆర్ విశ్వనాథ్‌కు బహుకరించారు. అంతేకాదు.. తన స్వహాస్తాలతో ప్రత్యేక సందేశాన్ని రాసి పంపారు. గురువారం బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో తన సహచర క్రికెటర్లుతో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా తన క్రీడాజీవితంలో ముఖ్యమైన ఘట్టాలను లక్ష్మణ్ గుర్తు చేసుకున్నారు. తన కెరీర్‌లో అన్ని రకాలుగా అండగా ఉన్న తన మిత్రులు, శ్రేయోభిలాషులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ తన జీవితకథను జీఆర్ విశ్వనాథ్‌కు సమర్పించారు.  

నా దృష్టిలో ఆయన ఒక ‘‘జీనియస్’’ అని క్రికెటర్‌గా తన ఎదుగుదలలో ఆయన ఎంతో స్పూర్తినిచ్చారని తెలిపాడు. 1983లో కపిల్ సారథ్యంలోని టీమిండియా ప్రపంచకప్‌ను గెలవడంతో తాను కూడా క్రికెటర్ కావాలని కలలు కన్నట్లు లక్ష్మణ్ గుర్తు చేసుకున్నారు.

అప్పుడు తన ఇంటి పక్కన వున్న పిల్లలతో క్రికెట్ ఆడుతున్నానని... అయితే ఏదో ఒక రోజు దేశం తరపున ఆడతానని తాను గట్టిగా సంకల్పించుకున్నట్లు చెప్పాడు. ఇదే క్రమంలో తనను జీవితకథ రాసేలా పురిగొల్పిన సంఘటనను తెలిపాడు.

క్రికెట్‌కు విరామం ప్రకటించిన తర్వాత 2012లో తాను గోవాలో ఒక మల్టీనేషనల్ కంపెనీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నానని ఈ క్రమంలో ఓ పెద్దాయన తనతో 45 నిమిషాలు మాట్లాడారని చెప్పాడు.

‘‘బాబు నువ్వు నాతో మాట్లాడిన ఈ కొద్ది సమయంలో నీ మాటలు నన్ను ఎంతో ఆలోచింపచేశాయి, స్ఫూర్తినింపాయి. అయితే ఇది నా ఒక్కడితో ఆగిపోకూడదు.. నా కుమారుడు, నా మనుమడికి కూడా తెలియాలి.. నువ్వు పుస్తకం ఎందుకు రాయకూడదని నన్ను ప్రశ్నించాడని లక్ష్మణ్ తెలిపారు.

తన క్రీడాజీవితంలో తాను ఎన్నో ఎత్తు పల్లాలను చూశానని..కానీ ఇంతవరకు ఎలాంటి వివాదాల జోలికి వెళ్లలేదని లక్ష్మణ్ తెలిపాడు. ఒక కుర్రాడు తన జీవిత లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడో ఇందులో వివరించానని వీవీఎస్ వెల్లడించాడు.