టీం ఇండియా మాజీ కెప్టెన్, సీనియర్ క్రికెటర్ కపిల్ దేవ్ కనుక ప్రస్తుతం ఐపీఎల్ వేలంలో ఉంటే రూ.25కోట్లు పలికి ఉండేవాడని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఐపీఎల్ -2019కి వేలం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. గవాస్కర్ పైవిధంగా వ్యాఖ్యానించారు.కపిల్ గొప్ప ఆటగాడని గవాస్కర్ కొనియాడారు. కపిల్ జింబాంబ్వే పై ఆడిన(175 పరుగులు) ఇన్నింగ్స్ ని మళ్లీ తాను ఇంతవరకు చూడలేదన్నారు.  

ఓ ప్రముఖ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విశేషాల గురించి సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. ‘ఓ ఆటగాడిగా.. కామెంటేటర్‌గా వన్డే చరిత్రలోనే అదో గొప్ప ఇన్నింగ్స్‌. మళ్లీ ఇంతవరకు నేను అలాంటి గొప్ప ఇన్నింగ్స్‌ చూడలేదు. ఆ మ్యాచ్‌లో మేము 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయాం. అప్పుడు చాలా చలిగా ఉంది. అంతేకాకుండా బంతి కూడా బాగా తిరిగింది. ఈ పరిస్థితుల్లో 70 లేక 80 పరుగులు కూడా చేస్తామనుకోలేదు. కానీ కపిల్‌ అద్బుత ఇన్నింగ్స్‌తో  మ్యాచ్‌ను గెలిపించాడు. అతనేం నెమ్మదిగా ఆడలేదు. సిక్సర్లతో చెలరేగాడు. అతను కానీ తాజా ఐపీఎల్‌ వేలంలో ఉంటే కచ్చితంగా రూ.25 కోట్లు పలికేవాడు.’ అని ఈ మాజీ కెప్టెన్‌ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలపై కపిల్‌ నవ్వుతూ.. ఇంత వరకు అంత డబ్బును ఊహించలేదని చెప్పుకొచ్చాడు.