మీకు నిబద్ధత లేదా? టీమిండియాకంటే మీకు ఐపీఎల్ ముఖ్యమా?.. ఆటగాళ్లపై మరోసారి విరుచుకుపడ్డ కపిల్ దేవ్..
మెగా టోర్నీలో టీమిండియా ప్రదర్శన పై ఈ గాయాల వల్ల ప్రతికూల ప్రభావం పడుతున్న విషయం తెలిసిందే. దీంతోనే కపిల్ దేవ్ ఆటగాళ్ల నిబద్ధతను ప్రశ్నించారు.

దిగ్గజ చక్రికెటర్ కపిల్ దేవ్ టీమిండియా ఆటగాళ్లపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. వారిపై వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇండియన్ క్రికెటర్లు ఎవరినీ సలహా అడగాలని అనుకోరని, తమకే అన్ని తెలుసు అనుకుంటారని విమర్శించిన సంగతి తెలిసిందే. ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు తాజాగా మరోసారి ఐపీఎల్ తో పోలుస్తూ ఆటగాళ్లపై మండిపడ్డారు కపిల్ దేవ్.
ఇటీవలి కాలంలో జట్టులో కీలకమైన ఆటగాళ్లు గాయాల బారిన పడుతున్న నేపథ్యంలో కపిల్ దేవ్ ఈ విమర్శలు చేశారు. మెగా టోర్నీలో టీమిండియా ప్రదర్శన పై ఈ గాయాల వల్ల ప్రతికూల ప్రభావం పడుతున్న విషయం తెలిసిందే. దీంతోనే కపిల్ దేవ్ ఆటగాళ్ల నిబద్ధతను ప్రశ్నించారు.
ఐపీఎల్ లో ఆడే సమయంలో వారికి చిన్నపాటి గాయాలైనా కూడా లెక్కచేయరని.. ఐపీఎల్లో ఆడడానికి అభ్యంతరం వ్యక్తం చేయరని అన్నారు. ఇక అదే సమయంలో జాతీయ జట్టులో ఆడే సమయం వచ్చేసరికి చిన్న చిన్న సాకులు చూపించి విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడతారని మండిపడ్డారు. ఈ మేరకు కపిల్ దేవ్ ఓ మాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
గాయాల బారిన పడ్డ ఆటగాళ్ల పరిస్థితిపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇలా స్పందించారు. స్టార్ పేసర్ బుమ్రా టీం ఇండియాకు ఏడాది కాలంగా దూరమయ్యాడని.. దీనికి కారణం గాయమేనని చెప్పారు. అయితే రానున్న వన్డే ప్రపంచ కప్ నాటికి కూడా బుమ్రా సిద్ధంగా లేకపోతే పరిస్థితి ఏంటని కపిల్ ప్రశ్నించాడు.
ఈ సమయంలో ఆటగాళ్ల మీద స్పందిస్తూ కపిల్ దేవ్.. ‘భూమ్రాకు ఏమైంది? ఎంతో నమ్మకంతో ఆడతాడు. కానీ, ప్రపంచకప్ టోర్నీకి బుమ్రా అందుబాటులో లేకపోతే.. అతని కోసం టైం పెట్టడం వేస్టే. రిషబ్ పంత్ కూడా గొప్ప క్రికెటర్. టెస్ట్ క్రికెట్లో ఉండుంటే మరింత బాగుండేది’ అన్నారు.
ఐపీఎల్ గురించి కూడా ఈ సందర్భంగానే కామెంట్స్ చేశారు కపిల్ దేవ్. ఐపిఎల్ గొప్పదే.. కాదనను.. కాకపోతే అది ఆటగాళ్లను దెబ్బతీస్తుంది. ఐపీఎల్లో చిన్నపాటి గాయాలైన సరే ఆడతారు. టీమిండియా విషయంలో మాత్రం అలాంటి పరిస్థితులు ఎదురైతే విశ్రాంతి తీసుకోవడానికి మొగ్గు చూపుతారు. ఆడరు. నేను చాలా ఓపెన్ గా దీన్ని చెబుతున్నాను’ అని సీనియర్ల మీద అసంతృప్తి వ్యక్తం చేశారు దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్.
ఆటగాళ్ల పని భారం నిర్వహణపై బీసీసీఐ కూడా సరిగ్గా పనిచేయడం లేదని విమర్శలు గుప్పించారు. విండీస్తో రెండో వన్డేలో టీమిండియా జట్టులో ప్రయోగాలు చేస్తూ ఓడిపోయింది. దీంతో జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.