మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయడం నిత్యకృత్యంగా మార్చుకోవాలని అర్జున అవార్డు గ్రహీత, షట్లర్ గుత్తా జ్వాల సూచించారు. ఉద్యోగ జీవితంలో బిజీగా ఉండే మహిళలే కాదు గృహిణులు కూడా తమ శారీరక ఫిట్ నెస్ గురించి అంతగా పట్టించుకోరని, ఈ ప్రభావం వారి పనితీరుపైనే కాదు ఆరోగ్యంపై కూడా పడుతుందన్నారు. అందువల్లే ప్రతి మహిళా రోజులో కనీసం 30నిమిషాలు వ్యాయామం కోసం కేటాయించాలని ఆమె సూచించారు.

సివిల్ సర్వెంట్ మహిళా ట్రెయినీల కోసం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో డాక్టర్ ఎమ్‌సిఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్ వారు ప్రత్యేక జిమ్ ను ఏర్పాటు చేశారు. ఇందులో ట్రెడ్ మిల్, క్రాస్ ట్రెయినర్, షోల్డర్ ప్రెస్ సైకిల్ వంటి అత్యాధునికి సామాగ్రితో సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రత్యేకంగా ట్రెయినర్ లను కూడా నియమించారు. ఈ జిమ్‌ను గుత్తా జ్వాల ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నందుకు జ్వాలకు తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.పి ఆచార్య మెమెంటో తో సత్కరించారు.

 ఈ సందర్భంగా గుత్తా జ్వాలా మాట్లాడుతూ... ఉద్యోగాలు చేసే మహిళలు బిజీ జీవితం కారణంగా ఫిజికల్ ఫిట్ నెస్ కు సమయం కేటాయించడం లేదన్నారు. దీనివల్ల వారు తమ కెరీర్ లోనే కాదు ఇంట్లో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. దీంతో వారికి ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నట్లు జ్వాలా తెలిపారు. అందువల్లే మహిళా ఉద్యోగులు, గృహిణులు రోజులు కాస్త సమయాన్ని వ్యాయామం చేయడానికి కేటాయించాలని సూచించారు. దీని వల్ల వారి పనితీరులో మార్పు రావడంతో పాటు ఆరోగ్యం కూడా బావుంటుందన్నారు. కేవలం వ్యాయామమే కాదు మంచి ఆహార అలవాట్లు కూడా ఆరోగ్యాన్ని కాపాడతాయన్నారు.