Satender Malik: రిఫరీని కొట్టిన భారత రెజ్లర్.. జీవిత కాలం నిషేధం విధించిన రెజ్లింగ్ సమాఖ్య
Common Wealth Games 2022 Trials: ప్రముఖ భారత రెజ్లర్ సతేందర్ మాలిక్ కెరీర్ ముగిసింది. కామన్వెల్త్ గేమ్స్ ట్రయల్స్ లో భాగంగా అతడు ఏకంగా మ్యాచ్ రిఫరీపైనే చేయి చేసుకున్నాడు.
సర్వీసెస్ రెజ్లర్ సతేందర్ మాలిక్ జీవిత కాల నిషేధానికి గురయ్యాడు. ఈ ఏడాది బర్మింగ్హోమ్ (యూకే) లో నిర్వహించబోయే కామన్వెల్త్ గేమ్స్-2022 కోసం ఢిల్లీలో నిర్వహిస్తున్న ట్రయల్స్ లో అతడు మ్యాచ్ రిఫరీ మీదే దాడికి దిగాడు. మంగళవారం ఢిల్లీలోని కేడీ జాదవ్ స్టేడియంలో.. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) నిర్వహిస్తున్న ట్రయల్స్ లో సతేందర్.. ఎయిర్ ఫోర్స్ రెజ్లర్ మోహిత్ గ్రెవాల్ తో పోటీ పడ్డాడు. 125 కేజీల విభాగంలో పోటీ పడ్డ అతడు.. మ్యాచ్ మరో 18 సెకండ్లలో ముగుస్తుందనగా సీనియర్ మ్యాచ్ రిఫరీ జగ్బీర్ సింగ్ తో గొడవకు దిగి కెరీర్ నాశనం చేసుకున్నాడు.
అసలేం జరిగిందంటే.. మోహిత్ తో జరిగిన మ్యాచ్ లో 3-0తో ముందంజలో ఉన్న సతేందర్ 18 సెకండ్లలో పోటీ ముగుస్తుందనగా గొడవకు దిగాడు. చివరి క్షణంలో సతేందర్ ను టేక్ డౌన్ మూవ్ ద్వారా మ్యాట్ ఆవలికి నెట్టాడు మోహిత్. నిబంధనల ప్రకారమైతే మోహిత్ కు దీని ద్వారా 3 పాయింట్లు రావాలని అతడు ఆర్గ్యూ చేశాడు. కానీ రిఫరీ వీరేందర్ మాలిక్ మాత్రం ఒకటే పాయింట్ ఇచ్చాడు. దీంతో నిరాశకు గురైన మోహిత్.. రిఫరీ నిర్ణయాన్ని సవాల్ చేశాడు. టీవీ రిప్లై ల ద్వారా దీనిని పర్యవేక్షించాడు సీనియర్ రిఫరీ జగ్బీర్ సింగ్. వాటిని పరిశీలించిన మీదట మోహిత్ కు 3 పాయింట్లు కేటాయించాడు. దీంతో స్కోరు 3-3 గా సమమైంది.
ఈ నిర్ణయంతో సతేందర్ కు చిర్రెత్తుకొచ్చింది. అప్పటిదాకా ఒక పక్కన నిల్చున్న అతడు.. జగ్బీర్ సింగ్ తో వాగ్వాదానికి దిగాడు. అది కాస్తా గొడవగా మారింది. చివరికి అతడు జగ్బీర్ ను కొట్టే స్థాయికి వెళ్లాడు. ఈ మ్యాచ్ కు సమాంతరంగా పక్కనే 57 కేజీల ఫైనల్ ఈవెంట్ లో భాగంగా రవిదహియా, అమన్ ల మధ్య జరుగుతున్న మరో పోరులోని బౌట్ లోకి జగ్బీర్ ను తీసుకెళ్లి అతడిని గాయపరిచాడు.
ఎవరూ ఊహించని ఈ ఘటన పై డబ్ల్యూఎఫ్ఐ తీవ్రంగా స్పందించింది. సతేందర్ మాలిక్ చేసిన చర్య ఉపేక్షించరానిదని.. అతడిపై జీవిత కాల నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది. దాడి చేసినందుకు గాను జగ్బీర్.. సతేందర్ పై కేసు కూడా నమోదు చేయనున్నాడు.