Asianet News TeluguAsianet News Telugu

మరోసారి ప్రజ్ఞానంద ఎత్తులకు కళ్లు తేలేసిన మాగ్నస్ కార్లెసెన్... కుర్రాడి ఆటకు ఆనంద్ మహేంద్ర ఫిదా...

వరల్డ్ నెం.1 చదరంగ ఆటగాడు మాగ్నస్ కార్లెసెన్‌‌ని ఆరు నెలల్లో మూడోసారి ఓడించిన ప్రజ్ఞానంద... ఇండియన్ గ్రాండ్ మాస్టర్‌కి రన్నరప్ టైటిల్..

Indian Teenager Rameshbabu Praggnanandhaa defeats 5 time World Chess Champion Magnus Carlsen once again
Author
India, First Published Aug 22, 2022, 5:54 PM IST

రమేశ్‌బాబు ప్రజ్ఞానంద... చెస్ ప్రపంచంలో ఇప్పుడీ పేరు ఓ సెన్సేషన్. వరల్డ్ నెం.1 చదరంగ ఆటగాడు మాగ్నస్ కార్లెసెన్‌కి ముచ్ఛెమటలు పట్టిస్తున్నాడు 16 ఏళ్ల  ప్రజ్ఞానంద... టీనేజ్ వయసు కూడా దాటని ఈ తమిళనాడు చిన్నోడి చేతుల్లో మూడోసారి ఓటమి పాలయ్యాడు మాగ్నస్ కార్లెసెన్...

మియామీలో జరిగిన చెస్ ఛాంపియన్స్ టూర్ అమెరికన్ ఫైనల్‌లో ఐదు సార్లు వరల్డ్ ఛాంపియన్‌ మాగ్నస్ కార్లెసెన్‌తో జరిగిన మ్యాచ్‌లో సంచలన విజయం అందుకున్నాడు  ప్రజ్ఞానంద. అయితే ఫైనల్‌కి ముందు జరిగిన మ్యాచుల్లో అత్యధిక విజయాలు అందుకోవడం వల్ల టాప్ స్కోరర్‌గా నిలిచిన మాగ్నస్ కార్లెసెన్, టైటిల్ విజేతగా నిలిచాడు. ప్రజ్ఞానంద‌కి, మాగ్నస్ కంటే తక్కువ పాయింట్లు ఉండడం వల్ల రన్నరప్ టైటిల్ దక్కింది...

 ప్రజ్ఞానంద చేతుల్లో గతంలో రెండు పరాజయాలను ఎదుర్కొన్న మాగ్నస్ కార్లెసెన్, ఆ అనుభవాలతో కాస్త అతి జాగ్రత్తగా ఆడి మూల్యం చెల్లించుకున్నాడు. మాగ్నస్ కార్లెసెన్ చేసిన తప్పులను అద్భుతంగా వాడుకున్న  ప్రజ్ఞానంద... వరల్డ్ ఛాంపియన్‌పై హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు...

 ప్రజ్ఞానంద అందుకున్న విజయంపై మహేంద్ర సంస్థల అధినేత ఆనంద్ మహేంద్ర స్పందించాడు. ‘ఆ కుర్రాడి ఫేస్‌లో తేజస్సు చూడండి. చెస్ అనేక గేమ్ ఆఫ్ థ్రోన్స్ అయితే... అయితే ఈ కుర్రాడు సింహాసనాన్ని అధిరోహించబోతున్నాడు...  (మరీ ముఖ్యంగా మనందరం అతని పేరుని కరెక్టుగా ఎలా రాయాలో నేర్చుకోవాలి...) అంటూ ట్వీట్ చేశాడు ఆనంద్ మహేంద్ర...

ఇంతకుముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఆన్‌లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీ ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ టోర్నీమెంట్‌లో వరల్డ్ నెం.1 నార్వే చెస్ గ్రాండ్ మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సెన్‌ను చిత్తుగా ఓడించాడు భారత యంగ్ చెస్ గ్రాండ్ మాస్టర్  ప్రజ్ఞానంద్... ఆ తర్వాత మే నెలలో చెస్బుల్ మాస్టర్స్ ఆన్‌లైన్ రాపిడ్ చెస్ టోర్నీ ఐదో రౌండ్‌లో మాగ్నస్ కార్లెసన్‌తో తలబడిన రమేశ్‌బాబు ప్రజ్ఞానంద... వరల్డ్ నెం.1ని చెక్ మేట్ చేసి... సంచలనం క్రియేట్ చేశాడు. 

నాలుగేళ్ల క్రితం 2018లో 12 ఏళ్ల వయసులో గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించి, భారత లెజెండరీ చెస్ ప్లేయర్ విశ్వనాథ్ ఆనంద్ రికార్డును బద్దలు కొట్టాడు రమేశ్‌బాబు ప్రజ్ఞానంద. విశ్వనాథన్ ఆనంద్‌కి 18 ఏళ్ల వయసులో గ్రాండ్ మాస్టర్ టైటిల్ సొంతం కాగా, ప్రజ్ఞానంద 12 ఏళ్ల వయసులోనే ఆ రికార్డును బ్రేక్ చేసేశాడు...


తమిళనాడులోని చెన్నైలో 2005లో జన్మించిన రమేశ్‌బాబు ప్రజ్ఞానంద, ఓవరాల్‌గా ప్రపంచంలోనే అతి పిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించిన ఐదో చెస్ ప్లేయర్. 2013లో అండర్ 8 వరల్డ్ యూత్ చెస్ ఛాంపియన్‌షిప్ గెలిచిన ప్రజ్ఞానంద, ఏడేళ్ల వయసులో ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ మాస్టర్ టైటిల్ సాధించాడు...

10 ఏళ్ల 10 నెలల 19 రోజుల వయసులో ఇంటర్నేషనల్ మాస్టర్‌గా నిలిచిన ప్రజ్ఞానంద, తన వయసు కంటే రెట్టింపు అనుభవం ఉన్న చందరంగ నిపుణులను కూడా ఆశ్చర్యపరుస్తూ విశ్వ వేదికపై దూసుకుపోతున్నాడు...

రమేశ్‌బాబు ప్రజ్ఞానంద అక్క వైశాలి రమేశ్‌బాబు కూడా చెస్ ప్లేయరే. అండర్ 12, అండర్ 14 వరల్డ్ యూత్ చెస్ ఛాంపియన్‌షిప్ గెలిచిన వైశాలి రమేశ్‌బాబు, 2016లో వుమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ సాధించింది...

Follow Us:
Download App:
  • android
  • ios