టీంఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సీరిస్ వివాదాలకు కేంద్రంగా మరింది. ఇప్పటివరకు ఇరు జట్లు ఆటగాళ్ల మధ్య కొనసాగిన మాటల యుద్దం తాజాగా ప్యాన్స్ కి పాకింది. మెల్ బోర్న్ లో జరుగుతున్న మూడో టెస్టులో భారత ఆటగాళ్లను ఉద్దేశించి ఆసిస్ ప్యాన్స్ జాతివిద్వేష వ్యాఖ్యలు చేస్తూ తీవ్ర దుమారం రేపారు. 

ఎంసిజి స్టేడియంలో రెండో రోజు ఆటలో భాగంగా బౌండరీ వద్ద పీల్డింగ్ చేస్తున్న భారత ఆటగాళ్లను ఆద్దేశిస్తూ కొందరు ఆసిస్ అభిమానులు అవమానకరంగా వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా భారతీయ అభిమానులను కూడా వారు దూషించారు.  ''మీ వీసా చూపించండి'' అంటూ ఆసిస్ అభిమానులు చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలు మ్యాచ్ ను ప్రసారం చేస్తున్న మీడియా కెమెరాలకు చిక్కినట్లు తెలుస్తోంది. 

ఈ వ్యవహారాన్ని సదరు మీడియా సంస్థ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. తమ ఛానెల్ లో ప్రసారమైన వీడియో ఫుటేజిని సీఎ అధికారులకు అందించారు. దీంతో సీరియస్ అయిన సీఎ అధికారులు మెల్ బోర్న్ లోని విక్టోరియా పోలీస్ స్టేషన్ కు, స్టేడియం మేనేజ్ మెంట్ కు వీడియోను పంపించి వివరణ కోరింది. 

ఇలా అనుచితంగా వ్యవహరించిన ఆసిస్ అభిమానులకు సీఎ గట్టిగా హెచ్చరించింది. దేశంలో పర్యటిస్తున్న అతిథుల పట్ల సంయమనంతో, మర్యాదగా మెలగాలని సూచించింది. ఇకనుంచి విక్టోరియా పోలీసులు, స్టేడియం సెక్యూరిటీ  సిబ్బంది అభిమానుల ప్రవర్తనను పర్యవేక్షిస్తుంటారని సీఎ అధికారి ప్రతినిధి తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరక్కుండా చూసుకుంటామని వెల్లడించారు.