Asianet News TeluguAsianet News Telugu

మరోసారి కోచ్‌ని మార్చేసిన పీవీ సింధు... పారిస్ ఒలింపిక్స్ లక్ష్యంగా మహమ్మద్ హఫీజ్ హషీమ్ దగ్గర శిక్షణ..

మలేషియా మాజీ ప్లేయర్ మహమ్మద్ హఫీజ్ హషీమ్ దగ్గర శిక్షణ తీసుకుంటున్న పీవీ సింధు... పారిస్ ఒలింపిక్స్ లక్ష్యంగా మరోసారి కొత్త కోచ్‌ సారథ్యంలో ట్రైయినింగ్.. 

Indian badminton Star PV Sindhu wants to hafiz hashim as coach for Paris Olympics 2024 CRA
Author
First Published Jul 1, 2023, 11:08 AM IST

భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు, మరోసారి కోచ్‌ని మార్చబోతోంది. ఇప్పటికే ఐదుగురు కోచ్‌లను మార్చిన పీవీ సింధు, తాజాగా ఆల్‌ ఇంగ్లాండ్ ఓపెన్ మాజీ ఛాంపియన్‌, మలేషియా మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ మహమ్మద్ హఫీజ్ హషీమ్ దగ్గర శిక్షణ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI)కి తెలిపింది పీవీ సింధు..

27 ఏళ్ల పీవీ సింధు, 2016 రియో ఒలింపిక్స్‌లో ఫైనల్ చేరినా రన్నరప్‌గా నిలిచి రజతం సాధించింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన పీవీ సింధు, పారిస్‌లో జరగబోయే 2024 ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవడమే టార్గెట్‌గా పెట్టుకుంది..

గత ఏడాది సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్, స్విస్ ఓపెన్ 2022 టైటిల్స్ గెలిచిన పీవీ సింధు, ఆ తర్వాత జరిగిన 2022 బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో సెమీ ఫైనల్స్‌లో ఓడింది. సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలిచిన పీవీ సింధు, 2022 కామన్వెల్త్ గేమ్స్‌ ఉమెన్స్ సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధించింది..

కామన్వెల్త్ గేమ్స్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో రజతం గెలిచిన పీవీ సింధు, ఎడమ కాలి గాయంతో వరల్డ్ ఛాంపియన్‌షిప్స్, వరల్డ్ టూర్ ఫైనల్స్‌కి దూరమైంది. గాయం నుంచి కోలుకున్న తర్వాత 2023 బ్యాడ్మింటన్ ఆసియా మిక్స్‌డ్ టీమ్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్యం గెలిచిన పీవీ సింధు, 2023 స్పెయిన్ మాస్టర్స్‌లో ఫైనల్ చేరినా టైటిల్ గెలవలేకపోయింది..

సికింద్రాబాద్‌లోని మెహబూబ్ ఆలీ కోచింగ్‌లో బ్యాడ్మింటన్ పాఠాలు నేర్చుకున్న పీవీ సింధు, ఆ తర్వాత ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎస్‌ఎం అసిఫ్ కోచింగ్‌లో రాటు తేలింది. పుల్లెల గోపిచంద్ కోచింగ్‌లో స్టార్ ప్లేయర్‌గా ఎదిగిన పీవీ సింధు, 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించింది. 

పుల్లెల గోపిచంద్ కోచింగ్‌లో పీవీ సింధు వరుస విజయాలు అందుకుంది. వరల్డ్ ఛాంపియన్‌షిప్స్, కామన్వెల్త్ గేమ్స్, ఏషియా గేమ్స్‌లో సత్తా చాటింది. పుల్లెల గోపిచంద్, భారత బ్యాడ్మింటన్ కోచ్‌గా మారడంతో పీవీ సింధు, కొత్త కోచ్‌ని నియమించుకుంది.

పుల్లెల గోపిచంద్ తర్వాత సౌత్ కొరియా మాజీ ప్లేయర్ కిమ్ జి హున్, 2019లో పీవీ సింధు కోచ్‌గా వచ్చింది. కిమ్ జి హున్ కోచింగ్‌లో పీవీ సింధు, ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. కొన్ని నెలలకే 2019 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ గెలిచి, ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి భారత బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా నిలిచంది.

కిమ్ జి తన భర్త అనారోగ్యం పాలుకావడంతో స్వదేశానికి వెళ్లిపోయింది. దీంతో పీవీ సింధు, మరో దక్షిణ కొరియా మాజీ ప్లేయర్ పార్క్ టా సాంగ్‌ని కోచ్‌గా నియమించుకుంది. పార్క్ కోచింగ్‌లో ఒలింపిక్స్‌ 2020లో కాంస్యం గెలిచిన పీవీ సింధు, సింగపూర్ ఓపెన్, స్విస్ ఓపెన్ వంటి టైటల్స్ సాధించింది.. 

అయితే ఫిబ్రవరి 2023 నుంచి పార్క్ టా సాంగ్‌‌ కోచింగ్‌పై కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన పీవీ సింధు, 40 ఏళ్ల హఫీజ్‌ని పర్సనల్ కోచ్‌గా నియమించుకోవడానికి SAI అనుమతి కోరింది. రెండు వారాల నుంచి హఫీజ్ ఆధ్వర్యంలోనే సాధన చేస్తోంది పీవీ సింధు.

Follow Us:
Download App:
  • android
  • ios