ఎట్టకేలకు భారత బ్యాట్స్ మెన్ గాడిలో పడ్డారు. తొలి రెండు టెస్టు మ్యాచుల్లో ఘోరంగా విఫలమైన బ్యాట్స్ మెన్ మూడో టెస్టు మ్యాచులో నిలకడగా ఆడుతున్నారు  కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (152 బంతుల్లో 11 ఫోర్లతో 97), వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానె (131 బంతుల్లో 12 ఫోర్లతో 81) నిలకడగా ఆడి భారత్ పరువును కాపాడారు. 

వారిద్దరి భాగస్యామ్యంతో శనివారం ప్రారంభమైన మూడో టెస్టులో తొలి రోజు ముగిసేసరికి భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 87 ఓవర్లలో ఆరు వికెట్లకు 307 పరుగులు చేసింది. రిషభ్‌ పంత్‌ (32 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 22 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లాండు బౌలర్ వోక్స్‌కు మూడు వికెట్లు దక్కాయి.
 
టీ బ్రేక్ తర్వాత 66వ ఓవర్‌లో రహానె రెండు ఫోర్లు సాధించగా, కోహ్లీ మరో ఫోర్‌ బాదడంతో 17 పరుగులు వచ్చాయి. కానీ తర్వాతి ఓవర్‌లో బ్రాడ్‌ వారి భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. అవుట్‌సైడ్‌ వెళుతున్న బంతిని రహనే టచ్‌ చేయగా తొలి స్లిప్‌లో ఉన్న కుక్‌ మెరుపు వేగంతో స్పందించి ఒంటి చేత్తో క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో ఐదో వికెట్‌కు 159 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కొద్దిసేపటికే సెంచరీవైపు దూసుకెళ్తున్న కోహ్లీని స్పిన్నర్‌ రషీద్‌ అవుట్‌ చేశాడు. 
 
ఇక తొలి టెస్టు ఆడుతున్న రిషభ్‌ పంత్‌  అనుభవజ్ఞుడిలా కనిపించాడు. సిక్సర్ తో తన ఆరంగేట్రాన్ని చాటుకున్నాడు. బెదురు లేకుండా వేగంగా పరుగులు తీస్తూ క్రీజులో ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. బ్రాడ్‌ వేసిన 84, 86వ ఓవర్‌లో ఒక్కో ఫోర్‌ సాధించి తొలి రోజును అజేయంగా ముగించాడు. అయితే 87వ ఓవర్‌ చివరి బంతికి పాండ్యా వికెట్‌ను ఆండర్సన్‌ తీయడంతో తొలి రోజు ఆట ముగిసింది.

అంతకు ముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానేలు అర్థ సెంచరీలు నమోదు చేశారు. వీరిద్దరు 101 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. తొలి రోజు లంచ్ బ్రేక్ సమయానికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో విరాట్, రహానేల జోడీ నిలకడగా ఆడుతూ స్కోరు పెంచే ప్రయత్నం చేచేశారు. విరాట్ కోహ్లీ 88 బంతుల్లో 6 ఫోర్లతో 51 పరుగులు, రహానే 87 బంతుల్లో 7 ఫోర్లతో 51 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నారు. దీంతో 54 ఓవర్లు ముగిసేసరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.

ఇంగ్లాండ గడ్డపై జరుగుతున్న టెస్ట్ సీరీస్‌ను భారత జట్టు పేలవంగా ఆరంభించిన విషయం తెలిసిందే. సీరీస్ లోని మొదటి రెండు మ్యాచ్ లలో టీం ఇండియా ఆతిథ్య ఇంగ్లాండ్  చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. మొదటి టెస్ట్ లో కాస్త పోరాట పటిమను చూపిన భారత ఆటగాళ్లు రెండో టెస్ట్ లో మాత్రం పూర్తిగా చేతులెత్తేశారు. వరుస పరాజయాలను చవిచూసిన భారత జట్టు ఇవాళ జరిగుతున్న మూడో టెస్ట్ లో చావో రేవో తేల్చుకోనుంది. సీరీస్ ను నిర్ణయించే ఈ మ్యాచ్ లో పలు మార్పులతో బరిలోకి దిగింది.

నాటింగ్ హామ్ లో ప్రారంభమైన మ్యాచ్ లో ప్రధానంగా మూడు మార్పులు జరిగాయి. దినేష్ కార్తిక్, కుల్దీప్ యాదవ్ , మురళీ విజయ్ ల స్థానంలో రిషబ్ పంత్, బుమ్రా, శిఖర్ యాదవ్ లు జట్టులోకి వచ్చారు. అయితే ఐపీఎల్ లో అదరగొట్టిన రిషబ్ పంత్ కి ఇది మొదటి టెస్ట్ మ్యాచ్. ఆరంగేట్ర మ్యాచ్ లో రిషబ్ పంత్ ఎలా ఆడతాడో చూడాలి.

ప్రస్తుతం టీం ఇండియా బ్యాటింగ్ చేస్తోంది.టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లాండ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం టీం ఇండియా 72 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజ్ లో పుజారా, కోహ్లీ వున్నారు. ఓపెనర్లు శిఖర్ ధావన్(35 పరుగులు 65 బంతుల్లో), కెఎల్ రాహుల్(23 పరుగులు 53 బంతుల్లో) ఔటయ్యారు.