CWG 2022: డేట్ చూసి గెలుస్తానో లేదో అని కాస్త కంగారుపడ్డా.. కానీ లక్ష్యాన్ని సాధించా : దీపక్ పునియా
Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్-2022లో భాగంగా శుక్రవారం జరిగిన రెజ్లింగ్ పోటీలలో భారత స్టార్ రెజ్లర్ దీపక్ పునియా స్వర్ణం నెగ్గాడు.
కామన్వెల్త్ గేమ్స్ లో భాగంగా భారత రెజ్లర్ దీపక్ పునియా శుక్రవారం రాత్రి జరిగిన పోటీలలో స్వర్ణాన్ని నెగ్గి భారత పతకాల సంఖ్యను పెంచాడు. పాకిస్తాన్ కు చెందిన రెజ్లర్, డిఫెండింగ్ ఛాంపియన్ అయిన మహ్మద్ ఇనామ్ బట్ ను ఓడించిన పునియా.. బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. పురుషుల ఫ్రీ స్టయిల్ 86 కిలోల విభాగంలో భాగంగా పునియా.. ఇనామ్ ను 30 తేడాతో ఓడించాడు. అయితే మ్యాచ్ అనంతరం పునియా మాట్లాడుతూ.. ఈ తేదీ (ఆగస్టు 5) చూసి కాస్త కంగారుపడ్డానని, గెలుస్తానో లేదో అనే భయమైతే ఉండేదని వ్యాఖ్యానించాడు.
మ్యాచ్ ముగిశాక పునియా మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ తేదీ చూశాక నాకు కాస్త భయం వేసింది. గతేడాది టోక్యో ఒలింపిక్స్ లో భాగంగా ఇదే రోజు జరిగిన కాంస్యం పోరులో నేను ఓటమి పాలయ్యాను. దాంతో మళ్లీ అదే ఫలితం రిపీట్ అవుద్దా..? అనిపించింది. కానీ నేను నా లక్ష్యాన్ని సాధించాను..’ అని తెలిపాడు.
కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం నెగ్గినందుకు గాను ప్రధాని నరేంద్ర మోడీకి పునియా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. తాను ఒలింపిక్స్ లో పతకం నెగ్గనందుకు చాలా బాధపడ్డానని, కానీ మోడీ మాటలు తనలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించాయని పునియా చెప్పుకొచ్చాడు.
ఇదే విషయమై పునియా స్పందిస్తూ.. ‘నేను ప్రధాని నరేంద్ర మోడీకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఆయన క్రీడాకారులను బాగా ప్రోత్సహిస్తారు. టోక్యోలో కాంస్యం పోరులో నేను ఓడినప్పుడు చాలా బాధపడ్డాను. కానీ ఆ సమయంలో మోడీ మాటలు నాలో ధైర్యాన్ని నింపాయి. ఒలింపిక్స్ లో ఓడినా కామన్వెల్త్ లో గెలవడం నా బాధ్యతగా భావించాను. అందుకే లక్ష్యం పై దృష్టి సారించాను..’ అని తెలిపాడు.
హర్యానాకు చెందిన దీపక్ పునియా.. డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్‌కు చెందిన ముహమ్మద్ ఇనామ్ పై ఆధ్యంతం ప్రదర్శించాడు. ఆట తొలి భాగంలోనే పునియా.. 2-0 ఆధిక్యం సంపాదించాడు. ఆ తర్వాత చివరి క్షణంలో మరో పాయింట్ సాధించి పాకిస్తాన్ రెజ్లర్ ను కింద పడేశాడు. ఇనామ్.. 2010, 2018 కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం సాధించాడు. కానీ పునియాతో ఫైనల్ బౌట్ లో అదే ప్రదర్శనను కొనసాగించలేకపోయాడు.