గతంలో తాను చాలా తప్పులు చేశానని... అందుకే వాటిని తన జూనియర్లు చేయకుండా చూసుకుంటున్నానని టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు. ప్రపంచకప్ సెమీ ఫైనల్స్ టీం ఇండియా న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.  ఆ తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన కోహ్లీ.. పలు విషయాల గురించి మాట్లాడారు.

తాను తన జీవితంలో ఓటమి నుంచే చాలా నేర్చుకున్నానని కోహ్లీ తెలిపారు. పెద్ద ఓటములు వచ్చినప్పుడే... భవిష్యత్తులో ఇంకా బాగా ఆడేలా స్ఫూర్తిని ఇస్తాయని అభిప్రాయపడ్డారు. ఓటమి సమయంలో మనతో ఎవరు ఉన్నారో... ఎవరు గోడ దూకుతారో  అన్న విషయం కూడా తెలిసిపోతుందన్నారు.  దురదృష్టం ఏమిటంటే... అందరూ అద్భుతంగా ఆడుతున్నారు అనిపించిన సమయంలో మరో జట్టు మాకంటే బాగా ఆడిందని తెలుస్తుందని..అలాంటి విషయాలను జీర్ణించుకోవడం కాస్త కష్టంగా ఉంటుంది. వరల్డ్ కప్ లో ఏం సాధించామో దానిని చూసి గర్వపడాలనే తామంతా చెప్పుకున్నామని చెప్పారు. ఓటమి ఎదురైనంత మాత్రాన తమ శ్రమను తక్కువ చేసి చూడకూడదని తామంతా నిర్ణయించుకున్నామన్నారు.

‘‘క్రికెట్‌లో అడుగు పెట్టినప్పుడు దేవుడు నా కోసం ఏం రాసి పెట్టాడో తెలీదు. దేని గురించి కూడా ఊహించలేదు. నాలో మరీ అంత గొప్ప సామర్థ్యం లేదని నాకూ తెలుసు. అయితే నా చుట్టూ ఉన్నవారితో పోలిస్తే ఎంతైనా కష్టపడగలనని, ఎంత శ్రమకైనా ఓర్చుకోగలననే విషయం మాత్రం నాకు బాగా తెలుసు. దేవుడు బహుశా ఈ శ్రమనే చూసినట్లున్నాడు’’ అని కోహ్లీ వివరించారు.

తాను తన కోసం మాత్రమే క్రికెట్ ఆడుతున్నాని కోహ్లీ చెప్పారు. ఎవరినో మెప్పించడానికి తాను ఎప్పుడూ ఆడనని తేల్చి చెప్పారు. నా ఆలోచనలు, ఉద్దేశాలు చాలా స్పష్టంగా ఉంటాయన్నారు. అప్పటి వరకు ఆటే తన సర్వస్వమని భావించానని....కానీ తన జీవితంలో తనకు భార్య కూడా ఉందని..ఆమె కోసం కూడా సమయం కేటాయించాలని కోహ్లీ వివరించారు.

వరల్డ్ కప్ చేజారిపోయినప్పటికీ.... టెస్ట్ ఛాంపియన్ షిప్ పై దృష్టిపెడుతున్నట్లు చెప్పాడు. 19-20ఏళ్ల వయసు అప్పుడు తాను చాలా దూకుడుగా ఉండేవాడనని... తనతో పోలిస్తే ఇప్పటి యువ క్రికెటర్ చాలా మంచి ఆలోచనా ధోరణిలో ఉన్నారని చెప్పారు. నేను కెరీర్ లో ఎదిగే సమయంలో  చాలా తప్పులు చేశానని...అలాంటి తప్పులు మీరు చేయవద్దని యువ క్రికెటర్లకు చెబుతూ ఉంటానని ఈ సందర్భంగా కోహ్లీ వివరించారు. తన సీనియర్ ధోనీతో ఎంత స్నేహపూర్వకంగా ఉంటానో... జూనియర్ కులదీప్ యాదవ్ తో కూడా అదే విధంగా ఉంటానని చెప్పారు.