ముగిసిన తొలి ప్రాక్టీస్ సెషన్.. ట్యాంక్‌బండ్ చుట్టూ దూసుకెళ్లిన ఎలక్ట్రిక్ కార్లు.. అగ్రస్థానంలో బ్యూమి
Formula E Race: హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఫార్ములా ఈ రేస్ గ్రాండ్ గా మొదలైంది. నేడు ముగిసిన తొలి ప్రాక్టీస్ సెషన్ లో కార్లు ట్యాంక్‌బండ్ చుట్టూ చక్కర్లు కొట్టాయి.
భాగ్యనగరంలో ఎలక్ట్రిక్ కార్లు రయ్ రయ్ మంటూ దూసుకెళ్లాయి. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఫార్ములా ఈ రేస్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో భాగంగా నేడు ట్యాంక్‌బండ్ చుట్టూరా ఏర్పాటుచేసిన 2.8 కిలోమీటర్ల స్ట్రీట్ సర్క్యూట్ ట్రాక్ పై రేసర్లు దూసుకెళ్లారు. ట్రాక్ పై రేసర్లకు అవగాహన కల్పించేందుకు గాను ఈ ప్రాక్టీస్ సెషన్ ను ఏర్పాటు చేశారు. ఈ పోటీలలో ఎన్విసన్ రేసింగ్ టీమ్ డ్రైవర్ సెబాస్టియన్ బ్యూమి తొలిస్థానంలో నిలిచాడు.
శుక్రవారం సాయంత్రం ముగిసిన ఈ పోటీలలో మొత్తం 11 జట్లకు చెందిన 22 మంది డ్రైవర్లు బరిలోకి దిగారు. 2.8 కిలోమీటర్ల ట్రాక్ పై 18 మలుపులను ఛేదించుకుంటూ రేసర్లు దూసుకెళ్లారు. ప్రధాన రేసు రేపు జరగాల్సి ఉన్నా రేసర్లు నేటి పోటీనే ఫైనల్ గా భావించి ట్యాంక్‌బండ్ చుట్టూ జోరు చూపించారు.
ప్రాక్టీస్ పోటీలలో ‘ఎన్విసన్ రేసింగ్’ టీమ్ కు చెందిన డ్రైవర్ సెబాప్టియన్ బ్యూమి (జాగ్వార్ 1 టైప్ 6 కారు) అగ్రస్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో ‘డీఎస్ పెన్స్‌కే’కు చెందిన స్టోఫెల్ వాన్‌డూర్న్ నిలిచాడు. ‘నియో 333 రేసింగ్’ టీమ్ సెర్గియో కెమర నిలవగా.. ‘మహీంద్ర రేసింగ్’ డ్రైవర్ లుకాస్ డి గ్రాసి ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
పోటీలలో అపశ్రుతి..
ప్రాక్టీస్ సెషన్ లో ‘టాగ్ హ్యూర్ పోర్షే’ రేసింగ్ టీమ్ కు చెందిన పాస్కల్ వెహ్ల్రిన్ నడుపుతున్న కారు ప్రమాదానికి గురైంది. పోర్షే 99ఎక్స్ ఎలక్ట్రిక్ కారును అతడు డ్రైవ్ చేస్తుండగా ఐమ్యాక్స్ తర్వాత వచ్చే మూల మలుపు వద్ద అతడి కారు అదుపు తప్పి పక్కనే ఉన్న రైలింగ్ ను ఢీకొంది. అయితే ఈ ప్రమాదంలో అతడికి గాయాలేమీ కాలేదు. కానీ అతడి కారు తీవ్రంగా దెబ్బతింది.
ఇక ఈ పోటీలలో రేపు అసలు పోటీలు జరుగుతాయి. ఉదయం 10:40 గంటల నుంచచి 11:55 గంటల వరకూ క్వాలిఫయింగ్ రేసు ఉంటుంది. మధ్యాహ్నం 3:03 గంటల నుంచి 4:30 గంటల వరకు ప్రధాన రేస్ జరుగనుంది.