మలేషియా మాస్టర్స్ 2023 టోర్నీ విజేతగా హెచ్‌ఎస్ ప్రణయ్... 30 ఏళ్ల వయసులో మొదటి బీడబ్ల్యూఎఫ్ టైటిల్...
మలేషియా మాస్టర్స్ టైటిల్ గెలిచిన మొదటి భారత మెన్స్ బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా ప్రణయ్ రికార్డు... చైనా బ్యాడ్మింటన్ ప్లేయర్ వెంగ్ హంగ్ యాంగ్‌తో ఫైనల్‌లో 21-19, 13-21, 21- 18 తేడాతో విజయం..
భారత బ్యాడ్మింటన్ స్టార్ హెచ్‌ఎస్ ప్రణయ్ మొట్టమొదటి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. కౌలాలంపూర్‌లో చైనా బ్యాడ్మింటన్ ప్లేయర్ వెంగ్ హంగ్ యాంగ్‌తో జరిగిన ఫైనల్‌లో 21-19, 13-21, 21- 18 తేడాతో గెలిచి, 30 ఏళ్ల వయసులో మొదట మలేషియా మాస్టర్స్ టైటిల్ కైవసం చేసుకున్నాడు..
వెంగ్ హంగ్ యాంగ్, హెచ్ ప్రణయ్ మధ్య మొదటి గేమ్ హోరాహోరీగా జరిగింది. ఒకానొక దశలో వెంగ్ హంగ్ 5-7 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లినా ప్రణయ్ అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చి 9-9 తేడాతో స్కోర్లను సమం చేశాడు. ఆ తర్వాత 15-12 తేడాతో 3 పాయింట్లు ఆధిక్యంలోకి వెళ్లిన ప్రణయ్, దాన్ని నిలుపుకోలేకపోయాడు. దీంతో 15-15 తేడాతో స్కోర్లు మరోసారి సమం అయ్యాయి..
అయితే వరుసగా రెండు పాయింట్లు సాధించి 17-16 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లిన ప్రణయ్, మొదటి సెట్‌ని 21-19 తేడాతో సొంతం చేసుకున్నాడు. అయితే రెండో సెట్‌లో ప్రణయ్ పూర్తిగా తేలిపోయాడు. చైనీస్ బ్యాడ్మింటన్ ప్లేయర్ దూకుడుకి ప్రణయ్ పూర్తిగా లొంగిపోయాడు..
ఆరంభంలో ఇద్దరు ప్లేయర్లు 9-9 తేడాతో సమంగా కనిపించినా ఆ తర్వాత వరుస పాయింట్లు సాధించిన వెంగ్, ప్రణయ్ చేసిన తప్పిదాలతో 11-17 తేడాతో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లాడు. దాన్ని కాపాడుకుంటూ 13-21 తేడాతో రెండో సెట్ సొంతం చేసుకుని, గేమ్‌ని 1-1 తేడాతో సమం చేశాడు..
దీంతో మూడో సెట్ కీలకంగా మారింది. మూడో సెట్‌లో 10-10 తేడాతో ఇద్దరు ప్లేయర్లు సమంగా నిలిచారు. అయితే ఆ తర్వాత దూకుడు చూపించిన హెచ్ఎస్ ప్రణయ్, వరుస పాయింట్లు సాధించి చైనా ప్లేయర్‌పై ఒత్తిడి పెంచాడు. 19-18 తర్వాత వరుసగా 3 పాయింట్లు సాధించి, సెట్‌తో పాటు మ్యాచ్‌ని కూడా కైవసం చేసుకున్నాడు..
మలేషియా మాస్టర్స్ ఉమెన్స్ సింగిల్స్‌లో 2013, 2016 సీజన్లలో పీవీ సింధు, 2017లో సైనా నెహ్వాల్ టైటిల్స్ గెలవగా పురుషుల సింగిల్స్‌లో టైటిల్ గెలిచిన మొదటి భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రణయ్.