Asianet News TeluguAsianet News Telugu

ఇంత వివక్షా... క్రీడా సమాఖ్యల పరిపాలనకు మహిళలు పనికిరారా?

క్రీడా రంగంలోని క్రీడా సంఘాల పాలనలో మాత్రం పురుషుల తిరుగులేని ఆధిపత్యం కొనసాగుతోంది. అథ్లెట్లుగా పురుషుల కంటే మెరుగైన ఫలితాలు సాధించిన మహిళలు.. పరిపాలకులుగా మాత్రం వివక్ష ఎదుర్కొంటున్నారు. 

gender diversity survey reveals shocking results...very less women representation across sports federations
Author
London, First Published Dec 1, 2019, 1:13 PM IST

ప్రపంచ వ్యాప్తంగా మహిళలు తమ సత్తాను అనేక రంగాల్లో చాటుతున్నారు. వంటింటి కుందేళ్లు అనే నానుడిని చెరిపివేస్తూ ఏ రంగమైనా సరేనంటూ దూసుకుపోతున్నారు. క్రీడారంగంలో కూడా ఇదే ట్రెండ్ ను కొనసాగిస్తున్నారు. 

భారత క్రీడా రంగం ముఖచిత్రంగా అమ్మాయిలు ఎదిగారు. రియో ఒలింపిక్స్‌ నుంచి ఇటీవల జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ వరకూ అన్నింటా అమ్మాయిలు అదరగొట్టారు. అంతర్జాతీయ వేదికల్లో తడాఖా చూపించారు. 

అంతర్జాతీయ వేదికలపై పురుషులు పతకాల వేటలో తడబడుతున్న వేళ అమ్మాయిలు అలవోకగా మెడల్స్‌ సాధిస్తున్నారు. క్రికెట్‌ సహా ఇతర క్రీడల్లో ఇప్పుడు మహిళలు స్టార్స్‌గా ఎదిగారు. భారత క్రీడా రంగం కొత్తగా చూస్తున్న శుభ పరిణామం ఇది. 

భారత్‌లోనే కాదు అంతర్జాతీయ స్థాయిలోనూ క్రీడా రంగంలో మహిళల హవా పెరిగింది. అన్ని క్రీడల్లోనూ పురుషులతో సమానంగా, కొన్నిసార్లు పురుషుల కంటే ఎక్కువగానే మెరుస్తున్నారు. 

Also read: మధ్యలో నా భార్య పేరు ఎందుకు.. విరాట్ గరం గరం

ఫిఫాలో అయితే అమ్మాయిలు కొత్త ట్రెండ్ నే సృష్టించారు. ఫిఫా పురుషుల ప్రపంచకప్‌తో పోల్చితే మహిళల ఫిఫా ప్రపంచకప్‌కు క్రేజ్‌ తక్కువ. కానీ గత రెండు ప్రపంచకప్‌లలో అమ్మాయిలు తమ విన్యాసాలతో ఆ వ్యత్యాసాన్ని గణనీయంగా తగ్గించేసారు. 

మన మహిళా క్రికెట్ జెట్టు ఒకటుందని 5 సంవత్సరాల కింద చాలామందికి తెలీదు. కానీ మొన్నటి వరల్డ్ కప్ లో మహిళల స్ఫూర్తిదాయకమైన ఆటతీరు ఇప్పుడు మహిళల మ్యాచ్ లకు వ్వ్యూయర్షిప్ ను అమాంతం పెంచేసాయి. మహిళల క్రికెట్ మ్యాచ్ లకు ఎంత క్రేజ్ పెరిగిందంటే బెట్టింగ్ రాయుళ్లు ఆ మ్యాచ్లపై కూడా విపరీతమైన పందేలు కాసేంత. 

టీం స్పోర్ట్స్ కాకుండా వ్యక్తిగత క్రీడాంశాల్లో ఆది నుంచీ అమ్మాయిలది స్పష్టమైన ఆధిపత్యం. ఇది నిర్వివాదాంశం!

అంతర్జాతీయ క్రీడా రంగంలో ఇది నాణెనికి ఒక వైపు మాత్రమే. క్రీడా రంగంలోని క్రీడా సంఘాల పాలనలో మాత్రం పురుషుల తిరుగులేని ఆధిపత్యం కొనసాగుతోంది. అథ్లెట్లుగా పురుషుల కంటే మెరుగైన ఫలితాలు సాధించిన మహిళలు.. పరిపాలకులుగా మాత్రం వివక్ష ఎదుర్కొంటున్నారు. 

భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ వివక్ష కొనసాగుతోంది. ఇటీవల ఓ ప్రముఖ పత్రిక క్రీడా సమాఖ్యల్లో మహిళల ప్రాతినిథ్యంపై సర్వే నిర్వహించగా ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

అన్ని క్రీడా సంఘాలదీ అదే పరిస్థితి...

 ప్రపంచ క్రీడా సమాఖ్యల్లో పాలక మండలిలో మహిళల ప్రాతినిథ్యం ప్రధానంగా నిర్వహించిన 'జెండర్ డైవర్సిటీ' సర్వేలో లీడర్షిప్ లో తీవ్రమైన అంతరాలు ఉన్నాయి.  ప్రపంచంలోని పది అతి పెద్ద క్రీడా సమాఖ్యల్లో మహిళల ప్రాతినిథ్యం విస్తుగొలిపే స్థాయిలో ఉంది. 

ఎగ్జిక్యూటివ్‌ స్థాయిలో మహిళలు అతి తక్కువగా కనిపిస్తున్నారు. ఇంటర్నేషల్‌ ఒలింపిక్‌ కమిటీ, అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌, ఇంటర్నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ ఫెడరేషన్‌, వరల్డ్‌ రగ్బీ, వరల్డ్‌ అథ్లెటిక్స్‌, ఇంటర్నేషనల్‌ గోల్ఫ్‌ ఫెడరేషన్‌, ఇంటర్నేషనల్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌, ఇంటర్నేషనల్‌ హాకీ ఫెడరేషన్‌, ఇంటర్నేషనల్‌ సైక్లింగ్‌ యూనియన్‌లలో ఎగ్జిక్యూటివ్‌, పాలక మండలి స్థాయిలో మహిళల ప్రాతినిథ్యం చాలా తక్కువగా ఉంది. 

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌లో అత్యధికంగా లింగ అసమానతలు కనపడుతున్నాయి. ఐసీసీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లో 18 మంది సభ్యులు ఉన్నారు. అందులో కేవలం ఒకే ఒక్క మహిళకు మాత్రమే చోటు కల్పించడం అక్కడ నెలకొని ఉన్న లింగ వివక్షకు సాక్ష్యం. 

మిగిలిన తొమ్మిది క్రీడా సమాఖ్యల్లో మహిళా ప్రతినిధుల ప్రాతినిథ్యం 30-40 శాతం కంటే తక్కువగా ఉంది. మూడు క్రీడా సమాఖ్యలు కనీస స్థాయిలో 25 శాతం మహిళా ప్రతినిధులకు చోటు కల్పించగా పదింటిలో ఏ ఒక్క క్రీడా సమాఖ్యకు కూడా మహిళ  సారథ్యం వహించకపోవటం శోచనీయం. 

గత ఏడాది అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ కొన్ని కీలక సంస్కరణలు చేసింది. ఐసీసీ 'జెండర్ ఈక్వాలిటీ రివ్యూ'  ప్రాజెక్ట్‌ సిఫారసుల్లో భాగంగా సమాఖ్యలో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంపొందించేందు కోసం తగు చర్యలు తీసుకుంది. 

ఐఓసీ ఎగ్జిక్యూటివ్‌ బోర్డులో ప్రస్తుతం 15 మంది మహిళలు ఉన్నారు. ఐఓసీ కమిషన్‌లో 40 మంది మహిళా ప్రతినిధులు ఉన్నారు. 2013 లెక్కలతో పోల్చితే 2019లో ఐఓసీలో మహిళల ప్రాతినిథ్యం రెట్టింపు అయ్యింది. అయినా, ఇప్పటికీ లింగ సమానత్వం మాత్రం సాధించకపోగా, లింగ వివక్ష కొనసాగుతూనే ఉంది. 

భారత్‌లోనూ ఈ పరిస్థితి కొనసాగుతోంది. బీసీసీఐ లో జస్టిస్‌ లోధా కమిటీ సిఫారసుల తర్వాత మాత్రమే మహిళా ప్రతినిథికి అవకాశం లభించింది. రాష్ట్ర క్రికెట్‌ సంఘాలలో తమిళనాడు క్రికెట్‌ సంఘానికి మాత్రమే మహిళ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.మాజీ బీసీసీఐ అధ్యక్షుడైన శ్రీనివాసన్ కూతురు రూప గురునాథ్ ఏ పరిస్థితుల్లో తమిళనాడు క్రికెట్ సంఘానికి అధ్యక్షురాలయ్యిందో చెప్పక్కర్లేదు.

Also read: సంజు శాంసన్ ఎంపిక... పంత్ కు లక్ష్మణ్ చురకలు

క్రికెట్‌ సహా ఇతర ప్రధాన స్పోర్ట్స్ ఫెడరేషన్లలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మాజీ మహిళా అథ్లెట్లను సలహాదారులుగా తీసుకునేందుకు మాత్రమే మొగ్గు చూపుతున్నారు తప్ప, పరిపాలనలో మాత్రం మహిళలకు స్థానం దక్కనీయటం లేదు. 

సమాన అవకాశాలు, సమాన హక్కుల కోసం సమాజమంతా పోరాడుతున్న ఈ సమయంలో అన్ని క్రీడా సమాఖ్యలు, పరిపాలనా కమిటీల్లోనూ సమాన ప్రాతినిథ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రీడా సమాఖ్యలు ఇప్పుడు కేవలం వ్యాపార దృక్పథంతో, లాభాపేక్షే పరమావధిగా వ్యవహరిస్తున్నాయి. భారత క్రీడా సమాఖ్యలు కూడా అందుకు ఏ మాత్రం మినహాయింపు కాదు. ఇంకోమాటకొస్తే భారతీయ క్రీడా ఫెడరేషన్లు నాలుగాకులు ఎక్కువే చదివాయి. 

క్రీడలు ఎవరు ఆడుతున్నారు? ఎవరు చూస్తున్నారు? అనేధీ మాత్రమే కొలమానం కాదు.  పరిపాలనలో ఎవరు ఉన్నారనే అంశం సైతం అత్యంత కీలకం. క్రీడల్లో మహిళా అథ్లెట్ల ప్రాతినిథ్యం రోజు రోజుకూ గణనీయంగా పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో పరిపాలనలో మహిళా ప్రతినిధులకు స్థానం లభించినప్పుడు మాత్రమే, మహిళా అథ్లెట్ల సమస్యలకు సత్వర పరిష్కారం లభించేందుకు అవకాశం ఉంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios