28 రోజుల్లో ముగియనున్న ఫిఫా వరల్డ్ కప్... అతి చిన్న దేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌గానూ రికార్డు... ఫిఫా కోసం 7 కొత్త స్టేడియాలను నిర్మించిన ఖతర్... 

ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ 2022 మరికొన్ని గంటల్లో ఆరంభం కానుంది. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకూ సాగే ఈ మహా సంగ్రామంలో 32 దేశాలు, టైటిల్ కోసం తలబడబోతున్నాయి. అరబ్బుల దేశం ఖతర్‌లోని 5 నగరాల్లో 8 వేదికల్లో జరగబోయే ఫిఫా వరల్డ్ కప్ 2022 కొన్ని సరికొత్త రికార్డులను క్రియేట్ చేయబోతోంది...

సాధారణంగా ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌ని వేసవిలో నిర్వహిస్తారు. అయితే ఏడారి రాజ్యం ఖతర్‌లో వేడి చాలా ఎక్కువ. ఈశాన్య దేశాల జనాలు, సమ్మర్‌లో ఖతర్ ఉండే వాతావరణాన్ని ఏ మాత్రం తట్టుకోలేరు. ఈ కారణంగా ఫిఫా వరల్డ్ కప్ 2022 టోర్నీని చలికాలంలో నిర్వహిస్తున్నారు...

ఖతర్‌లో ఫిఫా వరల్డ్ కప్‌ నిర్వహించడంపై చాలా రకాల విమర్శలు వినిపించాయి. శరణార్థల విషయంలో ఖతర్ వ్యవహరించే విధానంతో పాటు మానవ హక్కులు, మహిళా స్వేచ్ఛ తదితర విషయాల్లో ఇస్లామిక్ దేశం చాలా కఠినంగా ఉంటుంది. పెద్దగా ఫుట్‌బాల్ సంస్కృతి కూడా లేని ఖతర్‌లో ఫిఫా వరల్డ్ కప్ నిర్వహించడమంటే ఎక్కడో అవినీతి జరిగి ఉంటుందనే ఆరోపణలు కూడా వినిపించాయి...

స్వయంగా ఫిఫా ప్రెసిడెంట్ సెప్ బ్లాటర్ కూడా ఖతర్‌కి ఫిఫా వరల్డ్ కప్ ఆతిథ్య హక్కులను అప్పగించడం చాలా పెద్ద తప్పిందంగా రెండు సార్లు వ్యాఖ్యానించాడు. ఏడారి రాజ్యంలో జరుగుతున్న మొట్టమొదటి ఫిఫా వరల్డ్ కప్ ఇదే.

అంతేకాకుండా ఖతర్‌లో వాతావరణాన్ని ఫుట్‌బాల్ ప్లేయర్లు తట్టుకోలేరనే ఉద్దేశంతో ఈసారి టోర్నీని 28 రోజుల్లో ముగించబోతున్నారు. సాధారణంగా 30 నుంచి 31 రోజుల పాటు సాగే ఫిఫా వరల్డ్ కప్, ఈసారి అతి తక్కువ రోజుల్లో ముగియనుంది...

ఫుట్‌బాల్ మ్యాచ్‌లను చూసేందుకు 80 దేశాల ప్రేక్షకులకు వీసా ఫ్రీ ఎంట్రీ ఇస్తోంది ఖతర్. దాదాపు 1.5 మిలియన్ల ఫుట్‌బాల్ ఫ్యాన్స్, విదేశాల నుంచి ఖతర్‌లో వాలబోతున్నారని అంచనా. ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో ఇదో చరిత్ర...

ఖతర్ పూర్తి జనభా 2.9 మిలియన్లు మాత్రమే. ఇందులో 99 శాతం మంది రాజధాన దోహాలోనే జీవిస్తారు. ఖతర్ విస్తీర్ణం 11 వేల చదరపు కిలోమీటర్లు. ఫిఫా వరల్డ్ కప్‌కి ఆతిథ్యమిస్తున్న అతి చిన్న దేశంగానూ రికార్డు క్రియేట్ చేయబోతోంది ఖతర్. 

ఫిఫా వరల్డ్ కప్‌ని 8 స్టేడియాల్లో నిర్వహించబోతున్నారు, ఇందులో 7 స్టేడియాలు పూర్తిగా కొత్తవి. వరల్డ్ కప్ హక్కులు పొందిన తర్వాత ఫిఫా కోసమే 7 స్టేడియాలను నిర్మించింది ఖతర్. వీటి నిర్మాణం కోసం 10 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది ఖతర్. (భారతీయ కరెన్సీలో 83 కోట్ల రూపాయలకు పైగా)... వీటి నిర్మాణంలో 70 వేల అవుట్‌డోర్ లైట్స్, 84 వేల టన్నుల స్టీల్ ఉపయోగించారు.