లండన్: భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్సు ప్రారంభించిన భారత్ పతనం ప్రారంభమైంది. 1 పరుగుకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్ మరో పరుగుకు, అంటే 2 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్రాడ్ బౌలింగులో డకౌట్ గా వెనుదిరిగాడు. అంతకు ముందు శిఖర్ ధావన్ 1 పరుగు చేసి అండర్సన్ బౌలింగులో ఎల్బీడబ్ల్యుగా పెవిలియన్ చేరుకోగా, పూజారా కూడా అతని బౌలింగులోని ఎల్బీడబ్ల్యుగా వెనుదిరిగాడు.

ఇంగ్లాండు తన రెండో ఇన్నింగ్సులో 423కు ఎనిమిది వికెట్లు కోల్పోయి డిక్లేర్ చేసింది.  ఇంగ్లాండు తొలి ఇన్నింగ్సులో 332 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్సులో 292 పరుగులు చేసింది. ఇంగ్లాండు భారత్ తొలి ఇన్నింగ్సుపై 463 పరుగుల ఆధిక్యంలో ఉంది. తద్వారా భారత్ పై ఇంగ్లాండు ఒత్తిడి పెంచింది. 

ఇదిలావుంటే, తన చివరి టెస్టు మ్యాచు చివరి ఇన్నింగ్సులో ఇంగ్లాండు ఆటగాడు అలిస్టర్ కుక్ సెంచరీ చేసి అలరించాడు. తన వీడ్కోలును ఘనంగా చాటుకున్నాడు. అయితే, అతను తెలుగు ఆటగాడు హనుమ విహారీకి దొరికిపోయాడు. తొలి ఇన్నింగ్సులో బ్యాట్ తో రాణించి అర్థ సెంచరీ చేసిన విహారీ బౌలింగులోనూ రాణించి వరుసగా రెండు వికెట్లు తీశాడు. అయితే హ్యాట్రిక్ మిస్సయ్యాడు. విహారీ మూడు వికెట్లు తీశాడు.

నాలుగో రోజు ఆట మొదలైనప్పటి నుంచి వికెట్ల వద్ద పాతుకుపోయిన   అలిస్టర్ కుక్ (147), కెప్టెన్ జో రూట్ (125)లను పెవిలియన్ విహారీ పంపాడు. 95వ ఓవర్ తొలి బంతికి జో రూట్‌ను అవుట్ చేసిన విహారీ ఆ తర్వాతి బంతికి అలిస్టర్ కుక్‌ను అవుట్ చేశాడు.

షమీ వేసిన 101వ ఓవర్ చివరి బంతికి జానీ బెయిర్‌స్టో (18) బౌల్డ్ కాగా, ఆ తర్వాత రవీంద్ర జడేజా బౌలింగ్‌లో షమీకి క్యాచ్ ఇచ్చి జోస్ బట్లర్ (0) డకౌట్ అయ్యాడు. విహారీ, జడేజాలకు మూడేసి వికెట్లు లభించగా, షమీకి రెండు వికెట్లు దక్కాయి.