జమ్మూ కశ్మీర్ లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ రాష్ట్రంలో వేలాదిగా మిలటరీ బలగాలను కేంద్రం మోహరిస్తోంది. జమ్మూ కశ్మీర్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఆ నిర్ణయం ఏమిటనేది మరికాసేపట్లో తేలనుంది. ఇప్పటికే అక్కడ 144 సెక్షన్ విధించారు. 
కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న విషయం పక్కన పెడితే... టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ విషయంలో మాత్రం ఆయన అభిమానులు ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వెస్టిండీస్ పర్యటనను పక్కన పెట్టేసి... ధోనీ ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆటకు రెండు నెలలు విశ్రాంతి ఇచ్చి మరీ ఆయన విధులు నిర్వహిస్తున్నారు. కశ్మీర్ లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ధోనీ రక్షణ గురించి ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన దక్షిణ కశ్మీర్ లోని ఆర్మీ వెక్టర్ ఫోర్స్ లో విధులు నిర్వహిస్తున్నారు. గత నెల 31వ తేదీన ధోనీ విధుల్లో చేరగా... ఈ నెల 15వ తేదీ వరకు తన విధులు నిర్వర్తించనున్నారు.

అయితే... ధోనీ విధుల్లో చేరిన సమయంలో పరిస్థితులు అంతా బాగానే ఉన్నాయి. కానీ  రెండు మూడు రోజుల నుంచి కశ్మీర్ లో పరిస్థితులు భిన్నంగా మారాయి. అమర్ నాథ్ యాత్రను రద్దు చేశారు. పర్యాటకుల రాకపోకలను నిలిపివేశారు. ఉగ్రదాడుల హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారనే అనుమానాలు అభిమానుల్లో కలుగుతున్నాయి. 

ఇలాంటి సమయంలో.. ధోని అక్కడ విధులు నిర్వహించడం కరెక్ట్ కాదని... వెనక్కి వచ్చేయాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం మహీ... దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమేనని... ఆయనని చూసి తాము గర్వపడుతున్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు.