2018 లో బాల్ ట్యాంపరిగ్ వివాదంలో చిక్కుకున్న ఆసిస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ 2019 ఆరంభంలోనే శుభవార్త అందుకున్నాడు. ఇప్పటికే ఇద్దరు పిల్లలకు తండ్రిగా వున్న వార్నర్ మరో బిడ్డకు తండ్రిగా మారనున్నాడు. ఈ విషయాన్ని వార్నర్ భార్య క్యాండిల్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. 

2018 కి వీడ్కోలు పలుకుతూ క్యాండిల్ వార్నర్ ఇలా ట్వీట్ చేశారు. '' ఈ సంవత్సరం మీ అందరు ప్రేమాభిమానాలను మా కుటుంబంపై ఉంచి అండగా నిలిచారు. అందువల్ల ఈ ఆనంద క్షణాలను మీతో పంచుకుంటున్నాను. 2018 లో నలుగురిగా వున్న మా కుటుంబం 2019 లో ఐదుగురిగా మారబోతోంది. హ్యాపీ న్యూ ఇయర్'' అంటూ క్యాండిల్ పేర్కొన్నారు. 

ఇప్పటికే వార్నర్ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలున్నారు. తాజాగా వార్నర్ మూడో బిడ్డకు తండ్రిగా మారనున్నాడు. తనకు అత్యంత ఇష్టమైన క్రికెట్ కు దూరమై బాధల్లో వున్న వార్నర్ కి ఆయన భార్య ఈ ఏడాది ఆరంభంలోనే శుభవార్త అందించింది.   

గత సంవత్సరం బాల్ ట్యాంపరింగ్‌ వివాదంతో చిక్కుకున్న వార్నర్ ను క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేదం విధించింది. దీంతో దక్షిణాప్రికాతో టెస్ట్ సీరిస్ తర్వాత అతడు అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా వున్నాడు. అయితే మరో నాలుగు నెలల్లో ఈ నిషేదం ముగియనుండగా అంతకు ముందే వార్నర్ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.