CWG 2022: కాంస్యం నెగ్గిన లవ్‌ప్రీత్ సింగ్.. భారత్‌కు పతకాల పంట పండిస్తున్న వెయిట్ లిఫ్టర్లు
Commonwealth Games: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ కు ఇప్పటివరకు 14 పతకాలు రాగా అందులో 9 మెడల్స్ వెయిట్ లిఫ్టింగ్ లో వచ్చినవే కావడం గమనార్హం.
కామన్వెల్త్ క్రీడలలో భారత వెయిట్ లిఫ్టర్లు అదరగొడుతున్నారు. ఈ క్రీడలలో భారత్ మరో పతకం నెగ్గింది. భారత వెయిట్ లిఫ్టర్ లవ్‌ప్రీత్ సింగ్.. తాజాగా పురుషుల 109 కిలోల ఈవెంట్ లో కాంస్యం నెగ్గాడు. స్నాచ్ తో పాటు క్లీన్ అండ్ జెర్క్ లో కలిపి ఏకంగా 355 కిలోల బరువు ఎత్తిన లవ్‌ప్రీత్ సింగ్.. మూడో స్థానంతో కాంస్యాన్ని కైవసం చేసుకున్నాడు. స్నాచ్ లో 163 కిలోల బరువు ఎత్తిన లవ్‌ప్రీత్.. క్లీన్ అండ్ జెర్క్ లో 192 కిలోలను ఎత్తాడు.
పురుషుల 109 కిలోల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్ లో కామరూన్‌కు చెందిన జూనియర్ ఎంగడ్జ న్యాబెయూ 361 కిలోల బరువు (160 కిలోలు, 201 కిలోలు) ఎత్తి స్వర్ణాన్ని నెగ్గగా.. సమోవాకు చెందిన జాక్ ఒపెలోజ్ 358 కిలోలు (164 కిలోలు, 194 కిలోలు) ఎత్తి రజతాన్ని గెలిచాడు.
ఇదిలాఉండగా ఇప్పటివరకు ఈ పోటీలలో భారత్ 14 పతకాలు గెలిచింది. ఇందులో 9 మెడల్స్ వెయిట్ లిఫ్టర్లు సాధించనవే కావడం గమనార్హం. అవిపోగా మిగిలిన ఐదు పతకాలలో జూడో (2), బ్యాడ్మింటన్ మిక్స్డ్ ఈవెంట్ (1), లాన్ బౌల్స్ (1), టేబుల్ టెన్నిస్ (1) క్రీడలకు వచ్చాయి.
వెయిట్ లిఫ్టర్లు.. పతకాలు...
1. మీరాబాయి చాను (స్వర్ణం)
2. జెరెమి లాల్రినుంగ (స్వర్ణం)
3. అచింత షెవులి (స్వర్ణం)
4. బింద్యారాణి దేవి (రజతం)
5. సంకేత్ సర్గర్ (రజతం)
6. వికాస్ ఠాకూర్ (రజతం)
7. గురురాజ పూజారి (కాంస్యం)
8. హర్జీందర్ కౌర్ (కాంస్యం)
9. లవ్‌ప్రీత్ సింగ్ (కాంస్యం)
లవ్‌ప్రీత్ సింగ్ కు కాంస్యం రావడంతో భారత్ వెయిట్ లిఫ్టింగ్ లో గోల్డ్ కోస్ట్ (2018) కామన్వెల్త్ గేమ్స్ లో సాధించిన మెడల్స్ సంఖ్య (9)ను సమం చేసింది.