కామన్వెల్త్ గేమ్స్‌లో అదరగొడుతున్న అథ్లెట్లు... 3 వేల మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో అవినాష్‌కి రజతం...

పురుషుల 3 వేల మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో భారత అథ్లెట్ అవినాష్ సబ్లేకి రజతం... అథ్లెటిక్స్‌లో భారత్‌కి రికార్డు స్థాయిలో నాలుగో పతకం... 

Commonwealth Games 2022: Avinash wins SILVER in 3000m Steeplechase clocking New National Record

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు అదిరిపోయే పర్ఫామెన్స్‌తో పతకాల పంట పండిస్తున్నారు. బర్మింగ్‌హమ్‌ గేమ్స్‌లో 9వ రోజు వుమెన్స్ వాక్ రేసులో ప్రియాంక గోస్వామి రజతం సాధించి బోణీ కొట్టగా... పురుషుల 3 వేల మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో భారత అథ్లెట్ అవినాష్ సబ్లే రజతం గెలిచాడు. 8:11.20 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకున్న అవినాష్, తన పర్సనల్ బెస్ట్‌తో భారత్‌కి సిల్వర్ మెడల్ అందించాడు...

స్టిపుల్‌ఛేజ్ ఈవెంట్‌లో భారత్‌కి ఇదే మొట్టమొదటి మెడల్. తన పర్సనల్ బెస్ట్ నమోదు చేసిన అవినాష్, అథ్లెటిక్స్‌లో నాలుగో పతకాన్ని అందించాడు.  అంతకుముందు వుమెన్స్ 10 కిలో మీటర్ల రేస్ వాక్‌లో పాల్గొన్న ప్రియాంక గోస్వామి, 43:38.00 సెకన్లలో రేస్‌ని ముగించి రెండో స్థానంలో నిలిచి, రజతం సాధించింది... ప్రియాంకకి ఇదే అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన కూడా... రేస్ వాక్ ఈవెంట్‌లో భారత అథ్లెట్లు పతకం సాధించడం కూడా ఇదే తొలిసారి...

అలాగే పురుషుల హై జంప్‌లో తేజస్విన్ యాదవ్ కాంస్య పతకం, లాంగ్ జంప్‌లో  శ్రీశంకర్ మురళీ రజత పతకం సాధించి... ఈ ఈవెంట్లలో భారత్‌కి మొట్టమొదటిసారిగా పతకాలు అందించారు. బర్మింగ్‌హమ్ కామన్వెల్త్ గేమ్స్‌లో షూటింగ్‌ని తొలగించడంతో భారీగా పతకాలు కోల్పోయింది టీమిండియా...

కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్ ఎక్కువ పతకాలు సాధించింది షూటింగ్‌లోనే. ఆ తర్వాతి స్థానం వెయిట్‌లిఫ్టింగ్‌ది. అయితే షూటింగ్‌ ఈవెంట్ లేకపోయినా మొట్టమొదటిసారి అథ్లెటిక్స్‌ ఫీల్డ్ అండ్ ట్రాక్ ఈవెంట్స్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్‌తో పతకాలు కొల్లగొడుతున్న భారత అథ్లెట్లు... టీమిండియా గౌరవాన్ని కాపాడుతున్నారు...

అలాగే వుమెన్స్ 4X100 రిలే ఈవెంట్‌లో భారత మహిళా స్ప్రింటర్లు డ్యూటీ చంద్, హిమా దాస్, శ్రబానీ నంద, జ్యోతి ఎర్రాజీ 44.45 సెకన్లలో హీట్‌ని ముగించి ఫైనల్‌కి అర్హత సాధించారు. 

రెజ్లింగ్‌లో 76 కేజీల విభాగంలో పోటీపడిన భారత మహిళా రెజ్లర్ పూజా సిహాగ్, తన ప్రత్యర్థి న్యూజిలాండ్‌ రెజ్లర్‌పై 5-3 తేడాతో గెలిచి సెమీ ఫైనల్‌కి దూసుకెళ్లింది. 48 కేజీల మహిళల బాక్సింగ్ విభాగంలో సెమీ ఫైనల్‌లో పోటీపడిన భారత బాక్సర్ నితూ గంగస్, కెనడాకి చెందిన ప్రియాంక దిల్లాన్‌పై అద్భుత విజయం అందుకుని ఫైనల్‌కి దూసుకెళ్లింది. అలాగే భారత బాక్సర్ అమిత్ పంగల్ 51 కేజీల విభాగంలో జాంబియన్ బాక్సర్‌పై విజయం అందుకుని ఫైనల్‌కి అర్హత సాధించాడు. ఈ ఇద్దరు బాక్సర్లు భారత్‌కి పతకాలు ఖాయం చేశారు. 

రెజ్లింగ్‌లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్, రెండో రౌండ్‌లో 6-0 తేడాతో విజయం అందుకుని క్వార్టర్ ఫైనల్ రౌండ్‌కి అర్హత సాధించింది. 50 కేజీల విభాగంలో పోటీపడిన భారత రెజ్లర్ పూజా గెహ్లాట్, తన ప్రత్యర్థిపై 12-2 తేడాతో విజయం అందుకుని మూడో రౌండ్‌కి అర్హత సాధించింది...

పురుషుల   74 కేజీల విభాగంలో పోటీపడిన భారత రెజ్లర్ నవీన్, క్వార్టర్ ఫైనల్‌లో 10-0 తేడాతో విజయం అందుకుని సెమీ ఫైనల్‌కి అర్హత సాధించాడు. టేబుల్ టెన్నిస్ వుమెన్స్ డబుల్స్‌లో భారత జోడి శ్రీజ-రీతూ, వేల్స్‌కి చెందిన అనా- లారా జోడిపై 11-7, 11-4, 11-3 తేడాతో విజయం అందుకుని క్వార్టర్ ఫైనల్‌కి దూసుకెళ్లింది.   

అలాగే పురుషుల సింగిల్స్‌లో సీనియర్ టీటీ ప్లేయర్ శరత్ కమల్ సెమీ ఫైనల్‌కి అర్హత సాధించాడు. తన ప్రత్యర్థిపై 4-0 తేడాతో విజయం అందుకున్న శరత్ కమల్, రేపు సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నాడు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios