కామన్వెల్త్ గేమ్స్ 2022: జావెలిన్ త్రోలో అనూ రాణికి కాంస్యం... పతకాల పట్టికలో నాలుగో స్థానానికి భారత్...
మహిళల జావెలిన్ త్రోలో అన్నూ రాణికి కాంస్యం... బ్యాడ్మింటన్‌లో ఫైనల్ చేరిన లక్ష్యసేన్...
బర్మింగ్‌హమ్ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. మహిళల జావెలిన్ త్రో ఈవెంట్‌లో 60.03 మీటర్లు విసిరిన అనూ రాణి, మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలిచింది. దీంతో భారత్ 46 పతకాలతో పాయింట్ల పట్టికలో టాప్ 4 పొజిషన్‌కి దూసుకెళ్లింది...
బ్యాడ్మింటన్‌లో భారత స్టార్ ప్లేయర్ లక్ష్యసేన్, పురుషుల సింగిల్స్‌లో ఫైనల్‌కి దూసుకెళ్లాడు. మలేషియా ప్లేయర్ జియా హెంగ్ తోతో జరిగిన సెమీ ఫైనల్‌లో 2-1 తేడాతో విజయం అందుకుని ఫైనల్‌కి వెళ్లాడు లక్ష్యసేన్. మరో సెమీ ఫైనల్‌లో భారత స్టార్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ పోటీపడుతున్నాడు. ఒకవేళ శ్రీకాంత్ గెలిస్తే ఫైనల్ మ్యాచ్‌లో లక్ష్యసేన్, శ్రీకాంత్ గోల్డ్ మెడల్ కోసం పోటీపడతారు. అదే జరిగితే పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో భారత్‌కి రెండు పతకాలు ఖాయమైపోతాయి...
మహిళల సింగిల్స్‌లో కాంస్య పతక పోరులో భారత ప్లేయర్ శ్రీజ ఆకుల పోరాడి ఓడింది. యంగ్‌జీ లియూతో జరిగిన మ్యాచ్‌లో 3-4 తేడాతో పోరాడి ఓడిన శ్రీజ ఆకుల, మెడల్ సాధించలేకపోయింది.
అంతకుముందు త్రిబుల్ జంప్ ఈవెంట్‌లో రెండు పతకాలు పట్టుకొచ్చారు భారత అథ్లెట్లు... భారత అథ్లెట్ ఎల్డ్‌హోస్ పాల్ 17.03 మీటర్ల దూరం దూకి స్వర్ణం కైవసం చేసుకోగా మరో భారత జంపర్ అబ్దుల్లా అబూబకర్ 17.02 మీటర్లు దూకి రజతం గెలిచాడు. ఇదే ఈవెంట్‌లో పోటీపడిన భారత మరో జంపర్ ప్రవీణ్ చిత్రవెల్ 16.89 మీటర్లు దూకి నాలుగో స్థానంలో నిలిచాడు. ప్రవీణ్ కాస్త మెరుగైన పర్ఫామెన్స్ ఇచ్చి ఉంటే త్రిబుల్ జంప్ ఈవెంట్‌లో మూడు పతకాలు భారత్‌కే దక్కేవి...
పురుషుల 10000 మీటర్ల రేస్ వాక్ ఫైనల్స్‌లో భారత అథ్లెట్ సందీప్ కుమార్ కాంస్యం గెలిచాడు. 10 వేల మీటర్ల రేస్ వాక్‌ని 38:49.21 సెకన్లలో ముగించిన సందీప్, మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఎడిషన్‌లో రేస్ వాక్‌లో భారత్‌కి ఇది రెండో మెడల్. వుమెన్స్ 10 కిలో మీటర్ల రేస్ వాక్‌లో ప్రియాంక గోస్వామికి సిల్వర్ దక్కింది.
కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత బాక్సర్లు పసి పట్టు పడుతున్నారు. భారీ అంచనాలతో బర్మింగ్‌హమ్‌లో అడుగుపెట్టిన భారత స్టార్ బాక్సర్ అమిత్ పంగల్ స్వర్ణం గెలిచాడు. 51 కేజీల విభాగంలో పోటీపడిన అమిత్ పంగల్, ఇంగ్లాండ్ బాక్సర్ కియరన్ మెక్‌డొనాల్డ్‌పై అద్భుత విజయం అందుకుని.. భారత్ స్వర్ణ పతకాల సంఖ్యను 15కి పెంచాడు... 2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం గెలిచిన అమిత్ పంగల్, ఈసారి ఏకంగా గోల్డ్ గెలిచి తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు...
అంతకుముందు మహిళల 48 కేజీల విభాగంలో పోటీపడిన భారత బాక్సర్ నీతూ గంగాస్, తన ప్రత్యర్థి ఇంగ్లాండ్ బాక్సర్ డెమీ జాడే రిస్తాన్‌పై విజయం అందుకుని పసిడి పతకం కైవసం చేసుకుంది. రెండు సార్లు వరల్డ్ యూత్ మెడల్స్ గెలిచిన నీతూకి ఇదే మొట్టమొదటి కామన్వెల్త్ గేమ్స్ కావడం విశేషం.
కామన్వెల్త్ గేమ్స్ 2022 సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అంపైర్ టెక్నికల్ తప్పిదం కారణంగా ఓడిపోయిన భారత మహిళా హాకీ జట్టు, కాంస్య పతక పోరులో సత్తా చాటింది. హై డ్రామా మధ్య షూటౌట్ వరకూ సాగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత మహిళా హాకీ జట్టు 2-1 తేడాతో విజయం అందుకుంది...
మొదటి క్వార్టర్‌లోనే భారత హాకీ ప్లేయర్ సలీమా తేటే గోల్ చేసి 1-0 తేడాత భారత జట్టుకి ఆధిక్యం అందించింది. ఆ తర్వాత రెండు, మూడు క్వార్టర్లలో ఇరు జట్ల ప్లేయర్లు గోల్ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు... ఆఖరి నాలుగో క్వార్టర్ ఆఖర్లో హై డ్రామా నడిచింది...
మరో 18 సెకన్లలో మ్యాచ్ ముగుస్తుందని గోల్ చేసిన న్యూజిలాండ్, స్కోరును 1-1 తేడాతో సమం చేసింది. దీంతో మ్యాచ్ ఫలితం తేల్చేందుకు పెనాల్టీ షూట్‌ఆఫ్‌ని ఎంచుకున్నారు. ఇందులో గోల్ సాధించిన భారత జట్టు 2-1 తేడాతో మ్యాచ్‌ని ముగించి కాంస్యం కైవసం చేసుకుంది...
టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుత ఆటతీరు చూపించినా నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న భారత మహిళా హాకీ జట్టు, సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేసిన టెక్నికల్ పొరపాట్ల కారణంగా ఓడిపోవాల్సి వచ్చింది.
బ్యాడ్మింటన్‌లో భారత స్టార్ షెట్లర్ పీవీ సింధు, వుమెన్స్ సింగిల్స్‌లో ఫైనల్‌కి దూసుకెళ్లింది. సింగపూర్‌కి చెందిన వరల్డ్ 18వ ర్యాంకర్ యో జీ మిన్‌తో జరిగిన మ్యాచ్‌లో 21-19, 21-17 తేడాతో వరుస సెట్లలో విజయం అందుకుంది పీవీ సింధు...
కామన్వెల్త్ గేమ్స్ 2022 సెలక్షన్ సమయంలో భారత సీనియర్ బాక్సర్ మేరీ కోమ్ గాయపడడంతో 21 ఏళ్ల నీతూ గంగాస్‌కి అవకాశం దక్కింది. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్న నీతూ గంగాస్, మేరీ కోమ్ లేని లోటును పసిడి పతకంతో తీర్చేసింది...