అబ్బే అలాంటిదేమీ లేదే..! బ్రిజ్ భూషణ్‌కు ఊరట.. రెజ్లర్లకు షాక్..

WFI: బ్రిజ్ భూషణ్ పై  లైంగిక ఆరోపణలు చేసిన  మహిళా  రెజ్లర్లు, ఇతర సిబ్బంది అందుకు సంబంధించిన ఆధారాలేవీ  చూపలేదని..  అవన్నీ  నిరాధారమేనని తేలినట్టు  సమాచారం. 

Big Shock To Wrestlers, Sexual harassment allegations on WFI Chief Brij Bhushan Sharan Singh couldn't be proven MSV

భారత రెజ్లింగ్ సమాఖ్య  అధ్యక్షుడు, ప్రస్తుతం కైసర్ గంజ్ (యూపీ)  లోకసభ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ  బ్రిజ్ భూషణ్ సింగ్ పై  టీమిండియా రెజ్లర్లు  చేసిన ఆరోపణలు నిరాధారమని తేలింది. ఈ కేసులో  బ్రిజ్ భూషణ్ పై  లైంగిక ఆరోపణలు చేసిన  మహిళా  రెజ్లర్లు, ఇతర సిబ్బంది అందుకు సంబంధించిన ఆధారాలేవీ  చూపలేదని..  అవన్నీ  నిరాధారమేనని తేలినట్టు  సమాచారం.  జనవరిలో  దేశంలోని ప్రముఖ రెజ్లర్లు వినేశ్ పోగట్ తో పాటు  భజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, సంగీత పోగట్,  సుమిత్ మాలిక్  వంటి స్టార్  రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. 

రెజ్లర్ల పోరాటానికి  క్రీడా వర్గాల నుంచే గాక రాజకీయ వర్గాల నుంచీ మద్దతు రావడంతో  కేంద్ర ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకోక తప్పలేదు.  కేంద్ర క్రీడా శాఖ మంత్రి   అనురాగ్ సింగ్ ఠాకూర్.. మేరీ కోమ్ ఆధ్వర్యంలో  ఏడుగురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటుచేశారు.  

బ్రిజ్ భూషణ్ పై లైంగిక ఆరోపణలు  చేసిన రెజ్లర్లు, ఇతర డబ్ల్యూఎఫ్ఐ   సిబ్బందిని ఈ కమిటీ విచారించింది.   అయితే ఆరోపణలు చేసినవారిలో ఏ ఒక్కరూ కూడా అందుకు సరైన ఆధారాలు చూపించలేదని  తెలుస్తున్నది.  బ్రిజ్ భూషణ్ కు  వ్యతిరేకంగా  ఆరోపణలు ఒక్కటి కూడా నిజం కాలేదని  జాతీయ మీడియాలలో వస్తున్న సమాచారం ద్వారా తెలుస్తున్నది. 

పీటీఐలో వచ్చిన సమాచారం మేరకు.. ‘రెజ్లర్లు  బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా చేసిన ఆరోపణలను నిరూపించలేకపోయారు. మా విచారణలో  ఒక మహిళా ఫిజియో (పేరు వెల్లడించలేదు).. బల్గేరియాలో ఉండగా  బ్రిజ్ భూషణ్ తనకు వెన్నులో నొప్పిగా ఉందని మసాజ్  చేయమన్నాడని, అయితే తాను మాత్రం అందుకు నిరాకరించానని చెప్పుకొచ్చింది. అంతకుమించి మిగిలిన  రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పలేకపోయారు’ అని   డబ్లూఎఫ్ఐ వర్గాలు తెలిపాయి.  

ఏం జరిగింది..? 

జనవరి 18న భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ పోగట్ తో పాటు మరికొంతమంది  రెజ్లర్లు..  డబ్ల్యూఎఫ్ఐ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ధర్నా సందర్భంగా వినేశ్ పోగట్ స్పందిస్తూ...‘మహిళా రెజ్లర్లను   బ్రిజ్ భూషణ్, జాతీయ కోచ్ లు లైంగికంగా వేధిస్తున్నారు.  ఒలింపిక్స్ లో నా ప్రదర్శన తర్వాత నన్ను  ఎందుకూ పనికిరావని తిట్టారు.  బ్రిజ్ భూషణ్ వేధింపుల వల్ల నేను మానసిక క్షోభకు గురయ్యా.  ఒకసారి ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నా.. మాకు గాయాలైతే పట్టించుకునే నాథుడే లేడు.  ఆయనపై ఫిర్యాదు చేసినందుకు గాను నన్ను చంపేస్తానని బెదిరింపులు కూడా వచ్చాయి’ అని ఆమె కన్నీటి పర్యంతమైంది.  అంతేగాక.. ‘కోచ్‌లు మహిళా రెజ్లర్లతో అసభ్యంగా వ్యవహరిస్తున్నారు. ఫెడరేషన్ లో ఉన్న మహిళా కోచ్ లనూ ఇలాగే వేధిస్తున్నారు. బ్రిజ్ భూషణ్ చాలా మంది  అమ్మాయిలను లైంగికంగా వేధించాడు..’ అని తెలిపింది. మరో రెజ్లర్ భజరంగ్ పునియా  మాట్లాడుతూ.. ‘ఫెడరేషన్ లో ఉన్నవారికెవరికీ  ఈ ఆట గురించి తెలియదు.   బ్రిజ్ భూషన్  మమ్మల్ని తిట్టేవారు.  కొట్టారు..’అని అన్నాడు.   తమ పోరాటం ప్రభుత్వం మీద కాదని.. ఫెడరేషన్,   అధ్యక్షుడి మీదేనని  ఆటగాళ్లు చెప్పారు. 

నిజమని తేలితే ఉరేసుకుంటా : బ్రిజ్ భూషణ్ 

అయితే తనపై రెజ్లర్లు చేసిన ఆరోపణలను బ్రిజ్ భూషణ్ ఖండించారు.   ఇదంతా తనపై జరుగుతున్న కుట్ర అని తెలిపారు.   ఓ పేరు మోసిన పారిశ్రామికవేత్త  దీనికి పాత్రదారి అని ఆరోపించారు. వినేశ్ ఓడినప్పుడు  తాను ఓదార్చానని.. ఫెడరేషన్ లో మహిళలను లైంగికంగా వేధించానని నిరూపిస్తే తాను ఉరేసుకుంటానని అన్నారు.  తనపై ఈ ఆరోపణలు వస్తున్నా డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేయబోనని  చెప్పారు.  డబ్ల్యూఎఫ్ఐకి ఆయన  2011 నుంచి  అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios