ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సీరిస్ మొత్తానికి యువ ఆటగాడు పృథ్విషా దూరమయ్యాడు. బిసిసిఐ సెలక్షన్ కమిటీ ఇవాళ మిగతా రెండు టెస్టుల కోసం భారత జట్టును ప్రకటించింది. ఇందులో పృథ్విషా స్థానంలో మయాంక్ అగర్వాల్ కు అవకాశం కల్పిస్తూ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. 

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టెస్ట్ సీరిస్ ఆరంభానికి ముందు భారత జట్టు ప్రాక్టిస్ మ్యాచ్ ఆడింది. ఇందులో పృథ్విషా కాలికి తీవ్ర గాయమవడంతో మొదటి రెండు టెస్టులకు దూరమయ్యాడు. అయితే ఈ గాయం ఇంకా తగ్గకపోవడంతో మిగతా రెండు టెస్టుల్లో కూడా ఆడే అవకాశాన్ని అతడు కోల్పోయాడు. గాయం నుంచి తిరిగి కోలుకోకపోవడంతో అతడికి విశ్రాంతినిచ్చారు.

మొదటి రెండు టెస్టుల్లో భారత ఓపెనర్లు విఫలమయ్యారు కాబట్టి తదుపరి టెస్టులకు జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉంది. అందుకోసమే మయాంక్ అగర్వాల్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. షా స్థానంలో టీమ్‌లోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ రాహుల్  లేదా మురళీ విజయ్ స్థానంలో ఓపెనర్‌గా బరిలో దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీమ్ మేనేజ్ మెంట్ కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 

రేపటితో పెర్త్ టెస్ట్ ముగియనుంది. ఆ తర్వాత మూడో టెస్టు డిసెంబర్ 26న మెల్‌బోర్న్‌లో ..జనవరి 3న  నాలుగో టెస్టుకు సిడ్నీ లో ప్రారంభం కానున్నాయి. ఈ రెండు టెస్టులకోసమే తాజాగా జట్టు ఎంపిక జరిగింది. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి టెస్టులో గెలిచిన కోహ్లీసేన 1-0తో ఆధిక్యంలో వుంది. 


భారత జట్టు:

విరాట్ కోహ్లీ(కెప్టెన్), మురళీ విజయ్, కేఎల్ రాహుల్, చటేశ్వర్ పుజారా,అజింక్య రహానె,హనుమ విహారి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, పార్థీవ్ పటేల్,రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ సింగ్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్య, మయాంక్ అగర్వాల్