బ్యాట్ తో సిక్స్ కొట్టినవాడిని.. తల్వార్ తో చంపలేనా అంటూ పాక్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ప్రజలను ఉద్దేశిస్తూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.

ఇంతకీ మ్యాటరేంటంటే...జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టికల్ 370రద్దు చేయడాన్ని వ్యతిరేకించిన పాక్.. పదేపదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది. కశ్మీర్ అంశంపై ఇరు దేశాల మధ్య అక్టోబర్‌లో భీకర యుద్ధం జరుగుతుందని పాక్ మంత్రి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా.. పాక్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ ఇదే అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
 
‘కశ్మీర్ సోదరులారా భయపడకండి. నేను మీకు అండగా ఉంటాను. బ్యాట్‌పట్టి సిక్స్ కొట్టిన వాడిని, తల్వార్‌తో మనిషిని చంపలేనా’ అంటూ రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన భారత నెటిజన్లు.. తమదైన శైలిలో జావెద్‌కు జవాబిస్తున్నారు.