బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్‌లో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది. ఆసీస్ నిర్దేశించిన 287 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించడంలో టీమిండియా విఫలమైంది. 5 వికెట్ల నష్టానికి 114 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఐదవ రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌ మరో ఐదు పరుగులు జోడించి హనుమ విహారి వికెట్‌ను కోల్పోయింది.

ఆ తర్వాత పంత్, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ పెవిలియన్‌కు చేరారు. టాపార్డర్ దారుణంగా విఫలమవ్వడంతో మిడిలార్డర్, లోయరార్డర్ సైతం వారిని అనుసురించింది. నిజానికి నాలుగో రోజు కోహ్లీ ఔటైన వెంటే భారత్ పరాజయం ఖరారైంది.

అయినప్పటికీ విహారీ, పంత్ క్రీజులో ఉండటంతో అభిమానులకు విజయంపై చిన్న ఆశ ఉంది. అయితే చివరి రోజు స్టార్క్, లయన్‌లు విజృంభించడంతో భారత్ ఆశలు ఆవిరయ్యాయి. దీంతో భారత్ 56 ఓవర్లలో 140 పరుగులకు అలౌటైంది. ఆస్ట్రేలియా 146 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి.. సిరీస్‌ను 1-1తో సమం చేసింది.