Asianet News TeluguAsianet News Telugu

ఏషియన్ గేమ్స్ 2023: షాట్ పుట్‌లోనూ గోల్డే.. తాజిందర్‌పాల్ సింగ్ ఖాతాలో రికార్డు స్వర్ణం..

ఆఖరి ప్రయత్నంలో టాప్‌లోకి దూసుకెళ్లి, స్వర్ణం నెగ్గిన భారత అథ్లెట్ తాజిందర్‌పాల్ సింగ్ తూర్.. ఏషియన్ గేమ్స్‌లో వరుసగా రెండోసారి స్వర్ణం కైవసం.. 

Asian Games 2023: Tajinderpal Singh Toor on wins consecutive Gold medal at the Asian Games CRA
Author
First Published Oct 1, 2023, 5:42 PM IST

ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో భారత్‌కి ఆదివారం బాగా కలిసి వస్తోంది. మెన్స్ ట్రాప్ షూటింగ్ ఈవెంట్‌లో స్వర్ణం దక్కగా, భారత అథ్లెట్ అవినాష్ సాబుల్ స్వర్ణం సాధించాడు. తాజాగా షాట్ ఫుట్ ఈవెంట్‌లో భారత అథ్లెట్ తాజిందర్‌పాల్ సింగ్ తూర్, గోల్డ్ మెడల్ సాధించాడు..

మొదటి రెండు ప్రయత్నాల్లో ఫాల్స్ చేసిన తాజిందర్‌పాల్ సింగ్ తూర్, మూడో ప్రయత్నంలో 19.51 మీటర్లు విసిరాడు. నాలుగో ప్రయత్నంలోనూ ఫాల్ కాగా, ఆఖరి ప్రయత్నంలో 20.36 మీటర్ల దూరం విసిరిన తాజిందర్‌పాల్ సింగ్.. టాప్‌లోకి దూసుకెళ్లి స్వర్ణం సాధించాడు. 

2018 ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన తాజిందర్‌పాల్ సింగ్‌కి ఇది వరుసగా రెండో ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్. ఇదే ఏడాది ఏషియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లోనూ గోల్డ్ మెడల్ సాధించాడు తాజిందర్‌పాల్ సింగ్.. 

పురుషుల 200 మీటర్ల అథ్లెటిక్స్‌లో భారత అథ్లెట్ అమ్లన్ బోరోహెన్ ఐదో స్థానంలో నిలిచి, పతకాన్ని మిస్ చేసుకున్నాడు.  

3 వేల మీటర్ల స్టెప్లెచేస్‌ ఈవెంట్‌లో భారత అథ్లెట్ అవినాష్ సాబుల్ స్వర్ణం సాధించాడు. గత ఏడాది జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం గెలిచిన అవినాష్ సాబుల్, ఈసారి ఏకంగా పసిడి కైవసం చేసుకుని చరిత్ర క్రియేట్ చేశాడు.. 

 8:19.50 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్న అవినాష్, సరికొత్త గేమ్ రికార్డుతో స్వర్ణం సాధించాడు. జపాన్‌ అథ్లెట్లు అవోకి రోమా, సునడా సీనాలకు రజత, కాంస్య పతకాలు దక్కాయి. 10 వేల మీటర్ల పరుగు పందెంలో భారత అథ్లెట్లు కార్తీక్ కుమార్ రజతం సాధించగా, గుల్వీర్ సింగ్ కాంస్యం సాధించిన విషయం తెలిసిందే. 

3 వేల మీటర్ల స్టెప్లెచేస్‌ ఈవెంట్‌లో స్వర్ణం గెలిచిన మొట్టమొదటి భారత పురుష అథ్లెట్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు అవినాష్. ఇంతకుముందు 2010 ఏషియన్ గేమ్స్‌లో మహిళా అథ్లెట్ సుధా సింగ్ గోల్డ్ మెడల్ సాధించింది.  
  
ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ కాంస్య పతకం గెలిచింది. థాయిలాండ్‌కి చెందిన చుతమత్ రక్షత్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 2-3 తేడాతో పోరాడి ఓడింది నిఖత్ జరీన్. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం, వరల్డ్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన నిఖత్ జరీన్‌పై భారత్ పసిడి ఆశలు పెట్టుకుంది. అయితే నిఖత్ జరీన్, ఫైనల్‌కి అడుగు దూరంలో ఆగిపోయింది..

బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్ ఫైనల్‌లో చైనాతో తలబడుతున్న భారత్, రెండు రౌండ్లు ముగిసే సమయానికి 2-0 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది. లక్ష్య సేన్, చైనా ప్లేయర్ యుకీ షీతో మ్యాచ్‌లో 22-20, 14-21, 21-18 తేడాతో విజయాన్ని అందుకుని, టీమిండియాకి 1-0 ఆధిక్యం అందించాడు..

రెండో మ్యాచ్‌లో భారత స్టార్ డబుల్ జోడి సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి- చిరాగ్ శెట్టి, లియాంగ్ -వాంగ్‌తో మ్యాచ్‌ని 21-15, 21-18 వరుస సెట్లలో చేజిక్కించుకున్నారు. మిగిలిన మూడు మ్యాచుల్లో భారత్ ఒక్క మ్యాచ్ గెలిచి స్వర్ణం కైవసం చేసుకుంటుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios