కైనాన్ చెనయ్‌కి కాంస్య పతకం..7 స్వర్ణాలు, 9 రజతాలు, 6 కాంస్యాలతో మొత్తంగా 22 పతకాలు సాధించిన భారత షూటర్లు...

ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో భారత షూటర్లు గురి చేసి కొట్టారు. ఇప్పటిదాకా భారత్‌ 42 పతకాలు సాధిస్తే, అందులో 22 పతకాలు కేవలం షూటింగ్‌లోనే వచ్చాయి. పురుషుల ట్రాప్ వ్యక్తిగత విభాగంలో ఫైనల్ చేరిన కైనాన్ చెనయ్, కాంస్య పతకంతో భారత షూటర్ల ప్రస్తానం ఘనంగా ముగిసింది..

భారత షూటర్లు సాధించిన 22 పతకాల్లో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 6 కాంస్య పతకాలు ఉన్నాయి. ఇంతకుముందు 2018లో జాకార్తాలో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో 2 స్వర్ణాలు, 4 రజతాలు, 3 కాంస్యలతో 9 పతకాలు సాధించిన భారత షూటర్ల బృందం, ఇంచియాన్‌లో జరిగిన 2014 ఆసియా కప్‌లో ఓ స్వర్ణం, ఓ రజతం, 7 కాంస్య పతకాలతో 9 పతకాలు సాధించింది. 1954లో ఏషియన్ గేమ్స్‌లో మొదటిసారి షూటింగ్‌ని తీసుకువచ్చిన తర్వాత భారత్‌కి అత్యున్నత ప్రదర్శన.. 

Scroll to load tweet…

బ్యాడ్మింటన్ పురుషుల టీమ్ ఈవెంట్‌లో ఫైనల్ చేరిన భారత జట్టుకి బ్యాడ్‌న్యూస్ ఎదురైంది. సెమీ ఫైనల్‌లో ఆఖరి నిర్ణయాత్మక మ్యాచ్ గెలిచి, భారత్ ఫైనల్ చేరేందుకు కారణమైన హెచ్‌ఎస్ ప్రణయ్, గాయంతో ఫైనల్ నుంచి దూరమయ్యాడు. చైనాతో పోటీపడే ఫైనల్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ స్థానంలో మిథున్ మంజునాథ్ తలబడబోతున్నాడు.. 

ఇప్పటిదాకా 11 స్వర్ణాలు, 16 రజతాలు, 15 కాంస్య పతకాలతో 42 పతకాలు సాధించిన భారత్, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఐదో స్థానంలో ఉన్న ఉజకిస్థాన్ కూడా 11 స్వర్ణాలతో ఉండడంతో ఒక్క స్వర్ణం సాధిస్తే, టీమిండియా ఐదో స్థానానికి పడిపోవాల్సి ఉంటుంది.

చైనా 116 స్వర్ణాలు, 70 రజతాలు, 36 కాంస్య పతకాలతో 222 మెడల్స్‌తో టాప్‌లో ఉంటే సౌత్ కొరియా 118, జపాన్ 106 పతకాలతో టాప్ 3లో ఉన్నాయి.