బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ నాలుగు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. టీమిండియా నిర్దేశించిన 323 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు గాను బరిలోకి దిగిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.

అశ్విన్ బౌలింగ్‌లో ఓపెనర్ ఫించ్ అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఉస్మాన్ ఖవాజాతో కలిసి మరో ఓపెనర్ మార్కస్ హారీస్ స్కోరును పెంచేందేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో షమీ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి హారీస్ పెవిలియన్‌కు చేరాడు.

ఆ తర్వాత కొద్దిసేపటికే ఖవాజా కూడా వెనుదిరగడంతో ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది. షాన్ మార్ష్‌తో కలిసి హ్యాండ్స్‌కోంబ్ ఇన్నింగ్సును చక్కదిద్దే ప్రయత్నిం చేశాడు. వీరిద్దరు కుదురుకుంటున్న దశలో షమీ ఈ జంటను విడదీశాడు. 14 పరుగుల వద్ద పుజారాకు క్యాచ్ ఇచ్చి కోంబ్ ఔటయ్యాడు.

షాన్ మార్ష్, ట్రావిస్ హెడ్‌ల జోడి భారత బౌలర్లను ఎదుర్కొంటూ విజయం కోసం పోరాడుతోంది.  ప్రస్తుతం ఆసీస్ 49 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది...షాన్ మార్ష్ 31, ట్రేవిస్ హెడ్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఆస్ట్రేలియా విజయానికి 219 పరుగులు చేయాల్సి ఉండగా.. ఒక రోజు ఆటతో పాటు ఆరు వికెట్లు చేతిలో ఉన్నాయి. అంతకు ముందు ఓవర్ నైట్ స్కోరు 151/3తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ మరో 156 పరుగులు జోడించి 307 పరుగులకు అలైటైంది.