Asianet News TeluguAsianet News Telugu

మీ భాగ్య 'అదృష్ట' రేఖను మీరే రాసుకోండి

ఒకసారి ఒక వ్యక్తికి దారిలో యమధర్మరాజు కలిశారు. అయితే ఆ వ్యక్తికి  అతను యమధర్మరాజని తెలియదు. యమధర్మరాజు ఆ వ్యక్తిని తాగడానికి నీళ్ళు అడిగారు. ఒక క్షణం గడిచిందంటే ఆ నీళ్లు ఆ వ్యక్తి తాగేవాడే, కానీ దాహం అని అడిగినందుకు అతను యమధర్మరాజుకు నీళ్లు ఇచ్చి దాహం తీర్చాడు

Write your lucky 'lucky' line yourself
Author
hyderabad, First Published May 28, 2021, 10:13 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

ఈ లోకాన ఏది నీది కాదు. జీవాత్మ ఎక్కువ ఆలోచించకు ఆవేదన చెందకు. నీదన్నఈ దేహాన్ని ఏదో ఒకరోజు విడచి వెళ్తావు. నీదంటూ ఈ లోకంలో ఏముంది ఆలోచించు. కేవలం ఇవ్వన్నీ నీ జీవన ప్రయాణంలో పాత్రలు మాత్రమే. చేయాల్సింది విధాత నీ కిచ్చిన నీ పాత్రను ఈ లోకంలో అద్భుతంగా పోషించడమే. నీవే అశాశ్వతుడవని తెలిసాక.. నీ వెంట ఉన్నవారు నీతో శాశ్వతంగా ఉంటారని నీ వేలాభావిస్తావు...?

విధాత నీ తలరాతను మార్చడు, నీ ప్రయత్నంతో నీ తలరాతను నీవే మార్చుకోవాలి. కన్నీరు కార్చడానికి కాదు ఈ లోకానికి నీవు వచ్చింది. ఎంతో మంది అభాగ్యుల కన్నీరు తుడవడానికి వచ్చావు నీవే తెలుసుకో, అందుకే నీకు ఇన్ని బంధాలు ముడిపడి ఉన్నాయి. ఎప్పుడు రోదిస్తూ కూర్చుంటే బ్రతుకు భయపెడుతుంది, సవాలుగా స్వీకరించి ప్రయత్నిస్తే సమస్యలే నిన్ను చూసి భయపడుతాయి. నీవే అనంత శక్తి మంతుడవు భయాన్నే భయపెట్టేసత్తా నీలో ఉంది. సహనాన్ని వీడక ప్రయత్నిస్తూ సాగిపో... మనిషి తప్పకుండ నీవు ఈ లోకంలో అద్భుతాలు సృష్టించగలవు.

ఒకసారి ఒక వ్యక్తికి దారిలో యమధర్మరాజు కలిశారు. అయితే ఆ వ్యక్తికి  అతను యమధర్మరాజని తెలియదు. యమధర్మరాజు ఆ వ్యక్తిని తాగడానికి నీళ్ళు అడిగారు. ఒక క్షణం గడిచిందంటే ఆ నీళ్లు ఆ వ్యక్తి తాగేవాడే, కానీ దాహం అని అడిగినందుకు అతను యమధర్మరాజుకు నీళ్లు ఇచ్చి దాహం తీర్చాడు. నీళ్లు తాగిన తర్వాత యమధర్మరాజు ఆ వ్యక్తితో నేను నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన యమునిని... కానీ! నీవు తాగడానికి సిద్ధంగా ఉంచుకున్న నీళ్ళిచ్చి నా దప్పిక తీర్చావు. కావున నీ తలరాత మారడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను అని యమధర్మరాజు ఆ వ్యక్తికి  ఒక డైరీ ఇచ్చారు. 

నీకు ఒక ఐదు నిమిషాలు సమయం ఇస్తున్నాను ఇందులో నీకు ఏమి కావాలో రాసుకో అదే జరిగి తీరుతుంది కానీ గుర్తుంచుకో... నీకు సమయం కేవలం ఐదు నిమిషాలు మాత్రమే.. ఆ వ్యక్తి  ఆ డైరీ తీసుకుని ఓపెన్ చేసాడు. మొదటి పేజీలోనిది చదివాడు. అందులో తన పక్కింటాయనకు "లాటరీ రాబోతోంది అతడు కోటీశ్వరుడు కాబోతున్నాడు" అది చదివి ఆ వ్యక్తి అతనికి లాటరీ తగలకూడదు, వాడు గొప్పవాడు కాకూడదు, అని రాశాడు. 

తర్వాత పేజీ చదివాడు. "తన స్నేహితుడికి ఇంటర్వ్యూలో పాసైయ్యి మంచి ఉద్యోగం రాబోతోంది" అది చదివి అతడు ఫెయిల్ అయ్యిపోవాలి, అతనికి ఉద్యోగం రాకూడదు, అని రాశాడు. తర్వాత పేజీలో "తన స్నేహితురాలకి భర్తకి కోర్టులో నడుస్తున్న విడాకుల కేసు కోర్టు కొట్టివేసి ఇరువురికీ ఒకటి చేస్తుంది" అని చదివి వెంటనే అలా జరగకూడదు, వారు విడిపోవాలని రాసాడు, ఈ విధంగా ప్రతి పేజీనీ చదువుతూ.. ఏదో వొకటి రాస్తూ
 
చివరికి... ఖాళీగా ఉన్న తన పేజీలో తనకు కావలసింది రాయలని అనుకోగా ఈలోపే యమధర్మరాజు ఆ వ్యక్తి చేతినుండి డైరీని తీసుకుని, నీకు ఇచ్చిన ఐదు నిమిషాల సమయం పూర్తి అయ్యింది. ఇప్పుడు నీవు ఏమి రాయకూడదు. నీవు నీ పూర్తి సమయాన్ని ఇతరుల వ్యక్తిగత విషయాలలోనూ, ఇతరులను చింతన చేయడంలోనే నీ సమయం అంతా వృధా చేసుకున్నావు. 

నీ జీవితాన్ని నీకు నచ్చిన విధంగా మార్చుకునే అద్భుతమైన అవకాశం నీకిచ్చినా... స్వయంగా నువ్వే నీ జీవితాన్ని కష్టంలోకి నెట్టుకుని, చావుదాకా తెచ్చుకున్నావు నీ యొక్క మృత్యువు  నిశ్చితం అయింది అని డైరీ తీసుకున్నాడు యముడు. ఆ వ్యక్తి  చాలా పశ్చాతాప పడ్డాడు. వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకున్నానని కుమిలి కుమిలి ఏడుస్తూ తనువును చాలించాడు.

ఈ కథ యొక్క అర్థం ఏమిటంటే భగవంతుడు మనందరినీ సంతోషంగా ఉంచేందుకు ఎన్నో అద్భుతమైన అవకాశాలను తానే స్వయంగా గానీ
బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, ఇరుగుపొరుగువారు, బాటసారుల రూపంలో గాని మనకు పంపిస్తాడు. కానీ మనము వ్యర్థము ఆలోచిస్తూ ఇతరులకు చెడు చేస్తూ మన సమయాన్నంతా వ్యర్థం చేసుకుంటున్నాము. ఎవరైతే ఇతరులకు సదా సుఖాన్ని ఇస్తూ ఉంటారో వారి పైన సదా భగవంతుని కృప నిండి ఉంటుంది. 

ఈ సంగమయుగంలో భగవంతుడు కలం మనచేతికి ఇచ్చి "మీ భాగ్యరేఖను మీరే రాసుకోండి" అని ఎన్నో అద్భుతమైన అవకాశాలను ఇస్తున్నారు. 
కానీ మనము పర చింతన చేస్తూ సమయము వృధా చేసుకుంటున్నాము. మన అదృష్టాన్ని మనమే వంచన చేసుకుంటున్నాం... కర్మ సిద్ధంతాన్ని మరచిపోతున్నాం మనం ఏది చేస్తామో దానికి ఫలితం కూడా అలానే అనుభవించాల్సి ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.. సమస్త లోకా సుఖినోభవంతు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios