అడవిలో మొలిచే మొక్కలకు నీళ్లు పోసేవారెవరూ ఉండరు. అలాగని అవి నిరాశకు లోనుకావు. వర్షాల ఆగమనానికై ఆశగా ఎదురుచూస్తాయి.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
పుట్టిన ప్రతి ప్రాణికీ పూర్తికాలం జీవించాలన్న కోరిక ఉంటుంది. చరాచరాలకూ అలాగే ఉంటుంది.
చెట్టును కాండం మొదలు వరకు నరికినా అది మళ్ళీ చిగురించాలన్న కాంక్షతో ఉంటుంది.
నిత్యం పారే నదికి ఓ కొండ అడ్డుపడ్డప్పుడు అది కొద్దిసేపు ఆగి సేదదీరుతుంది. పల్లం ఎటువైపుందో తెలిసేదాకా నిరీక్షిస్తుంది. ఆ తరవాత దారి చూసుకొని ముందుకు ప్రవహిస్తుంది.
అడవిలో మొలిచే మొక్కలకు నీళ్లు పోసేవారెవరూ ఉండరు. అలాగని అవి నిరాశకు లోనుకావు. వర్షాల ఆగమనానికై ఆశగా ఎదురుచూస్తాయి.
వీలుకానప్పుడు పులి కూడా రెండు అడుగులు వెనక్కి వేస్తుంది. దానికీ మరణభయం ఉంటుంది. ఆయుష్షు తీరేదాకా బతకాలన్న బలమైన వాంఛా ఉంటుంది.
ఒక్కోసారి వెనక్కి రావడమూ ముందుకు పోవడంలో భాగం అవుతుంది.
వాస్తవానికి అది సార్వజనీనం! జీవన పయనం ఏ దిశలో సాగుతోంది అన్నది ముఖ్యం కాదు. అది ఆరోహణా భావనతో ఉందా లేదా అన్నదే ప్రధానం.
జీవచైతన్యానికి నిర్విరామంగా విస్తృతం కావడమే తెలుసు. ఆ సహజాతి సహజ గమనం పటాటోప ప్రదర్శన కాదు. ఎవరి మెచ్చుకోలు కోసమో చేసే పని అంతకన్నా కాదు.
పశు పక్ష్యాదులు, ఎడారుల్లో సంచరించే జీవులు, ఉభయచరాలు ఎంతో ఓర్పు, సహనంతో కాలం వెళ్ళ బుచ్చుతాయి. మున్ముందు కాలం అనుకూలంగా ఉంటుందన్న ఆశతో ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకొని జీవిస్తాయి.
జీవకోటిలో తెలివితేటలున్న మనిషి మాత్రం అనుకున్నదే తడవుగా ఫలితం వెంటనే కనబడాలని చూస్తాడు.
ఒక పేదవాడు తన ఇంటిముందు ఓ మొక్క నాటాడు. కొన్ని రోజులకు అది పెరిగి పెద్దదయింది. అది పండ్లు ఇచ్చి ఆకలి తీర్చుతుందని ఆశపడ్డాడు. చాలా రోజులు ఎదురు చూశాడు. కాని, అలా జరగలేదు. తగినంత ఆహారం అందక శరీరంతోపాటు మనసు బలహీనపడింది.
ఫలితంగా అతడి నిరీక్షణ.. కాలాన్ని మరింత పొడిగించిన భావన కలగజేసింది. విసుగు తెప్పించింది. కోరిక నెరవేరలేదని అతడిలో కోపాగ్ని రగిలింది. విచక్షణా జ్ఞానం కోల్పోయాడు. పూత, కాయ రెండూ లేని చెట్టు ఎందుకని దాన్ని నరికివేశాడు.
మరుసటి రోజు తెల్లవారి లేచి చూస్తే పడిపోయిన చెట్టుకు ఒక పువ్వు పూసి ఉంది. ఆ సన్నివేశం చూశాక అతడిలో దుఃఖం పొంగుకొచ్చింది. ఆ చెట్టును పట్టుకుని విలపించాడు. తొందరపడ్డానని బాధపడ్డాడు.
జీవితం ఇలాగే అనూహ్య తీర్పునిస్తుంది. కారణం, అది నిత్యనూతనం. అందువల్లే ‘ఫలితం పని చేసేవాడి చేతిలో లేదు. అది కాలపురుషుడి నిర్ణయం’ అని గీత చెబుతుంది.
అనుకూలించని పరిస్థితుల్లో ఆకలిగొన్న జంతువు ఒకటి ఎత్తున ఉన్న కొమ్మ ఆకులు తిందామనుకుంది. అందుకోసం దాని పొట్టి మెడ సాచడం మొదలు పెట్టింది. కాళ్లూ పొడుగుంటే బాగుండేదని భావించింది. రోజూ దాని ప్రయత్నాలు సానుకూల వైఖరితో సాగేవి. కొంత కాలానికి దాని మెడ పొడుగ్గా సాగింది. కాళ్లూ పెద్దగా అయ్యాయి. అదే జిరాఫీగా రూపాంతరం చెందింది.
మానసిక భావాలకు అనుగుణంగా శరీరం స్పందిస్తుంది. అది ప్రాకృతిక నియమం. అమీబా నుంచి చింపాంజీ దాకా జరిగిన జీవ పరిణామ క్రమంలో ‘ఆశావహ దృక్పథం’ కీలకం.
అందువల్లే, ‘యద్భావం తద్భవతి’ అన్నారు వేదాంతులు. ‘నీ ఆలోచనే ( సంకల్పం ) నువ్వు’ అని బుద్ధుడు ప్రబోధించాడు. దుందుడుకు వైఖరితో ఏ ప్రయోజనాలూ సిద్ధించవు. సానుకూల ధోరణితోనే మానవుడు ముందుకు వెళ్ళగలడు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Feb 23, 2021, 1:56 PM IST