శ్రావణమాసం.. ఏ వారం ఏం దానం ఇస్తే మంచిది..?
ఈ మాసంలో ప్రతి వారం ఏదో ఒక విశిష్టతను కూడుకుని ఉంటుంది. సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారం, పౌర్ణమి, నాగుల చవితి చాలా విశిష్టతను కలిగినవి.
శ్రావణ మాసం శుభాలకు నిలయం. ఈ మాసంలో శుభాకార్యలు ఎక్కువగా జరుగుతాయి. పెళ్లైన మహిళలు కూడా, తమ భర్త శ్రేయస్సు కోరి పూజలు చేస్తూ ఉంటారు.
పూర్ణిమనాడు శ్రవణా నక్షత్రం ఉన్న మాసాన్ని శ్రావణమాసం అంటారు. శ్రావణమాసం అంటేనే స్త్రీలకు ఇంటిల్లిపాది పండుగులతో కూడుకుని ఉంటుంది. దాదాపుగా ఎక్కువ పండుగలు, నోములు వ్రతాలు ఈ మాసంలోనే వస్తాయి. ఈ మాసంలో ప్రతి వారం ఏదో ఒక విశిష్టతను కూడుకుని ఉంటుంది. సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారం, పౌర్ణమి, నాగుల చవితి చాలా విశిష్టతను కలిగినవి.
సోమవారం శివుడి పూజకు, మంగళవారం వివాహమైన వనిత నోచుకునే మంగళవారం నోములు, శుక్రవారం ఏదో ఒక పూజ చేస్తూ ఉంటారు. శనివారం వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు. పౌర్ణమి రాఖీ పూర్ణిమ, హయగ్రీవ జయంతి, కృష్టాష్టమి, పోలాల అమావాస్య. ప్రతిరోజూ ఇంట్లో అంతా పండుగ వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు నూతన వస్త్రాలు కాని, పట్టు వస్త్రాలు కాని ధరించి పూజలు చేసుకుంటారు. నియమ నిష్ఠలతో ఉంటారు.
ఈ శ్రావణ మాసంలో ఏ వారం ఏం దానం చేస్తే మంచిదో చూద్దాం..
సోమవారాలు శివునికి ప్రాధాన్యం ఇస్తూ, బ్రాహ్మణులను శివునిగా భావించి దానం ఇవ్వడం, మంగళ శుక్రవారాలు స్త్రీలను శక్తి స్వరూపంగా భావించి దానం ఇవ్వడం ఆచారం. తమకు ఏది కావాలో ఆ వస్తువులను దానం ఇవ్వాలనేది శాస్త్ర వచనం. స్త్రీలకు ఐదవతనం అవసరం కాబట్టి ఆ వస్తువులను మంగళ శుక్రవారాల్లో దానాలు ఇస్తారు.
చంద్రమా మనసో జాతః అంటే చంద్రుడు మనస్సుకు కారకుడు. శివుడి తలపైన నెలవంక ఉంటుంది. సోమవారాలు చంద్రునికి సంబంధించిన పాలు, బియ్యం, తెల్లని వస్త్రాలు దానం చేయడం వల్ల చిత్త చాంచల్యం నుంచి బయటపడగలుగుతారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. బుద్ధిలో విశ్లేణశక్తి పెరుగుతుంది.
మంగళవార వ్రతాలు చేసుకునేవారు గురునికి సంబంధించిన వస్తువులు, శనగలు, పసుపురంగు వస్త్రాలు, పళ్ళు, స్వీట్స్ దానం చేయడం వల్ల సంతాన లోపాలు నివారించబడతాయి. గురుడు సంతానానికి కారకుడు కావున వివాహమైన స్త్రీలు మొదటి 5 సంవత్సరాలు మంగళగౌరి వ్రతాలు ఆచరిస్తారు. ఆరోజు శనగలు, పళ్ళు దానం చేయడం వల్ల సంతానసంబంధ దోషాలు నివారించి సకాలంలో సంతానం లుగుతుంది.
శుక్రవార వ్రతాలలో దానాలు శుక్రుని లోపాల నివారణకు కారణం అవుతాయి. శుక్రుడు అన్ని రకాల సంపదలు, ఆనందానికి కారకుడు. సంపద అనేది కేవలం ధనరూపం ఒకటి మాత్రమే కాదు. ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్ని రకాల సంపదలు సంపదలే. ఈ దానాలు అన్ని రాసుల వారు చేసుకోవచ్చు. ఆ గ్రహ లోపాలు ఉన్నవారు, సంతాన సమస్యలు ఉన్నవారు మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలి.