Asianet News TeluguAsianet News Telugu

భీష్మ పంచకం

తనను చూసేందుకు అంపశయ్య వద్దకు వచ్చిన ధర్మరాజుకు, రాజనీతిలోని సారాంశమంతా బోధించారు. పాండవులతో పాటుగా ఉన్న కృష్ణుని వేనోళ్ల స్తుతిస్తూ విష్ణు సహస్ర నామాన్ని పలికారు. అలాంటి భీష్ముని కొలుచుకునేందుకు ఆయన నిర్యాణం చెందిన తరువాత వచ్చే ఏకాదశి భీష్మ ఏకాదశిగా జరుపుకొంటున్నాము.

What is  the Bheeshma panchakam
Author
Hyderabad, First Published Feb 7, 2020, 1:59 PM IST

వ్యాసుడు భారతాన్ని ప్రజలకు అందించి ఉండవచ్చు. కానీ భీష్ముడే కనుక లేకపోతే భారతమే లేదు! తండ్రి  సౌఖ్యం కోసం తన సింహాసనాన్నే త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు. తన ద్వారా కలిగే సంతానం వల్ల ఆ త్యాగం ఎక్కడ పొల్లు పోతుందో అన్న సంశయంతో.... ఆజన్మాంతం పెళ్లి చేసుకోనంటూ ‘భీషణ’ ప్రతిజ్ఞ చేసిన ధీరుడు.

భీష్మునికి తను కోరుకున్న సమయంలో తనువు చాలించగలిగే వరం ఉంది. అందుకే ఆయన మార్గశిర మాసంలో అంపశయ్య మీదకి చేరుకున్నా... ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకూ వేచి ఉన్నాడు. ఉత్తరాయణం ప్రవేశించిన తరువాత అష్టమి రోజున, తనని ఐక్యం చేసుకోమని ఆ కృష్ణ పరమాత్ముని వేడుకున్నాడు. భీష్ముడు జీవితం యావత్తూ పరిపక్వంగానే గడిచింది. ఇక తన మరణ సమయంలోనూ తన విశిష్టతను చాటుకున్నాడు ఈ కురువృద్ధుడు. 

తనను చూసేందుకు అంపశయ్య వద్దకు వచ్చిన ధర్మరాజుకు, రాజనీతిలోని సారాంశమంతా బోధించారు. పాండవులతో పాటుగా ఉన్న కృష్ణుని వేనోళ్ల స్తుతిస్తూ విష్ణు సహస్ర నామాన్ని పలికారు. అలాంటి భీష్ముని కొలుచుకునేందుకు ఆయన నిర్యాణం చెందిన తరువాత వచ్చే ఏకాదశి భీష్మ ఏకాదశిగా జరుపుకొంటున్నాము.

ప్రతి ఏకాదశికి ఉండే నియమాలే భీష్మ ఏకాదశికీ వర్తిస్తాయి. దశమినాటి రాత్రి నుంచి ద్వాదశి ఉదయం వరకూ ఉపవాసం ఉండమనీ, ఏకాదశి రాత్రివేళ జాగరణ చేయమనీ పెద్దలు సూచిస్తారు. దీంతో పాటుగా విష్ణు పూజకు ఈ వేళ విశేష ప్రాధాన్యం ఉంటుంది. భీష్ముడు అందించిన విష్ణుసహస్రనామాలను ఈనాడు జపిస్తే, విశేష ఫలితం దక్కుతుంది. అందుకనే ఈ రోజుని శ్రీ విష్ణు సహస్ర నామ జయంతి అని కూడా పిలుచుకోవడం జరిగినది . భగవద్గీతను పఠించేందుకు కూడా ఇది అనువైన రోజని అంటారు.

భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు మొదలుపెట్టిన ఏ కార్యమైనా విజయవంతం అవుతుందని ఓ నమ్మకం. అందుకనే ఆ పేరు. ఇక భీష్ముడు భారతీయులందరికీ పూర్వీకుడే! ఆచార్యునిగా, భరతవంశంలోని ఆది పురుషునిగా ఆయన మనకు స్మరణీయుడు. అందుకే ఈ రోజున ఆయనకు తర్పణాలను విడవాలని సూచిస్తారు. భీష్ముని తమ పూర్వజునిగా భావిస్తూ ఎవరైతే ఆయనకు తర్పణం విడుస్తారో వారి పాపాలన్నీ దహించుకుపోతాయని పెద్దలు చెబుతారు. 

రథసప్తమి నుంచి సూర్యుని తీక్షణత పెరుగుతూ వస్తుంది కాబట్టి, బహుశా ఈ సూచని చేసి ఉంటారు. భీష్మాష్టమి మొదలుకొని భీష్మద్వాదశి వరకూ ఉన్న ఐదు రోజులనూ భీష్మ పంచకం అని పిలుస్తారు. ఈ అయిదు రోజులూ భీష్ముని వ్యక్తిత్వాన్ని తలచుకుంటారు. భీష్ముని జీవితం నుంచి ప్రేరణ పొందేందుకు ఈ అయిదు రోజులనూ కేటాయిస్తారు. మనం తరచూ వినే వ్యక్తిత్వ వికాస తరగతులకు ఏమాత్రం తీసిపోని ఆచారం ఇది. పైగా భీష్మ ఏకాదశినాడు ఉపవాసం ఉంటూ, విష్ణుసహస్రనామాలను జపిస్తూ, 
భగవద్గీతను పఠిస్తూ, భీష్ముని తల్చుకుంటే సాగే క్రతువుతో మనిషి వ్యక్తిత్వమే సాత్వికంగా మారిపోతుంది.ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

What is  the Bheeshma panchakam

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Follow Us:
Download App:
  • android
  • ios