Asianet News TeluguAsianet News Telugu

పితృ పక్షం అంటే ఏమిటి

మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి:- సాధారణంగా తండ్రి చనిపోయిన తిథినాడు మహాలయం పెట్టడం ఉత్తమమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థితిలో మహాలయ అమావాస్యనాడు పెట్టడం ప్రశస్తం. 

What is Significance of Pitru paksham
Author
Hyderabad, First Published Sep 21, 2021, 10:43 AM IST

 

మహాలయ పక్షం 21 సెప్టెంబర్ నుండి ప్రారంభమై అక్టోబర్ 6  మహాలయ అమావాస్యతో పూర్తవుతుంది. ఈ మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి, మీ పితృదేవతలను స్మరించి వారికి నమస్కారము చేస్తూ నేను పితృ పక్షము పాటించుటకు అశక్తుడను. కావున నన్ను మన్నించి మీ దీవెనలు అందచేయండి అని మనస్సులో ప్రార్ధన చేయడం ద్వారా శుభఫలితాలు ఉంటాయి. ఇంకా మహాలయా పక్షమున పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించవచ్చు. 

భాద్రపదమాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఎంత విశిష్టమైనదో బహుళ పక్షం పితృదేవతాపూజలకు అంత శ్రేష్ఠమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని మహాలయ పక్షమనిపేరు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతిచెందారో ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి.

మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి:- సాధారణంగా తండ్రి చనిపోయిన తిథినాడు మహాలయం పెట్టడం ఉత్తమమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థితిలో మహాలయ అమావాస్యనాడు పెట్టడం ప్రశస్తం. దీనినే సర్వ పితృ అమావాస్య అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ... వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి.

క్రింది సంవత్సరం చనిపోయిన వారికి భరణి లేక భరణి పంచమి తిథులలో అనగా మహాలయ పక్షాలు మొదలైన 4 లేక 5 రోజున మహాలయం పెట్టాలి.

భార్య మరణించిన వాడు నవమినాడు అనగా తొమ్మిదవ రోజున మహాలయం పెట్టాలి. ఆ రోజున సుమంగళిగా మరణించిన తన భార్యను తలచుకుని ఒక సుమంగళికి భోజనం పెట్టి , పసుపు , కుంకుమ , గాజులు , పూవులు , చీర , పెట్టి  సత్కరించి పంపాలి.

చిన్న పిల్లలు చనిపోతే... వారికి పన్నెండవ రోజున మహాలయం పెట్టాలి. చిన్న పిల్లలు అంటే ఉపనయన వయస్సు (పది సంవత్సరములు) దాటనివారు. ఒకవేళ పది సంవత్సరముల వయస్సు లోపే ఉపనయనము జరిగి ఉంటే... ఆ పిల్లవాడు మరణించిన తిథినాడే మహాలయం పెట్టాలి.

ఇక ప్రమాదాలలో కానీ , ఉరిశిక్ష వల్ల కానీ , ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి ఘట చతుర్థినాడు అనగా అమావాస్య ముందురోజున పెట్టాలి.
 
పితృ దోషం అంటే ఒక శాపం. గత జన్మ లో ఎవరైనా వృద్దులకు కాని తల్లితండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటే లేదా వ్యక్తి కి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. జాతక చక్రం లో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి. 

భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు మహాలయ పక్షం పితృ ఋణం నుండి ముక్తి పొందటం చాలా కష్టం. తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తపిస్తారో వెల కట్టడం సాధ్యం కాదు. పితృ గణాల శ్రాద్ధ కర్మ గౌరవప్రదంగా చేయటం సంతానం తప్పని సరి విధి. శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు వాయురూపం లో భోజనం స్వీకరిస్తారు. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర, పౌత్రుల దగ్గరకు వస్తారు.  

ప్రతి మాసంలోను అమావాస్య పితరుల పుణ్య తిథి గా భావించబడినా మహాలయ అమావాస్య కు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఆదర పూర్వకం గా శ్రాద్ధ కర్మతో సంతోషపెడితే వారు తమ సంతత వారి ఆయువు, విద్య, ధనం, సంతానం, సమస్తం కలిగి ఉండేట్టు ఆశీర్వదిస్తారు. అన్నదానం ఎప్పుడు చేసిన మంచి ఫలితాన్నే ఇస్తుంది, కాని ఈ మహాలయపక్షంలో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది. అలాగే మఖ నక్షత్రం పితరులకు సంబందించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధ కర్మ అక్షయఫలన్నిస్తుంది. 

మహాలయ పక్షంలో ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందని వివిధ పురాణాల ఆధారంగా, గురువుల ద్వారా తెలుసుకోన్నది.

1. పాడ్యమి తిధి రోజు శ్రార్ధము పెడితే లక్ష్మి కటాక్షం కలుగుతుంది.

2. విదియలో శ్రార్ధము పెడితే సంతాన ప్రాప్తి.

3. తదియలో శ్రార్థం పెడితే మంచి సంబంధం కుదురుతుంది లేదా మంచి కోడలు వస్తుంది.

4. చవితి రోజు శ్రార్ధము పెడితే పగవారు (శత్రువులు )లేకుండా చేయును.

5. పంచమి రోజు శ్రార్ధము పెడితే సకల సౌభాగ్యాలు కలుగచేయును.

6. షష్టి రోజు ఇతరులకు పూజ్యనియులుగా చేయును.

7. సప్తమి రోజు పరలోకంలో ఓక దేవగోష్టికి నాయకునిగా చేయును.

8. అష్టమి రోజు మంచి మేధస్సును చేకూర్చును.

9. నవమి మంచి భార్యను సమకూర్చిను. భార్య బుధ్దిమంతు రాలిని చేయును. మరో జన్మలో కూడా మంచి భార్యను సమకూర్చును.

10. దశమి తిధి రోజు కోరికలను నేరవేర్చును.

11. ఏకాదశి రోజున సకల వేద విద్యా పారంగతులను చేయును.

12. ద్వాదశి రోజున స్వర్ణములను స్వర్ణ ఆభరణములను సమ కూర్చును.

13. త్రయోదశి రోజున సత్సంతానాన్ని మేధస్సును, పశు, పుష్టి, సమృద్ధి, దీర్ఘాయుష్షు మొదలగు సకల సౌభాగ్యములను సమకూర్చును.

14. చతుర్దశి తిది రోజున వస్త్రం లేక అగ్ని ( ప్రస్తుత కాలంలో రైలు, మోటారు వాహనములు వల్ల విపత్తు ) వీని మూలంగా మరణం సంభవించిన వార్లకు మహలయ శ్రార్ధము చేయవలయును. అప్పుడే వారికి సంతృప్తి కలుగుతుంది.

15. అమావాస్య రోజున సకలాభిష్టములు సిద్దించును. 

16. పాడ్యమి తర్పణం ముందుగా నిర్వర్తించి వానిలోగల లోపములను నివృత్తిచేసీ పరి పూర్ణతను చేకూర్చును.

ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్దాలు ఈ మహాలయపక్షం పదిహేను రోజులు చేయలేనివారు ఒక్క మహాలయమైన చేసి తీరాలి. ఆర్దిక భావం వలన విద్యుక్తంగా శ్రాద్ధ కర్మలు చేయలేక పొతే , పితృ పక్షం లో కేవలం శాకంతో శ్రాద్ధం చేయవచ్చు. అది కూడా వీలు కాక పొతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు అదీ చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశంలో నిల్చొని అపరాన్న సమయంలో రెండు చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి పితృ దేవతలకు నమస్కరించవచ్చు. శ్రాద్ధ కర్మ చేత పితృ దేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది.

బృహద్ధర్మ పురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్తుతి. ఈ స్తోత్రాన్ని శ్రాద్ధ దినములందే కాక ప్రతిరోజూ ఎవరు చదువుతారో వారికి ఈతి బాధలు ఉండవు. ఎవరైనా వారి పితరుల విషయంలో తప్పు చేసి ఉంటే పశ్చాత్తాపంతో ఈ స్తోత్రం చదివితే ప్రాయశ్చిత్తం కలుగుతుంది. వారిని అనుగ్రహిస్తారు. ఈ స్తోత్రాన్ని ప్రయత్నపూర్వకంగా ఎవరైతే పితృశ్రాద్ధం నాడు లేదా ప్రతి రోజు ఉదయం, పుట్టినరోజు నాడు తమ తల్లి దండ్రులకు నమస్కరించి పఠిస్తారో వారికి దుర్లభమైనది అంటూ ఉండదు. పాపకర్మలు నశించిపోతాయి.

బ్రహ్మ ఉవాచ:-

1 . నమో పిత్రే జన్మదాత్రే సర్వ దేవమయాయ చ!
సుఖదాయ ప్రసంనాయ సుప్రీతాయ మహాత్మనే!!

ఎవరివలన ఈ జన్మ వచ్చినదో, ఎవరు సకల దేవతా స్వరూపులో ఎవరి ఆశీస్సుల వల్ల సుఖములు కలుగునో అట్టి మహాత్ములైన పితరులకు నమస్కారములు.

2 . సర్వ యజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే!
సర్వతీర్థావలోకాయ కరుణాసాగారాయ చ!!

సకల యజ్ఞస్వరూపులై స్వర్గంలో ఉండే దేవతలతో సమానమైన వారు సకల పుణ్యతీర్థములకు ఆలవాలమైన కరుణాసముద్రులైన పితరులకు నమస్కారములు. 

3 . నమో సదా ఆశుతోషాయ శివరూపాయ తే నమః!
సదాపరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ!!

సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించే వారైన శివరూపులకు నమస్కారము. ఆచరించే తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ సంతోషమూర్తులై సుఖములను కలుగజేసే పితరులకు నమస్కారములు.

4 . దుర్లభం మానుషమిదం యేనలబ్ధం మాయా వపుః!
సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమోనమః!!

ధర్మాలు ఆచరించడానికి అవకాశమున్న దుర్లభమైన ఈ మానవ శరీరం ఎవరివలన లభించిందో ఆ పితృ దేవతలకు నమస్కారములు.

5 . తీర్థ స్నాన తపో హోమ జపాదీన్ యస్య దర్శనం!
మహా గురోశ్చ గురవే తస్మై పిత్రే నమోనమః!!

ఎవరిని చూసినంతనే అనేక తీర్థ స్నానములు, తపస్సులు, హోమాలు, జపములు చేసిన ఫలితం కలుగునో మహాగురువులకు కూడా గురువులైన పితృదేవతలకు నమస్కారములు. 

6 . యస్య ప్రణామస్తవనాత్ కోటిశః పితృతర్పణం!
అశ్వమేధ శతైః తుల్యం తస్మై పిత్రే నమోనమః!!

ఎవరిని నమస్కరించినా, తర్పణాదులు చేసినా అవి వందలకొలది అశ్వమేధ యాగములతో సమానమో అటువంటి పితరులకు నమస్కారము

ఫలశ్రుతి:-

ఇదం స్తోత్రం పిత్రుః పుణ్యం యః పఠేత్ ప్రయతో నరః!
ప్రత్యహం ప్రాతరుత్థాయ పితృశ్రాద్ధదినోపి చ 
స్వజన్మదివసే సాక్షాత్ పితురగ్రే స్థితోపివా 
న తస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞత్వాది వాంఛితమ్ 
నానాపకర్మకృత్వాపి యఃస్తౌతి పితరం సుతః 
సధృవం ప్రవిధాయైవ ప్రాయశ్చిత్తం సుఖీ భవేత్ 
పితృప్రీతికరైర్నిత్యం సర్వ కర్మాణ్యధార్హతి!!

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Follow Us:
Download App:
  • android
  • ios