అష్టాదశ పురాణాలు అంటే ఏంటి..?

ఆ తరువాత బ్రహ్మదేవుడు చతుర్వేదాలను వెలువరించి తనకుమారులైన మరీచి తదితరులకిచ్చాడు. వారు తమ కుమారులైన కశ్యపుడు తదితరులకు ఇచ్చారు. అలా వేదాలు పరంపరాగతంగా సాగిపోతూ ఉన్నాయి.

What is Ahstadasha Puranalu

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

పురాణాలు ప్రణవం నుండి పుట్టాయని సంస్కృత భాగవతంలోని పన్నెండవ స్కందం చెప్తుంది. బ్రహ్మదేవుడు ధ్యానమగ్నుడై ఉన్న సమయంలో ఆయన హృదయగృహ నుండి ఒక అనాహత శబ్దం వెలువడింది. ఆ శబ్దంలో నుండి అ కార ఉకార మకార శబ్ధాలు కూడిన ఓంకారశబ్దం ఆవిర్భవించింది. "అ" నుండి "హ" వరకు గల అక్షరాలు ఆశబ్దంనుండి ఉద్భవించాయి. ఓంకారం సకల మంత్రాలకు బీజాక్షరం అయింది. ఓంకారం నుండి నాలుగు వేదాలను ఉద్భవించాయి. 

ఆ 'అ'కార, 'ఉ'కార 'మ'కారములనుండి సత్వ,రజో,తమో అనే త్రిగుణాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అనే చతుర్వేదాలు, భూ॰భువ॰సువ॰ అనే త్రిలోకాలు, జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలు జనించాయి. ఆ తరువాత బ్రహ్మదేవుడు చతుర్వేదాలను వెలువరించి తనకుమారులైన మరీచి తదితరులకిచ్చాడు. వారు తమ కుమారులైన కశ్యపుడు తదితరులకు ఇచ్చారు. అలా వేదాలు పరంపరాగతంగా సాగిపోతూ ఉన్నాయి.

వేదాలు ప్రజలకు క్లిష్టమైనవి కనుక అందుబాటులో లేనివి కనుక వేదవ్యాసుడు వేద ఉపనిషత్తు సారంతో కూడిన అష్టాదశ పురాణాలను రచించాడు. పురాణాలను వ్యాసుడు తన శిష్యుడైన రోమహర్షణుకి చెప్పాడు. రోమహర్షుడు తిరిగి వాటిని తన శిష్యులైన త్రైయారుణి, కశ్యపుడు, సావర్ణి లాంటి శిష్యులకు అందించాడు. ఆ తర్వాత అలా ఒకరి నుండి ఒకరికి సంక్రమించాయి. అష్టాదశ పురాణాలు వాటి పేర్లు, ఏ పురాణాలలో ఏముందో తెలుసుకుందాము. ఈ పురాణాలు అన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది కాగా పద్మపురాణం పెద్దది. 

 1. మత్స్యపురాణం 
 2. కూర్మపురాణం 
 3. వామన పురాణం 
 4. వరాహ పురాణం 
 5. గరుడ పురాణం 
 6. వాయు పురాణం 
 7. నారద పురాణం 
 8. స్కాంద పురాణం 
 9. విష్ణుపురాణం 
 10. భాగవత పురాణం 
 11. అగ్నిపురాణం 
 12. బ్రహ్మపురాణం 
 13. పద్మపురాణం 
 14. మార్కండేయ పురాణం 
 15. బ్రహ్మవైవర్త పురాణం 
 16. లింగపురాణం 
 17. బ్రహ్మాండ పురాణం 
 18. భవిష్యపురాణం 

మత్స్యపురాణం:-  మత్స్య రూపంలో ఉన్న మహా విష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు. 

కూర్మపురాణం:- కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది. 

వామన పురాణం:- పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కళ్యాణం, గణేశ, కార్తికేయుల జన్మవృత్తాంతాలు, రుతువుల గురించిన వర్ణనలు కనిపిస్తాయి. 

వరాహపురాణం:- వరాహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మవృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి. 

గరుడ పురాణం:- గరుడుని వివిధ సందేహాలపై విష్ణువు చెప్పిన వివరణ ఇది. ఇందులో గరుడుని జన్మవృత్తాంతంతోబాటు జనన మరణాలంటే ఏమిటీ, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు; ఏ పాపానికి ఏ శిక్షపడుతుంది... వంటి విషయాలు తెలుపడం జరిగింది. 

వాయుపురాణం:- వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుని మాహాత్మ్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు కన్పిస్తాయి. 

అగ్నిపురాణం:- అగ్నిదేవుడు వశిష్టునికి చెప్పిన ఈ పురాణంలో వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిశ్శాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలను ఈ పురాణంలో తెలుసుకోవచ్చు. 

స్కందపురాణం:- కాశీఖండం, కేదారఖండం, కుమారిల ఖండం, రేవాఖండం... తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడట. ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. ఇంకా కుమారస్వామి జననం, మహిమలు, శివలీలల ఉంటాయి. 

లింగపురాణం:- లింగరూప శివ మహిమలతోబాటు, వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష, భూగోళాల గురించిన సమాచారం ఉంటుంది. 

నారద పురాణం:- బహ్మమానసపుత్రులైన సనక సనంద సనాతన సంపత్కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాంగాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. 

పద్మపురాణం:- ఈ పురాణంలో మధుకైటభులనే రాక్షస వధ, రావిచెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహాత్మ్యం, గీతాసారం, నిత్యపూజావిధానాల గురించి ఉంటుంది. 

విష్ణుపురాణం:- పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతం ఉంటుంది. 

మార్కండేయ పురాణం:- శివకేశవుల మాహాత్మ్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యం, దేవీ మాహాత్మ్యం ఉంటాయి. 

బ్రహ్మపురాణం:- బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణంలో వర్ణధర్మాలు, స్వర్గనరకాల గురించి తెలుసుకోవచ్చు. 

భాగవత పురాణం:- విష్ణువు అవతారాలు, శ్రీ కృష్ణ జననం, లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిన్మహారాజుకు శుకమహర్షి చెప్పిన పురాణమిది. దీనిని తొలుత వేదవ్యాసుడు శుకునికి బోధించాడు. 

బ్రహ్మాండ పురాణం:- బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితా మహిమ్నా స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించిన వివరణ ఉంటుంది. 

భవిష్యపురాణం:- సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతోబాటు, భవిష్యత్తులో జరుగబోయే వివిధ విషయాల గురించిన వివరణ ఉంటుంది. 

బ్రహ్మాపవైపర్తపురాణము :- ఇందులో గోలోక ప్రశంస, భోజన నియమాలు, రోగనివృత్తిసాధనాలు, తులసీ, సాలగ్రామ మహత్మ్యం ఉంటాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios