Asianet News Telugu

భగవత్సాక్షాత్కారము

ఇందులో భగవంతుడు ఎవరు? అయన లక్షణాలు ఏంటి అన్నవి ఈ పద్యంలో చక్కగా వివరించారు పోతన గారు.

the story of the God
Author
Hyderabad, First Published Jun 28, 2021, 3:20 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

భగవంతుడు అనగా మానవ మేధస్సుకు అందని ఒక అద్భుత శక్తి. అది సృష్టికి మూలమైన ఒక శక్తి. దానిని ఆస్తికులు భగవంతుడు అంటారు నాస్తికులు ప్రకృతి శక్తి అంటారు. ధర్మశాస్త్రాలను అనుసరించి భగవంతుడు అంటే ఆరు లక్షణాలు ఉన్నవాడు.

"ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందు; పరమేశ్వరు డెవ్వడు; మూల కారణం
బెవ్వ; డనాది మధ్యలయుడెవ్వడు; సర్వము దానయైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్".

ఇందులో భగవంతుడు ఎవరు? అయన లక్షణాలు ఏంటి అన్నవి ఈ పద్యంలో చక్కగా వివరించారు పోతన గారు.

ఈ సకల చరాచరసృష్టి కారణభూతమైన వాడు, సమస్త జీవుల ఉత్పత్తికి మూలకారణమైన వాడు ఆ సర్వేశ్వరుడు ఒక్కడే. దీనిని విశ్వసించి సేవించినవారు ఆయన అపారకరుణకు పాత్రులవుతారు.

నమ్మకం అనే పునాది మీద భక్తి అనే భవంతిని ఎంతయిన పెంచుకుంటూపోవచ్చు. భక్తవత్సలుడు అయిన ఆ భగవానుడు ఆర్తితో పిలిచిన వారి చెంతకు పరుగున వచ్చి తీరతాడు. నమ్మకంతో నారాయణ నామాన్ని స్మరించినన ప్రహ్లాదుని తరింపచేయాటానికి ఉగ్రనరసింహమూర్తిగా స్తంభం నుంచి వెలుబడ్డాడు. భక్తులలో అగ్రగణ్యుడైన ఆంజనేయుని హృదయంలోనే కొలువు తీరాడు శ్రీరామచంద్రుడు.

ఆర్తత్రాణ పరాయణుడైన ఆ భగవానుడు భక్తుల మొరనాలకించి వారిని సంరక్షించడానికి ఉన్నపళంగా ఆఘమేఘాల మీద పరుగులిడి వస్తాడు అనడానికి మనకు గజేంద్రమోక్ష ఘట్టం చక్కని తార్కారణం.

మనకు సంకట పరిస్థితులు ఎదురై దిక్కుతోచని స్థితిలో దేవుడా! నీదేభారం అని శరణాగతి చేసినపుడు ఏదో ఒకరకంగా మన సమస్యకు పరిష్కారం లభించి తీరుతుంది. నిస్సహాయస్థితిలో భగవంతునిపై భారం వేసి, చేతులు జోడించి నమస్కరిస్తే, దైవం మానుషరూపేణ, అన్నట్లు వెన్నంటే ఉండి ఆపదల నుండి గట్టెక్కించేది ఆ దేవదేవుడే. ఈ సత్యాన్ని మనం గ్రహించలేనంత అజ్ఞానంలో ఉంటాం.

కష్టాలు తొలగిపోయి సుఖాలు వచ్చిన సమయంలో ఆ దేవుని విస్మరిస్తారు. సుఖదుఃఖాలను సమానంగా చూసేవాడు దుఃఖించనివాడు, కోరికలు లేనివాడు, శుభాలను అశుభాలను పరిత్యజించిన వాడు నా భక్తుడు అన్నాడు గీతాచార్యుడు.

కలిగియుగంలో మానవులకు భగవంతుని దర్శించుకునే అదృష్టం లేదని, ఆయనెవరికీ కనిపించడు అని చాలామంది భావిస్తూ ఉంటారు. కాని ఏకాలానికి తగినట్లుగా ఆకాలంలో భక్తులను భగవంతుడు అనుగ్రహిస్తూనే ఉంటాడు. సర్వకాల సర్వావస్థలలోను మనలను కంటికి రెప్పలా కాపాడటంలో ఆ పరమేశ్వరుడు నిమగ్నమై ఉంటాడు. కాని దానిని పెడచెవిన పెట్టిన వారు దుర్మార్గపు పనులు చేసి ఇక్కట్ల పాలవుతూ ఉంటారు. తెలుసుకున్న వారు జాగ్రత్త పడి సన్మార్గంలో పయనిస్తారు. చిత్తశుద్ధితో చేసే పనిపట్ల అకుంఠిత దీక్ష కలిగిన వారు పనిలో కూడా పరమేశ్వరుని దర్శించగలుగుతారు.

నిర్మలమైన అంతఃకరణ కలిగి ఉన్నవారు భగవంతుని అనుగ్రహానికి పాత్రులవుతారు. సత్యంలోను, ధర్మంలోను, శీలంలోను నీతిలోను, నిజాయితీలోను, న్యాయంలో, ప్రేమలో పసిపిల్లల బోసినవ్వుల్లో, ఆ పన్నులను ఆదుకొనే అమృత హస్తాల్లో ఇలా భగవంతుడు అంతటా ఉన్నాడు. పరిపూర్ణమైన నిశ్చలమైన భక్తితో ధ్యానిస్తే మనకు ఆ భగవంతుని సాక్షాత్కారం తప్పకుండా ఏదో ఒక రూపంలో లభిస్తుంది.

ఈ సృష్టి మొత్తం వ్యాపించి వుండి, దాని ఉత్పత్తి, పెంపు, లయములకు ఎవరు కారణమవుతున్నారో... అతనినే ‘దేవుడు’ అని అన్నారు మన ఋషులు. మరి ఆ దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు.. అనే సందేహం మనలో చాలా మందికి కలగవచ్చు. నిజాన్ని పరిశీలిస్తే.. పాంచభౌతికమైన మన శరీర అవయవాలకు వున్న శక్తి చాలా పరిమితం.

ఉదాహరణకు:-
*  మన కాళ్ళు ..ఈ విశ్వాన్ని మొత్తం నడచి రాలేవు. వాటికి అంత శక్తి లేదు.
*  మన చేతులు..కైలాస పర్వతాన్ని ఎత్తిపట్టుకుని మోయలేవు. వాటికి అంత శక్తి లేదు.
* మన కళ్ళు..అతి విసృతమై న పదార్ధాన్నిగానీ.. అతి సూక్ష్మమైన పదార్ధాన్నిగానీ.. చూడలేవు. వాటికి అంత శక్తి లేదు. ఆకాశం మన కంటికి కనిపించదు. చూస్తున్నామని అనుకోవడం మన భ్రమ. అతి సూక్ష్మక్రిమి అయిన ‘అమీబా’ ని సూక్ష్మదర్శిని (మైక్రోస్కోప్) సాయంతో చూస్తున్నాం కదా అని మీరు అడగవచ్చు. మన కళ్ళకు అంత శక్తి లేదు కనుకనే.. మనం సూక్ష్మదర్శినిని ఆశ్రయించవలసి వస్తుంది. మరి ఈ కళ్ళతో ‘దేవుని’ చూసిన ఋషులు వున్నారు కదా.. అని మీరు అడగవచ్చు.
* కళ్ళు భౌతికమైన పదార్ధాలను మాత్రమే చూడగలవు. మనోనేత్రం అభౌతికమైన పదార్ధాలను దర్శిస్తుంది. ‘దేవుడు’ మనోనేత్రానికి దర్శనమిస్తాడు. తను సంకల్పించినప్పుడు మాత్రం మన భౌతిక నేత్రాల ముందు ప్రత్యక్షమౌతాడు. చూడడానికి, దర్శించడానికి ఉన్న తేడా అది. మరి మనో నేత్రంతో ‘దేవుని’ దర్శించడం ఎలా? అన్నదే ఈనాటి మన ప్రశ్న.

పంచభూతాల శక్తుల సమ్మిళితమే.. భూలోక జీవుల శరీర నిర్మాణం. అందుకే..  ఈ లోకంలోని జీవులన్నీ భూమిని ఆశ్రయించి జీవిస్తూంటాయి. పంచభూతాల తత్త్వాలు మన శరీరాన్ని ఆవహించి ఉన్నంత వరకూ... వాటికి అతీతంగా ఉండే ‘పరమాత్మ’ మన కళ్ళకు దర్శనమివ్వడు. ఆ దేవదేవుని దర్శించాలంటే... పంచభూత తత్త్వాలనూ, వాటి గుణాలనూ త్యజించాలి. ఏమిటి వాటి గుణాలు, తత్త్వాలు...అంటే..

* ఆకాశానికి ఉన్న ఒకే ఒక గుణం... శబ్దం.
* వాయువుకు ఉన్నగుణాలు రెండు... శబ్దము, స్పర్శ.
* అగ్నికి ఉన్న గుణాలు మూడు... శబ్ద, స్పర్శ, రూపములు.
* జలముకు ఉన్న గుణాలు నాలుగు... శబ్ద, స్పర్శ, రూప, రసము(రుచి)లు.
* భూమికి ఉన్న గుణాలు ఐదు... శబ్ద, స్పర్శ,రూప, రస, గంథాలు.

ఈ ఐదు గుణాలూ...పాంచ భౌతిక తత్త్వాలు గల మన శరీరానికి ఉన్నాయి కనుకనే మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాం.

* జలము…‘గంథము’ అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల, మనం నీటిని చేతితో పట్టుకోలేము. నీటికి మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం. కొంతసేపటికి ఆ నీరు ఆవిరైపోతుందేగానీ.., మనం బంధించలేము.
* అగ్ని...‘రస, గంథము’లనే గుణాలను త్యాగం చేయడం వల్ల, అగ్నిని కళ్ళతో చూడగలమే గానీ, కనీసం తాకనైనా తాకలేము. తాకితే శిక్షిస్తుంది.
* వాయువు...‘రస, గంథ, రూపము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము. వాయువే తనంతట తాను మనలను స్పృశించి తన ఉనికిని మనకు తెలియజేస్తుంది.
* ఆకాశం...‘రస, గంథ, రూప, స్పర్శ’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అది మన కళ్ళకు కనిపించకుండా తను ఉన్నానని మనలను భ్రమింప చేస్తుంది.

కేవలం ఒకే ఒక్క గుణమున్న (శబ్దం) ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు.., ఏ గుణము లేని ఆ ‘పరబ్రహ్మ’ ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడు? అలా చూడాలంటే మన మనో నేత్రాన్ని తెరవాలి. దాన్ని తెరవాలంటే.., పాంచ భౌతిక తత్త్వాలైన గుణాలను, అనగా...ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి.


 

Follow Us:
Download App:
  • android
  • ios