వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత..!

ఉత్తరద్వారం గుండా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనాను గ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది

The Significance of Vaikunta Ekadashi

 

                వైకుంఠ: పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః ప్రుథుః 
                హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజః 


రవి ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. 13 జనవరి 2022 గురువారం రోజు ఏకాదశి.   
వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేయాలి:- పూర్వం అసుర బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్లి ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించి, స్వామి అనుగ్రహం పొంది, రాక్షస పీడ వదిలించుకున్నారు.

ఉత్తరద్వారం గుండా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనాను గ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. దీన్నే హరివాసరమని, హరిదినమని, వైకుంఠ దినమని అంటారు.

ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమంటున్నారు పెద్దలు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు “వైకుంఠ ఏకదశీ వ్రతం” ఆచరించిన వారికి శుభఫలితాలుంటాయి. పర్వత రాజు సలహా మేరకు వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి.

అలాగే కృత యుగంలో “ముర” అనే రాక్షసుడు దేవతులను, సాధువులను క్రూరంగా హింసించే వాడు. ముర అక్రమాలను భరించలేక దేవతలు శ్రీమన్నారాయణుడికి మొరపెట్టుకున్నారు. భగవంతుడు మురాసురుడి మీదికి దండెత్తి అతని వధించాడు. ముర వెళ్లి సాగర గర్భంలో దాక్కుంటే అతన్ని బైటికి రప్పించేందుకు ఉపాయం పన్ని గోవిందుడు గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకున్నాడు.

అదే అదననుకున్న మురాసురుడు గుహలోకి వచ్చి విష్ణువును వధించేందుకు కత్తి ఎత్తగానే మహాలక్ష్మి దుర్గ రూపంలో ప్రత్యక్షమై మురను సంహరించగా ప్రసన్నుడైన పరమాత్మ ఆమెకు ఏకాదశి అన్న బిరుదు ప్రసాదించాడు. నాటి నుంచి ఏకాదశీ వ్రతం పేరుతో అమ్మవారిని అర్చిస్తామని ఇతిహాసల ద్వారా తెలుస్తున్నది. 

వైష్ణవ ఆళ్వారుల్లో శ్రీనమ్మాళ్వారులీ రోజున పరమపదించడం వల్ల శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశీ వ్రత మాచరిస్తారు. ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలతో సహా శ్రీ తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలోను ప్రాత:కాలం నుండి ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం కలుగుతుంది. దీనికి వైకుంఠ ద్వారమని అంటారు. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోని ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నారు.

అందుకే ఈ పర్వదినాన ఉపవాసముండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును షోడశోపచార విధితో ఆరాధించాలి. నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజున మళ్లీ భగవదారాధన ముగించుకుని పారాయణ చేసి గోవుకు శక్త్యానుసారంగా దాన పెట్టాలి, పేదలకు తినే పదార్ధాలు ఇవ్వాలి. ఈ ముక్కోటి ఏకాదశి నా డు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఏకాదశి వ్రతముండే వారికి మరు జన్మంటూ ఉండదని పెద్దలు చెబుతున్నారు.

వైష్ణవ దేవాలయాలలో మామూలు రోజులలో అయితే ఉత్తర ద్వారాలను మూసి ఉంచుతారు. ముక్కోటి ఏకాదశి రోజున మాత్రం తెరచి ఉంచుతారు.  తిరుమల, భద్రాచలం, ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దుబ్బాక శ్రీ బాలాజీ దేవాలయం మొదలైన క్షేత్రాలలో వైకుంఠ ఏకాదశి రోజున భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఏకాదశి రోజున ఉపవాసాన్ని నియమం పాటించాలి. ఈ రోజున ఉపవాసాన్ని పాటించడం వల్ల సూర్య, చంద్రగ్రహణ సమయంలో చేసే దానం, అశ్వమేథయాగం చేసిన ఫలితాలకంటే అధికపలం లభిస్తుంది. 

వృద్దులు, పిల్లలు, ఆరోగ్యం సహకరించనివారు మరియు గర్భిణి స్త్రీలు ఉపవాసదీక్ష చేయరాదు. శారీరక శ్రమ చేసే వారు ఏకాదశి ఉపవాసం చేయాలని కోరిక ఉన్నవారు మాత్రం ఖచ్చితమైన ఉపవాసం చేసే శక్తి లేనివారు పాలు, పండ్లను తీసుకోవచ్చును. అలా కుదరనప్పుడు ఒక పూట శాఖాహార  భోజనం చేయవచ్చును. ఈ ఉపవాస దీక్ష చేసిన చేయకపోయినా.. ఈ రోజంతా మనస్సులో స్వామివారినామ స్మరణ చిత్త శుద్దితో చేస్తే చాలు వారికి  పుణ్యఫలం తప్పక దక్కుతుంది. 

ముఖ్య గమనిక:- భక్తులు ప్రభుత్వ ఆదేశాలానుసారంగా " కోవిడ్ " నిబంధనలు పాటిస్తూ .. భౌతికదూరం పాటిస్తూ తప్పనిసరిగా డబుల్ మాస్కులు ధరించాలి, తరచూ చేతులను శుభ్రపరచుకోవాలి, శానిటాయిజర్ ఉపయోగించుకోవాలి.. లోకా సమస్త సుఖినోభవంతు.. సర్వేజనా: సుఖినోభవంతు ..  జై శ్రీమన్నారాయణ.    

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios