Asianet News TeluguAsianet News Telugu

మాఘ మాసం వచ్చేసిందోచ్.. ఏంటి ప్రత్యేకత?

కురువృద్ధుడు భీష్మాచార్యుడు మరణించిన సందర్భం గుర్తుకు తెచ్చుకుంటారు. ఈ తిథినాడే అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరుపుతుంటారు. ద్వాదశినాడు వరాహ ద్వాదశీ వ్రతం చేస్తారు.

The Significance of Maghamaasam Month
Author
Hyderabad, First Published Jan 24, 2020, 1:52 PM IST

జనవరి 25 తేదీ నుండి మాఘమాసం ప్రారంభం అవుతుంది. మాఘమాసం అంటే చంద్రుడు మఘ నక్షత్రాన ఉండే మాసం మాఘం. 'మఘం' అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్ఠమైనదిగా భావించేవారు. ఈ మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం గనుక మాఘమాసమైంది. 

అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింప చేసేది అనే అర్థాన్ని సూచిస్తాయి . అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది. ఇది మాధవ ప్రీతికరం. స్థూలార్థంలో మాధవుడంటే భగవంతుడు. శివుడైనా, విష్ణువైనా, ఎవరైనా కావచ్చు. ఈ మాసంలో గణపతి, సూర్య తదితర దేవతల పూజలు, వ్రతాలు కూడా జరుగుతుంటాయి.

మాఘ విశిష్టతను గురించి, ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఓ వ్రతంగా ఉంది. మాఘంలో ఎవరికి వారు వీలున్నంతలో నది, చెరువు, మడుగు, కొలను, బావి చివరకు చిన్ననీటి పడియలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం అబ్బుతుంది. చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయటం సర్వోత్తమం. ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం, నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి.

మాఘమాసంలో శుద్ధ విదియనాడు బెల్లం, ఉప్పు దానం చేయటం మంచిది. దీంతోపాటు పార్వతీ పూజ, లలితావ్రతం హరతృతీయ వ్రతం చేస్తుంటారు. శుద్ధ చవితిన ఉమా పూజ, వరదా గౌరీ పూజ, గణేశ పూజ చెయ్యడం మొల్ల పువ్వులతో శివపూజ చెయ్యడం ఉంది. ఈ చవితినాడు చేసే తిలదానానికి గొప్ప పుణ్యఫలం చెప్పారు. శుద్ధ పంచమిని శ్రీపంచమి అని అంటారు. ఈ రోజున సరస్వతీ పూజ చెయ్యటం విశేష ఫలప్రదం. దీన్నే కొన్ని ప్రాంతాల్లో వసంత పంచమి, రతికామదహనోత్సవం అనే పేరున జరుపుకొంటారు.

శుద్ధ షష్టిని విశోకషష్టి అని, మందార షష్టి అని, కామ షష్టి, వరుణ షష్టి అని కూడా అంటారు. ఈ రోజున వరుణ దేవుడిని ఎర్రచందనం, ఎర్రని వస్త్రాలు, ఎర్రని పుష్పాలు, ధూపదీపాలతో పూజించాలి. శుద్ధ సప్తమిని రథసప్తమి అని అంటారు. ఈ రోజున సూర్య జయంతిని జరుపుతారు. రథసప్తమీ వ్రతం ఎంతో విశేషమైనది. అష్టమి నాడు భీష్మాష్టమిని చేస్తారు. కురువృద్ధుడు భీష్ముడికి తర్పణం విడవటం ఈనాటి ప్రధానాంశం. నవమి నాడు నందినీదేవి పూజ చేస్తారు.దీన్నే మధ్వనవమి అని అంటారు. ఆ తర్వాత వచ్చే ఏకాదశికి జయ ఏకాదశి అని పేరు. దీన్నే భీష్మ ఏకాదశి వ్రతమని చెబుతారు. 

కురువృద్ధుడు భీష్మాచార్యుడు మరణించిన సందర్భం గుర్తుకు తెచ్చుకుంటారు. ఈ తిథినాడే అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరుపుతుంటారు. ద్వాదశినాడు వరాహ ద్వాదశీ వ్రతం చేస్తారు. త్రయోదశి విశ్వ కర్మ జయంతిగా పేరు పొందింది. మాఘపూర్ణిమకు మరీ మరీ విశిష్టత ఉంది. ఈ రోజున కాళహస్తిలో స్వర్ణముఖి నదిలో స్నానం చేయటం, ప్రయాగ త్రివేణీ సంగమంలో స్నానం చేయటం విశేష ఫలప్రదాలు. సతీదేవి జన్మించిన తిథిగా కూడా మాఘపూర్ణిమను చెబుతారు.

మాఘమాసంలో వచ్చే కృష్ణపాడ్యమి నాడు సౌభాగ్యప్రాప్తి వ్రతం చేస్తారు. కృష్ణ సప్తమినాడు సర్వాప్తి సప్తమి వ్రతం, సూర్యవ్రతాలు జరుగుతాయి. అష్టమినాడు మంగళా వ్రతం చేస్తుంటారు. కృష్ణ ఏకాదశిని విజయ ఏకాదశి అని, రామసేతు నిర్మాణం పూర్తి అయిన రోజున గుర్తు చేసే తిథి అని చెబుతారు. కృష్ణ ద్వాదశినాడు తిల ద్వాదశీ వ్రతం జరుపుతుంటారు. మాఘ కృష్ణ త్రయోదశిని ద్వాపర యుగాదిగా పేర్కొంటారు. మాఘ కృష్ణ చతుర్దశి నాడు మహశివ రాత్రి పర్వదినం వ్రతం జరుపుతారు. మాఘమాసంలో చివరిదైన కృష్ణ అమావాస్యనాడు పితృశ్రాద్ధం చెయ్యడం అధిక ఫలప్రదమని పెద్దలంటారు.ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు, పర్వదినాలు, వివిధ దేవతలను ఉద్దేశించి జరపుకోవటం కనిపిస్తుంది. అందుకే మాసానికి తొలినాళ్ళ నుండి అంత విశిష్టత ఉంది.

The Significance of Maghamaasam Month

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Follow Us:
Download App:
  • android
  • ios