Asianet News TeluguAsianet News Telugu

కార్తీక పౌర్ణమి విశిష్టత

మౌలికంగా హరిహరులు అభిన్నులైనా సత్వ గుణానికి స్వామి అయిన విష్ణువు సాత్వికుడని, తమో గుణ నియంత అయిన శివుడు తామసుడని చెప్పబడతారు. శివ భగవానుడు తమోగుణాన్ని నియంత్రించేవాడే కానీ తమస్సుకు లొంగేవాడు కాదు

The Significance of Karthika Pournami
Author
Hyderabad, First Published Nov 19, 2021, 9:08 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151


                "మాధవో మాధవీశౌద్వౌ సర్వసిద్ధి విధాయినౌ
                 వందే పరస్పరాత్మానౌ పరస్పర నుతి ప్రియౌ"


                "శివాయ విష్ణురూపాయ, శివరూపాయ విష్ణవే
                 శివస్య హృదయ విష్ణుః విష్చోశ్చ హృదయం శివః"

 
సంస్కృత భాగవత పురాణ భాష్య ప్రస్తావనలో వ్యాఖ్యాతృ చక్రవర్తి శ్రీధరాచార్యులు రచించిన శ్లోకమిది. ఒకరికొకరు ఆత్మగా ఉన్నవారు, ఒకరి ప్రశంసకు మరొకరు ప్రీతి వహించువారు, భక్తులకు సర్వవిధ సిద్ధులు ప్రసాదించు లోకనాథులైన ఉమానాథ రమానాథులకు నమస్కారమని శ్లోక తాత్పర్యం. ‘శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః’అని శ్రుతి. శివకేశవులకు అభేదాన్ని చాటింది. హరిహరులు పరస్పర ఆసక్త హృదయులు. ఒకే పరతత్వం శివ, స్కాందాది పురాణాల్లో శివుడుగా, విష్ణుపురాణ, రామాయణ, భాగవతాల్లో విష్ణు, రామ, కృష్ణులుగా.. దేవీ భాగవతంలో ఆదిపరాశక్తిగాను అభివర్ణితమైంది. ‘భక్త చిత్తాను రోధేన ధత్తే నానా కృతీః స్వయం’భక్తుల భావనకు తగినట్లు ఒకే తత్వం వివిధంగా వ్యక్తమవుతుంది. విశ్వనాథ, జగన్నాథ నామాలే శివ, కేశవులకు అభేదాన్ని చెప్పకనే చెబుతున్నాయి. 

మౌలికంగా హరిహరులు అభిన్నులైనా సత్వ గుణానికి స్వామి అయిన విష్ణువు సాత్వికుడని, తమో గుణ నియంత అయిన శివుడు తామసుడని చెప్పబడతారు. శివ భగవానుడు తమోగుణాన్ని నియంత్రించేవాడే కానీ తమస్సుకు లొంగేవాడు కాదు. శివకేశవులిద్దరూ స్వరూపతః త్రిగుణాలకు అతీతులే! కృష్ణ యజుర్వేదీయ రుద్ర హృదయోపనిషత్తులో ‘యా ఉమా సా స్వయం విష్ణుః’ఉమాదేవే విష్ణువని చెప్పబడింది. ‘ఉమా శంకరయోర్యోగః సయోగో విష్ణురుచ్చతే’శివపార్వతుల యోగమే (కూడిక) విష్ణువుగా వక్కాణింపబడింది. అంతేకాదు, శివకేశవులది అనితరసాధ్యమైన ఉపాస్య-ఉపాసక సంబంధం. 

ఈ అనుబంధం, ఆత్మీయత అనాది, అనంతమూను. శాస్త్రరీత్యా సత్వగుణం రంగు తెలుపు. తమోగుణం రంగు నలుపు. దీన్నిబట్టి సత్వగుణ విశిష్టుడు విష్ణుమూర్తి తెల్లగాను, తమోగుణ అధిపతి రుద్రుడు నల్లగాను ఉండాలి. అలానే ఉండేవారుట. మరి ఇప్పుడు? అలా లేరే! నళినాయతాక్షుడు నారాయణుడు నీలమేఘ శ్యాముడు. కరుణావతారుడు కపర్తి కర్పూరగౌరుడు. ఈ వర్ణవ్యత్యయానికి రంగుల మార్పునకు కారణమేమిటి? అంటే భాష్యకారులన్నారు.. పరస్పర ధ్యానం వల్ల కలిగిన తన్మయత్వం కారణంగా వారి శరీర ఛాయలు తారుమారైనవిట. ఈ విశ్లేషణ ఎంత స్వారస్యభరితమో అంతే శాస్త్రసమ్మతం కూడా. అలాగే వైష్ణవ తిలకం ఊర్థ్వపుండ్రం త్రిశూలానికి రూపాంతరం అనిపిస్తుందని.. శైవతిలకం త్రిపుండ్రం వైష్ణవ ధనువైన శార్జ్ఞ్గ రూపాన్ని తలపిస్తుందని ధర్మమర్మజ్ఞుల కథనం రసజ్ఞుల విజ్ఞతకు ఇది ఆలోచనామృతం.

అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ రోజున చేసే స్నానం అయినా, దానం అయినా, హోమం అయినా అనంతమైన పుణ్యాన్ని ఇస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున నదీస్నానం చేసి సాయంత్రం దీపం వెలిగించాలి. చేయడం వల్ల పొందే ఫలాన్ని ఈ ఒక్కరోజు దీపారాధన చేయడం వల్ల పొందచ్చును.

* శివకేశవులకు ప్రీతిపాత్రమైనది కార్తీక 'పౌర్ణమి' మాసం.  

* కార్తీక పౌర్ణమి నాడు సత్యనారాయణ వ్రతం చేసిననూ లేదా వ్రతకథను విన్నా శుభం కలుగుతుంది. సంధ్యా సమయంలో దేవాలయంలో గానీ రావిచెట్టు దగ్గర గానీ లేదా తులసి దగ్గర గానీ దీపం వెలిగించాలి. 

* ఈ రోజున మహాశివుడికి నమక, చమక, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకాలు చేయిస్తే ఆ భోళాశంకరుడు ప్రసన్నుడు అవుతాడని పురాణాలలో చెప్పబడివుంది.

* ఈ పర్వదినాన తులసి చెట్టు పక్కన ఉసిరిచెట్టు ( కాయలతో సహా ) కొమ్మను ఉంచి దాని పక్కన రాధాకృష్ణుల విగ్రహాన్ని పెట్టి పెళ్ళికాని అమ్మాయిలు పూజ చేస్తే కోరుకున్నవాడే భర్తగా లభిస్తాడు.

* కార్తీక పౌర్ణమినాడు ఉసిరికాయ దానం చేస్తే దారిద్యం నశించిపోతుంది. కార్తీక పౌర్ణమి రోజు లలితాదేవిని  లలితా సహస్రనామాలతో అర్చిస్తే ఆ లలితాదేవి సిరిసంపదలు కలుగజేస్తుంది. 

* ఈ రోజున దీపారాధన చేస్తే ఆ పరమశివుడి అనుగ్రహం పొందవచ్చని, ఆరిపోతున్న దీపంలో నూనె పోసినా పుణ్యమే. కార్తీక పౌర్ణమి రోజున శివాలయంకు వెళ్ళి ఆ పరమ శివుడి దర్శనం చేసుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి.

* కార్తీక పౌర్ణమినాడు శివ అష్టోత్తరము, లింగాష్టకంలను పఠిస్తే పాపాలు తొలగిపోతాయి. ఈ రోజు మట్టి ప్రమిదల్లో 1008 వత్తులు వేసి దీపారాధన చేయాలి.

* నక్షత్రహారతి కోసం ఆవు నేతిని, దీపారాధన కోసం నువ్వుల నూనెను వాడాలి. 

* విష్ణు సహస్రనామ పారాయణం, లలిత పారాయణం, లక్ష్మీ అష్టోత్తరం, శివ పంచాక్షరీ స్తోత్రము, శివ సహస్ర నామము, శివ పురాణములను పారాయణం చేస్తే సకల సంపదలు కలుగుతాయి. కార్తీక పౌర్ణమినాడు పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటే పుణ్యం కలుగుతుంది.

* కార్తీక పౌర్ణిమ సందర్భంగా పేదలకు, ఆనారోగ్యంతో ఉన్న వారికి, అవిటి వారికి అనాధాలకు అన్న, వస్త్ర దానం చేస్తే హరిహరుల అనుగ్రహం లభిస్తుంది. 

* గోమాతకు మీ శక్త్యనుసారంగా ఏదైనా దాన పెట్టి మూడు ప్రదక్షిణలు చేసుకుంటే చాలా మంచిది.  


 

Follow Us:
Download App:
  • android
  • ios