డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

భారతీయ హిందు సాంప్రదాయ ఆచార వ్యవహారలాలో ఎన్నో మర్మవిషయాలు, రహస్యాలు దాగి ఉంటాయి. మనిషిగా భూమి మీదకు రానప్పుడే అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు శ్రీమంతం కార్యం నుండి మొదలిడి మరణం అంటే అత్యేష్టి వరకు మానవునుకి షోడశ ( పదహారు ) కర్మలు జరిపించాలని మన సనాతన భారతీయ ధర్మం సూచన చేసింది. ప్రతి కార్యం చేయడంలో మనకు తెలియని ఎన్నో విషయాలలో నిగూఢమైన పరమార్ధం దాగి ఉంటుంది. వాటిని అందరూ అంత తేలికగా అర్ధం చేసుకోలేరు. పెద్దలు ఎందుకు చెప్పారో ఆచరిస్తే పోలే అని కొందరు వ్యవహరిస్తుంటారు. ఏది ఏమైనా అనాదిగా వస్తున్న సాంప్రదాయాలను విధిగా పాటించడమే మన కర్తవ్యం.

దేవునికి తలనీలాలు ఎందుకివ్వాలి? ఫ‌లితం ఏంటీ? అనే సందేహం చాలామందికి వ‌స్తుంటుంది. నిజానికి దేవునికి తలనీలాలు ఇవ్వడం సంప్రదాయంగా వస్తున్న ఆచారం. తిరుమల దేవునికి కల్యాణకట్టలో భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. శిరోజాలు పాపాలకు నిలయాలని పురాణాలు చెబుతున్నాయి. వాటిని తీసేయడం ద్వారా పాపాలను తొలగించుకుంటాం. గర్భంలో వున్న శిశువు తన తల ద్వారా భూమిపైకి వస్తాడు. శిశువుకున్న తల వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించిన అనేక విషయ వాసన వలన పాపాలు అనేవి తల జుట్టుకు అట్టిపెట్టుకుని వుంటాయి. అందుకనే చిన్న వయసులోనే కేశఖండన 
( పుట్టు వెంట్రుకలు ) కార్యక్రమం నిర్వహిస్తారు. 

పాపాలను కలిగివున్నందునే శిరోజాలను ‘శిరోగతాని పాపాని’ అంటారు. భగవంతునికి భక్తితో తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకుంటాం. ఒక రకంగా చెప్పాలంటే మన శిరస్సును భగవంతునికి అర్పించే బదులు కేశాలను ఇస్తాం. తల వెంట్రుకలను తీయడంపై మహాభారతంలో ఒక సంఘటన వుంది. జయద్రధుడు (సైంధవుడు)ని సంహరించేందుకు భీముడు సిద్ధమైన నేపథ్యంలో ధర్మరాజు అతడిని వారిస్తాడు. కౌరవుల సోదరి దుశ్శల భర్త సైంధవుడు. అతన్ని వధించడం ధర్మసమ్మతం కాదు. అందుకనే తల వెంట్రుకలను తీసేస్తే, తల తీసేసినంత పనవుతుందని వివరిస్తాడు. 

శిశువు పుట్టిన సంవత్సరంలోపు మొట్ట మొదటి సారిగా పుట్టు వెంట్రుకలు తీసేందుకు ఎందుకు ముహుర్తానాకి ప్రాధాన్యత ఇచ్చారంటే శిశువు మొదటి సారి జుట్టు తీయడం వలన గతజన్మ పాప ప్రక్షాళనతో బాటు మంచి జ్ఞానార్జనకు ఉపయోగకరంగా ఉండెందుకు ముహూర్తం ఉపయోగ పడుతుంది. వాటికి సంబంధించిన వివరాలను కొన్నింటిని ఈ క్రింది వాటిలో గమనిద్దాం.

* పుట్టు వెంట్రుకలు ఏ సంవత్సరంలో తీయాలి అనే విషయానికొస్తే శిశువు పుట్టిన సంవత్సరంలోపు, మూడవ ఏట అది తప్పితే ఐదు సంవత్సరాలలో తీయాల్సి ఉంటుంది. 

* ఇందులో విశేషించి ఉత్తరాయణ పుణ్యకాలంలో పుట్టు వెంట్రుకలు ( కేశ కండన ) కార్యక్రమం జరిపించాలి.  

* మగ పిల్లలకు సరిమాసంలో, ఆడ పిల్లలకు బేసి మాసంలో తీయాలి.

* జాతకం ఆధారంగా తారాబలం, శుభ లగ్నం, శుభ గ్రహ సంపత్తి మొదలగు అంశాలను పరిగణలోకి తీసుకుని అనుభవజ్ఞులైన జ్యోతిష పండితుని ద్వార ముహూర్తం నిర్ణయం చేయించుకుని కార్యం నిర్వహించాల్సి ఉంటుంది.

* అనుకూలమైన వారాలు :- సోమ , బుధ, గురు, శుక్రవారాలలో మధ్యాహానం 12 లోపు తీయిచాలి.

* అనుకూల తిధులు :- శుక్లపక్ష విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి తిధులు మంచివి.

* ఈ కార్యం చేయుటకు ఘాతవార దోషం వర్తించదు. ( ఘాతవారంలో అయిననూ ముహూర్తం కలిస్తే చేయవచ్చును )  

* గురు, శుక్ర మౌడ్యాలలో చేయకూడదు.

* కుటుంబ పెద్ద మరణించిన ఇంట్లో అబ్ధికం చేసే వరకు పిల్లల పుట్రువెంట్రుకలు తీయకూడదు. 

* మొదటపుట్టిన ( తోలుచూరు ) పుత్రిక, పుత్రునకు జ్యేష్ఠమాసములో తీయకూడదు.

* శిశువు తల్లి గర్భవతిగా ఉండి 5 నెలలు దాటినా పుట్టు వెంట్రుకలు తీయరాదు.

ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమనగా మనకు అనుకూలంగా ఉన్న సమయంలో ముహూర్తం పెట్టమని జ్యోతిష పండితున్ని ఒత్తిడి చేయకూడదు. శిశువు జాతక బలం ఆధారంగా శాస్త్ర సూచిత నియమాలకు అనుగుణంగా సరైన ముహూర్తం ఎప్పుడు వస్తుందో అప్పుడే చేయాలి. ముహూర్త నిర్ణయం కొరకు  సిద్దాంతి వద్దకు వెళ్ళినప్పుడు తప్పక "స్వయం పాకం"  పండ్లు, వస్త్రం, దక్షిణ, రెండు కుడుకలు, వక్కలు, ఖర్జర పండ్లు తీసుకుని వెళ్లి పండితునికి ఇచ్చి ఆశీస్సులు తీసుకోవాలి.