డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

 ఈ సంవత్సరం మనకు అధిక ఆశ్వీయుజమాసం వచ్చినందువలన చాలా మంది బొడ్డెమ్మ ఎప్పుడు, ఎంగిలిపూల బతుకమ్మ ఎప్పుడు, సద్దుల బతుకమ్మ ఎప్పుడు జరుపుకోవాలనే సంధిగ్ధంలో ఉన్నారు. సెప్టెంబర్ 18 తేది నుండి అధిక మాసం ప్రారంభం అవుతుంది. అధిక మాసం అంటే రవి సంక్రాంతి లేనిది అధికమాసం అవుతుంది.  

ఒక అధిక మాసం పైన 30 మాసాలు గడిచాక ఎనమిది లేదా తొమ్మిది  నెలలలో తిరిగి అధిక మాసం వస్తుంది. అధిక మాసమునకు 'మలమాసం' అని  పేరుగా కూడా పిలుస్తారు. ఈ అధిక మాసంలో సంధ్యాగ్ని హోత్రాది నిత్య కర్మలు చేయవచ్చును. జ్యోతిష్టోమాది కర్మలు, జాతకర్మలు మొదలగు నైమిత్తికాలు చేయరాదని 'ధర్మసింధు' స్పష్టంగా తెలియజేసింది. 

అధిక మాసంలో శుభకార్యాలకు ముహూర్తాలు ఉండవు. తెలంగాణ ప్రాంత సాంప్రదాయ ప్రకారం భాద్రపద అమావాస్య  'పెత్తరమాస' రోజు కుటుంబంలో గతించిన పెద్దలకు మధ్యాహ్నం లోపు బియ్యాన్ని 'స్వయం పాకాన్న' దానం చేసి అదే రోజు మధ్యాహ్నం ఆనవాయితీగా 'ఎంగిలిపూల'  బతుకమ్మ పేర్చుకుని క్రమేపి సద్దుల బతుకమ్మ వరకు వరుసగా బతుకమ్మలు పేర్చుకుని ఆడుకుంటారు.

బొడ్డెమ్మ పండగ అనేది ప్రాంతాల వారిగా కొన్ని కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. కొన్ని ప్రాంతాలలో అమావాస్యకు ఐదు రోజుల ముందు బహుళ దశమి తిధి నుండి ప్రారంభిస్తే ఇంకొన్ని ప్రాంతాలలో మూడు రోజుల ముందు బహుళ ద్వాదశి నుండి బొడ్డెమ్మను పేర్చుకుంటారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 12 తేది శనివారం, దశమి తిధి రోజే కానీ లేదా 14 తేది సోమవారం ద్వాదశి రోజే కానీ ఆయా ప్రాంత ఆచార వ్యవహారాలను బట్టి బొడ్డెమ్మను పేర్చుకోవాలి.

ఎంగిలి పూల బతుకమ్మ అంటే ఏమిటి అనే సందేహం చాలా మందికి వస్తుంది. మొదటి బతుకమ్మను ఆశ్వీయుజ బహుళ అమావాస్య రోజు పేర్చుకుం టారు. అమావాస్య రోజు పువ్వులను కోయకూడదు అనే శాస్త్రనియమం ఉన్నది కావున అమావాస్యకు ఒక రోజు ముందు రోజు అనగా చతుర్దశి రోజు చెట్ల నుండి పువ్వులను కోసి అమావాస్య రోజు బతుకమ్మను పెర్చుటకు వాడుతుంటారు కాబట్టి పువ్వులు తాజావి కావు కాబట్టి వాటిని ఎంగిలి పూలు అంటారు. ఇంకో విషయం కూడా ఇక్కడ మనం  గమనించ వలసినది ఉంది. పువ్వులు మొగ్గ స్థాయి నుండి పుష్పంగా వికసించే క్రమంలో తుమ్మెదలు...లాంటి కీటకాలు, పక్షులు పూల మకరందం కొరకు పూలపై వాలి మకరందం సేకరించడం వలన పూలు ఎంగిలి పడిపోతాయి. ఇలా ఎదో రకంగా తాజా తనాన్ని కోల్పోయిన పూలతో బతుకమ్మ పేర్చడం వలననో లేదా కీటకాల వలన ఎంగిలి జరిగిందనో వీటికి ఎంగిలి పూల బతుకమ్మ అనే పేరు ఏర్పడింది.   

ఎంగిలిపూవ్వు బతుకమ్మను సెప్టెంబర్ 17 గురువారం అమావాస్య రోజు ఆనవాయితీగా పేర్చుకోవాలి. సెప్టెంబర్ 18 తేది శుక్రవారం నుండి అధిక ఆశ్వీయుజమాసం ప్రారంభం అవుతుంది కావున అనుకూలంకాదు కాబట్టి నెల రోజుల తర్వాత అనగా అక్టోబర్ 17 వ తేది శనివారం నిజ ఆశ్వీయుజమాసం శుద్ధ పాడ్యమి రోజు నుండి మొదలుకుని ఎనమిది రోజులపాటు బతుకమ్మ ఆడుకుని 24 వ తేది శనివారం 'దుర్గ' అష్టమి రోజున సద్దుల బతుకమ్మ వేడుక జరుపుకోవాలి. తెలంగాణ ప్రాంతంలో ప్రాంతాల వారిగా బిన్న అభిప్రాయలూ, ధర్మసందేహాలు పండగ ఎప్పుడు జరుపుకోవాలను గందరగోళం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకిని పలు ప్రాంతాల వైదిక పురోహిత సంఘాలు బతుకమ్మ పండగను పై తెలిపిన విధంగా జరుపుకోవాలని తీర్మానించారు.  

ఇంకొన్ని సంఘాలా అభిప్రాయ ప్రకారం 16 అక్టోబరు శుక్రవారం ఎంగిలిపువ్వు బతుకమ్మ 24 అక్టోబర్ శనివారం సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకోవాలని 17 సెప్టెంబర్ ఎంగిలిపువ్వు బతుకమ్మను ఆడితే నెలరోజులు వ్యత్యాసం వస్తుందని ఇంకొదరి అభిప్రాయం. నెల రోజులు ఆపడం సరియైన పద్దతి కాదు కావున ప్రాంతీయ ఆచారం ప్రకారం 9 రోజుల్లో బతుకమ్మను ఆడాలని కావున అక్టోబర్ 16 నుండి  24 తేదీలలో బతుకమ్మ పండుగ జరుపుకోవాలి కొందరి అభిప్రాయం. 

ఇది ఇలా పక్కనబెట్టి శాస్త్రీయ ప్రామాణికత ప్రకారం శాస్త్రాలు ఏమంటున్నాయంటే ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన పండుగలను ఆయ ప్రాంతాలలోని ప్రధాన దేవాలయ ప్రధాన పురోహితుని సూచనల మేరకు పండగలు నిర్వహించుకోవాలని సూచించడం జరిగింది.