ఉన్న స్థానం నుండి ఉన్నతమైన స్థానానికి చేర్చే దైవమే ఉపాధ్యాయుడు
ఆదియుగం నుంచి ఆధునికయుగం వరకు ఆయనే రుషి. జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు. సమాజమనే దేవాలయానికి నిజమైన అర్చకుడు, రక్షకుడు. ఆయనెవరో కాదు మనందరికీ విద్యా బుద్ధులు నేర్పే గురువు. అందుకే మన సమాజంలో అమ్మానాన్నల తర్వాత స్థానం గురువులకు ఇచ్చారు.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
గురుర్బహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః
ఈ రోజు సెలవుదినం కాదు. ఉత్సవం జరుపుకొనవలసిన దినం. పాఠశాలలు యధావిధిగా జరిగి, ఉత్సవాలు జరుపుకుంటాయి. ఈ రోజున ఉపాధ్యాయులకు జాతీయ, రాష్ట్రీయ, జిల్లా స్థాయిలలో పురస్కారాలు, గౌరవసత్కారాలు జరుగుతాయి. మనం పుట్టినప్పటి నుండి జీవితంలో స్థిరపడే వరకు ప్రతి దశలోనూ ఉపాధ్యాయుడి ముద్ర ఎంతైనా ఉంది. అ ఆ ల నుండి మొదలై ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానం చేరే వరకు ఈ ప్రస్థానంలో ప్రతి అడుగు చేయి పట్టుకుని మనల్ని నడిపించింది మన గురువులే. పాఠశాల లేని పల్లెటూరైనా ఉండొచ్చేమోగానీ ఉపాధ్యాయుడు లేని ఊరు మాత్రం ఉండకూడదు. పాఠాలు చెప్పే ప్రతీ వ్యక్తి ఉపాధ్యాయుడే, ఉపాధ్యాయుడంటే పాఠశాలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే వ్యక్తే కానక్కరలేదు. బ్రతుకుతెరువుకోసం పాఠాలు చెప్పుకునే ప్రతివ్యక్తీ ఉపాధ్యాయుడే, బ్రతుకు మార్గాన్ని పాఠశాల నుంచి చూపించే ఉద్యోగస్తుడూ ఉపాధ్యాయుడే. ఉపాధ్యాయుడు ఎక్కడివాడైనా ఆయన స్థానం అత్యుత్తమమైనది. అనిర్వచనీయమైనది.
ఆదియుగం నుంచి ఆధునికయుగం వరకు ఆయనే రుషి. జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు. సమాజమనే దేవాలయానికి నిజమైన అర్చకుడు, రక్షకుడు. ఆయనెవరో కాదు మనందరికీ విద్యా బుద్ధులు నేర్పే గురువు. అందుకే మన సమాజంలో అమ్మానాన్నల తర్వాత స్థానం గురువులకు ఇచ్చారు. శిశువును లోకానికి పరిచయం చేసిన అమ్మ మొదటి గురువైతే, గుండెలపై తన్నుతూ ఆటలాడే శిశువుకు నడక నేర్పే నాన్న రెండో గురువు. ఆ తర్వాత ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో నేర్పి, విద్యా బుద్ధులు అందించే ఉపాధ్యాయుడు మూడో గురువు. అందుకే పెద్దలు మాతృదేవో భవ.. పితృదేవో భవ.. ఆచార్య దేవోభవ అన్నారు.
ఇంతటి ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి, గురువు జాతి గౌరవాన్ని లోకానికి చాటి చెప్పిన మన దేశ రెండో రాష్ట్రపతి మేధావి, విద్యావేత్త అయిన డాక్టర్ సర్వేపల్లి రాధకృష్ణ జయంతిని ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించింది. ప్రతి యేటా సెప్టెంబర్ 5న గురువులను గౌరవించుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ నేపథ్యంలో గురువు గొప్పదనం ఉపాధ్యాయ దినోత్సవం విశిష్టతను అవపోసన చేసుకుందాం.
దేవుడు, గురువు పక్కపక్కనే ఉంటే నేను మొదట గురువుకే నమస్కరిస్తాను అన్నారు మహానుభావుడు కబీర్ దాస్. ఎందుకంటే ఆయన భగవంతుడు అని మొదట తనకు చెప్పింది గురువే కాబట్టి అని వివరించారు. సమాజంలో గురువుకు ఉన్న స్థానం అంత గొప్పది. ‘గు’ అంటే చీకటి, ‘రు’ అంటే పోగొట్టేది అని అర్థం. అంటే మనలో అజ్ఞాన పొరలు తొలగించి జ్ఞానదీప్తిని వెలిగించేవాడు గురువు అన్నమాట. అలాంటి గురువును దైవం కంటే మిన్నగా ఆరాధించే సంస్కృతి మనది.
అజ్ఞానమనే చీకటిని తొలగించే వాడే గురువు మన సంస్కృతిలో గురువుకి చాలా గొప్ప స్థానం ఉంది. మాతృ దేవోభవ,పితృ దేవోభవ, ఆచార్య దేవోభవఅని అన్నారు పెద్దలు. తల్లిదండ్రుల తరువాత అంతటి వారుగా గురువుని కీర్తించారు వారు. గురువంటే నవ నాగరిక సమాజంలో ఆయనో సాధారణ మనిషి, ఆదియుగం నుండీ ఆధునిక శకం వరకూ ఆయనే ఋషి, జాతి జీవన వికాస మార్గదర్శకుడతడు, సమాజ దేవాలయానికి సిసలైన పురోహితుడు. సృష్టి, స్థితి, లయల నిర్దేశకుడు అతడే ఉపాధ్యాయుడు.
ప్రాచీన కాలంలో గురుకులాలు ఉండేవి. గురువుకి గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం సాగించేవాళ్ళు. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు లాంటి వాళ్ళు కూడా గురువులకి సేవ చేసి చదువుకున్నవారే. ఇప్పుడు విద్యావిధానం చాలా మారిపోయింది. అయినప్పటికీ గురువుల పాత్ర ఏమి తగ్గలేదు సరికదా ఇంకా ఎక్కువైంది. అంతకుముందు అయిదేళ్ళ వయసులో బడిలో చేరిస్తే ఇప్పుడు రెండేళ్ళకో మూడేళ్ళకో చేరుస్తున్నారు. దాంతో ఇంకా ఎక్కువ శ్రధ్ధ పెట్టాల్సి వస్తోంది.
వేదాలలో దేవుళ్లకన్నా గురువుకే అగ్రతాంబూలం ఇచ్చారు ఒక ఇంజనీర్ మరొక ఇంజనీరుని చేస్తాడేమో, ఒక డాక్టర్ మహా అయితే ఇంకో డాక్టర్ ని తయారు చేస్తాడేమో కానీ కేవలం ఒక టీచర్ మాత్రమే ఎంతో మంది డాక్టర్లని మరెంతో మంది ఇంజనీర్లని, ఇంక వివిధ రంగాలలో ఉన్నతమైన స్థానానికి చేర్చగలడు, అంతే కాదు లోకహితం కోరి విద్యాదానం చేసే సంస్కారవంతులైన తనలాంటి టీచర్స్ ని తయారు చేయగలడు. అందుకేనేమో వేదాలలో గురువుకి దేవుడి కన్నా అగ్రతాంబూలం ఇచ్చారు.
ఈ ఉపాధ్యాయ దినోత్సవం ఎలా ఆవిర్భవించింది అనే విషయానికొస్తే సర్వేపల్లి రాధాకృష్ణ గారు బ్రతికున్న సమయంలో కొంత మంది విద్యార్ధులు, స్నేహితులు కలిసి ఆయన పుట్టినరోజుని వేడుకగా చేద్దామని అంటే దానికి ఆయన నా పుట్టినరోజుకంటే కూడా దాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా చేస్తే సంతోషిస్తాను అని అన్నారట. దాంతో ఈ గురు పూజ్యోత్సవం మొదలైంది.
మనం ఈ రోజు ఎంత ఏ స్థాయిలో ఉన్నా మనకు చదువు చెప్పి మన ఉన్నతికి సహాయపడిన గురువులని మర్చిపోలేము, మర్చి పోకూడదు. అందుకే ఎంత ధనవంతులైనా, గొప్పవారైనా, గురువులకు శిరస్సు వంచి నమస్కారం చేస్తారు, చేయాలి. కొవ్వొత్తిలా తన్ను తాను కరిగించుకుని సమాజాన్ని వెలిగించేవాడే గురువు. మన ఉన్నతికి పాటుపడి, మనల్ని ఈ స్థాయికి చేర్చిన గురువులని ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్మరించుకుందాం.. మరొక్కసారి గురువులందరికీ గురుపూజ్యోత్సవ శుభాకాంక్షలు.